అసెంబ్లీ... 5 గేట్లు
గుంటూరు ఈస్ట్ (గుంటూరు వెస్ట్): నూతనంగా నిర్మించిన తాత్కాలిక అసెంబ్లీ భవన ప్రాంగణంలోకి ప్రొటోకాల్ ప్రకారం పాస్‌లు పొందిన వారికే అనుమతి ఉంటుందని గుంటూరు రేంజి ఐజీ సంజయ్ చెప్పారు. శనివారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో రూరల్ ఎస్పీ నారాయణనాయక్‌తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. తాత్కాలిక అసెంబ్లీ ప్రాంగణానికి మొత్తం ఐదు గేట్లు ఉంటాయని చెప్పారు. ప్రాంగణంలోకి ప్రవేశించాక తొమ్మిది ప్రవేశ ద్వారాలు ఉంటాయని తెలిపారు. వీటిని ప్రొటోకాల్ ప్రకారం కేటాయింపులు చేశామన్నారు. సోమవారం ఉదయం 11.06 గంటలకు అసెంబ్లీని గవర్నర్ ప్రారంభిస్తారని చెప్పారు.
సెక్యూరిటీ కంట్రోల్ డెస్క్
నాలుగో గేటు సమీపంలో సెక్యూరిటీ కంట్రోల్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు ఐజీ వెల్లడించారు. సందర్శకులు, మీడియా ప్రతినిధులు సెక్యూరిటీ పరమైన సమస్యలపై ఈ డెస్క్‌లో ఐజీ కార్యాలయం నియమించిన అధికారిని సంప్రదించవచ్చని తెలిపారు. అసెంబ్లీని సందర్శించే విద్యార్థులు, ఎన్జీవోలు, మీడియా వారికి ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారని, ముందస్తు అనుమతితో వారు అసెంబ్లీని సందర్శించవచ్చని తెలిపారు. మీడియా ప్రాంగణంలో ప్రజాప్రతినిధులు వారి అభిప్రాయాలు వెల్లడిస్తారని చెప్పారు. బయట ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఖాళీ ప్రదేశంలో కూడా మీడియాతో మాట్లాడే అవకాశం ఉందని వివరించారు. 300 మంది అమరావతి వలంటీర్లు అసెంబ్లీ ప్రాంగణంలో ఉచితంగా మంచి నీరు అందిస్తారని, టీ విక్రయించే ఏర్పాట్లు కూడా చేసినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు, ప్రస్తుతం నిర్మించిన రోడ్డు మార్గంలోంచి అసెంబ్లీకి చేరుకుంటారన్నారు. ఐదు ఎకరాల్లో వాహనాలకు పార్కింగ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు
ఏ గేట్ల ద్వారా ఎవరు..?
మొదటి గేటు – ముఖ్యమంత్రి, స్పీకర్, కౌన్సిల్ చైర్మన్
రెండో గేటు – మంత్రులు, ప్రతిపక్ష నాయకులు
మూడో గేటు – మీడియా ప్రతినిధులు, సందర్శకులు, ఇతర అధికారులు
నాలుగో గేటు – ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
ఐదో గేటు – సీనియర్ అధికారులు, అసెంబ్లీ సిబ్బంది
ఏ ప్రవేశ ద్వారం ఎవరికి
మొదటి ద్వారం – ముఖ్యమంత్రి, స్పీకర్, కౌన్సిల్ చైర్మన్
రెండో ద్వారం – డిప్యూటీ సీఎం, అధికారుల వెయిటింగ్, గ్యాలరీకి వేళ్లే వారు
మూడో ద్వారం – ఎమ్మెల్సీలు
నాలుగో ద్వారం – కౌన్సిల్ చైర్మన్, ఎమ్మెల్సీలు
ఐదో ద్వారం – కౌన్సిల్ సిబ్బంది
ఆరో ద్వారం – స్పీకర్, కౌన్సిల్ చైర్మన్ (వీరు మొదటి ద్వారం నుంచి కూడా లోపలికి ప్రవేశించవచ్చు)
ఏడో ద్వారం – పాస్ కలిగిన వారు
ఎనిమిదో ద్వారం – ప్రతిపక్ష నాయకులు, ఎమ్మెల్యేలు
తొమ్మిదో ద్వారం – మీడియా ప్రతినిధులు, వీఐపీ గ్యాలరీలకు వెళ్లే వారు