సొంతూళ్లకు చేరుకున్న మత్స్యకారులు  | Fishermen who have reached their homes | Sakshi
Sakshi News home page

సొంతూళ్లకు చేరుకున్న మత్స్యకారులు 

Published Wed, Feb 5 2020 5:55 AM | Last Updated on Wed, Feb 5 2020 5:55 AM

Fishermen who have reached their homes - Sakshi

మత్స్యకారులను కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్న కలెక్టర్‌ హరిజవహర్‌లాల్, ఎమ్మెల్యే అప్పలనాయుడు

సాక్షి, అమరావతి/పాత పోస్టాఫీసు (విశాఖ దక్షిణ)/విజయనగరం ఫోర్ట్‌: బతుకుదెరువు కోసం దేశ సరిహద్దులు దాటి ఆయా దేశాల జైళ్లలో మగ్గుతున్న బాధితులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చొరవతో విముక్తి లభించింది. సముద్రంలో వేటాడుతూ పొరపాటున బంగ్లాదేశ్‌ సముద్ర జలాల్లో ప్రవేశించి ఆ దేశంలో అరెస్టైన 8 మంది మత్స్యకారులను రాష్ట్ర ప్రభుత్వం విడిపించింది. వీరంతా మంగళవారం స్వగ్రామాలకు చేరుకున్నారు. అలాగే ఇంతకుముందు పాకిస్థాన్‌ జైళ్లలో మగ్గుతున్న మత్స్యకారులకు, ఏజెంట్ల మాటలు నమ్మి మోసపోయి మలేషియా, కువైట్‌లో అష్టకష్టాలు పడుతున్న బాధితులకు కూడా సీఎం చొరవతో విముక్తి లభించిన విషయం తెలిసిందే. తాజాగా బంగ్లాదేశ్‌ జైళ్లలో మగ్గుతున్న మత్స్యకారులను సురక్షితంగా విడిపించి వారిని కుటుంబ సభ్యుల వద్దకు చేర్చడంతో సీఎం వైఎస్‌ జగన్‌పై రాష్ట్రవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది.  

బంగ్లాదేశ్‌ నుంచి 8 మంది మత్స్యకారుల విడుదల 
గతేడాది అక్టోబర్‌ 2న అరెస్టు అయిన 8 మంది మత్స్యకారులను విడిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించడంతో బంగ్లాదేశ్‌ గత బుధవారం వారిని విడుదల చేసింది. మత్స్యకారులు మంగళవారం విజయనగరం కలెక్ట్‌రేట్‌కు చేరుకున్నారు. జిల్లా కలెక్టర్‌ ఎం.హరిజవహర్‌లాల్, నెల్లిమర్ల ఎమ్మెల్యే అప్పలనాయుడు మత్స్యకారులకు స్వాగతం పలికి కుటుంబ సభ్యులకు అప్పగించారు. స్వగ్రామాలకు చేరుకున్నవారిలో బోటు డ్రైవరు మరుపల్లి పోలయ్య (43), రాయితి అప్పన్న (41), వాసుపల్లి అప్పన్న (24), మరుపల్లి నరసింహ (43), బర్రి రాములు (31), వాసుపల్లి అప్పన్న (41), రాయితి రాము (24), వాసుపల్లి దానయ్య (51) ఉన్నారు. వీరంతా విశాఖ ఫిషింగ్‌ హార్బర్లో ఉన్న గంగమ్మ గుడికి తరలివచ్చి అమ్మవారికి పూజలు నిర్వహించారు. తమ విడుదలకు కారణమైన సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.  

పాకిస్థాన్‌ జైళ్లలో మగ్గుతున్నవారికి విముక్తి 
గుజరాత్‌ సముద్ర తీరంలో చేపల వేట సాగిస్తూ పొరపాటున పాకిస్థాన్‌ పరిధిలోని సముద్ర జలాల్లోకి ప్రవేశించి అరెస్ట్‌ అయిన 20 మంది మత్స్యకారులకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ చొరవతో విముక్తి లభించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా బాధితులను తీసుకురావడానికి మంత్రి మోపిదేవి వెంకట రమణారావు స్వయంగా పాకిస్థాన్‌ సరిహద్దులోని వాఘా బోర్డర్‌ వరకు వెళ్లారు. అదేవిధంగా ఉపాధి కోసం మలేషియా వెళ్లి వీసా గడువు ముగియడంతో అక్కడే మగ్గిపోతున్న 97 మందిని కూడా రాష్ట్ర ప్రభుత్వం రక్షించింది. ఏజెంట్‌ చేతిలో మోసపోయి కువైట్‌లో అష్టకష్టాలు పడుతున్న పశ్చిమ గోదావరి జిల్లా మహిళకూ సీఎం కృషితో విముక్తి లభించింది. కువైట్‌లో ఉన్న మరో 15 మందిని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది.  

సీఎం చొరవ వల్లే బాధితులకు విముక్తి 
శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన మత్స్యకారులు పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ జైళ్ల నుంచి విడుదలై తిరిగొచ్చారంటే అందుకు సీఎం వైఎస్‌ జగన్‌ చూపిన ప్రత్యేక చొరవే కారణం. పరాయి దేశాల్లో బందీలవుతున్న మత్స్యకారులను ఆదుకునేలా, వలసలను అరికట్టి స్థానికంగా ఉపాధి చూపేలా ప్రభుత్వం రెండు మేజర్‌ ఫిషింగ్‌ జెట్టీలను నిర్మించేందుకు నిర్ణయించింది.  
–మంత్రి మోపిదేవి వెంకటరమణ

సీఎం దయతోనే విడుదలయ్యాం 
సీఎం దయ వల్లే మేం బంగ్లాదేశ్‌ జైలు నుంచి విడుదలయ్యాం. స్వదేశంలో అడుగుపెట్టడం ఆనందంగా ఉంది. 
    – రాయితి రాము, మత్స్యకారుడు, తిప్పలవలస  
 
తిరిగొస్తామని ఊహించలేదు 
మన దేశానికి తిరిగొస్తామని ఊహించలేదు. బోటులో చేపల వేటకు వెళ్లి బంగ్లాదేశ్‌ సరిహద్దులోకి ప్రవేశించిన వెంటనే అక్కడి అధికారులు మా డ్రైవర్‌ను కొట్టి మా సెల్‌ఫోన్లు, వైర్‌లెస్‌ సెట్లు లాగేసుకున్నారు. మమ్మల్ని జైల్లో పెట్టారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కృషితో విడుదలయ్యాం 
    – రాయితి అప్పన్న, మత్స్యకారుడు, తిప్పలవలస

వారిని రప్పించడం గొప్ప విషయం 
ఉపాధి కోసం విదేశాలకు వెళ్లి చిక్కుకుపోయిన వారిని రక్షించడానికి సీఎం వైఎస్‌ జగన్‌ చేస్తున్న కృషి అభినందనీయం. కువైట్‌లో మోసపోయిన వారిని తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం గట్టి ప్రయత్నాలు చేస్తోంది. మలేషియా నుంచి మన వాళ్లను తీసుకురావడంలో ప్రభుత్వ సహకారం మరువలేనిది.
– వెంకట్‌ మేడపాటి, ఏపీ నాన్‌ రెసిడెంట్‌ తెలుగు సొసైటీ చైర్మన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement