తమ తొమ్మిది నెలల కుమారునికి పుట్టెంటుకలు
తీయించుకోవడానికి ఆ దంపతులు బంధువులతో కలిసి వెంకన్న దర్శనానికి బయలుదేరారు. పుల్లంపేట మండలం పుత్తనవారిపల్లె సమీపంలోని మలుపు మృత్యుపాశమైంది. వారు ప్రయాణిస్తున్న వాహనం మలుపు వద్దకు రాగానే అదుపు తప్పి చెట్టును ఢీ కొంది. ప్రమాదంలో ఐదుగురు అక్కడిక్కడే మృతి చెందారు. పుట్టెంటుకలు తీయించుకోవాల్సిన తొమ్మిదినెలల చిన్నారి మృత్యువాత పడడం విషాదం. ఇదే ప్రమాదంలో రోడ్డు పక్కనే ఉన్న వెంకటప్రసాద్ అనే బాలుడు మృతి చెందడం మరో విషాదాంతం.
పుల్లంపేట, న్యూస్‌లైన్: తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనానికి వెళుతూ మంగళవారం ఉదయం ఐదుగురు మృతి చెందిన సంఘటన పుల్లంపేట మండలం పుత్తనవారిపల్లె సమీపంలో చోటుచేసుకుంది. మహబూబ్‌నగర్ జిల్లా లింగాల మండలం ఉత్తరతాండాకు చెందిన టిల్లు, శారద దంపతులు తమ కుమారునికి పుట్టు వెంట్రుకలు (9నెలలు) తీయించేందుకు వెళుతుండగా ఈ దుర్ఘటన జరిగింది.
డైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో ప్రమాదం సంభవించింది. వారు ప్రయాణిస్తున్న కారు పుత్తనవారిపల్లె మలుపు వద్దకు రాగానే అదుపు తప్పడంతో బోల్తా కొట్టి చింత చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో శ్రీరాములు(70), పెంటమ్మ(40), హుస్సేన్(15), సోను(6)తో పాటు 9నెలల శిశువు రాహుల్ కూడా శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. టిల్లు, బాలు, చిన్న, శారద, విజయ, డ్రైవర్ సైదులు తీవ్రగాయాలపాలయ్యారు. స్థానికు లు సహాయక చర్యలు చేపట్టి రాజంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సైదులు, చిన్న,బాలు పరిస్థితి విషమంగా వుండడంతో తిరుపతికి తరలించారు.
ఇదిలా వుండగా మండలపరిధిలోని శ్రీరాములు పేట గ్రామానికి చెందిన కాసారం వెంకటశివప్రసాద్ తన మేనత్తతో కలిసి చింతచిగురుకోసం పుత్తనవారిపల్లెకు ద్విచక్రవాహనంలో వచ్చారు. మేనత్త క్రిష్ణవేణి చెట్టు ఎక్కి చింతచిగురు కోస్తూ ఉండగా ప్రమాదానికి గురైన కారు చెట్టు కింద ఉన్న వెంకటశివప్రసాద్(5)ను ఢీకొనడంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
సంఘటనా స్థలానికి చేరుకున్న హెడ్‌కానిస్టేబుల్ గోపీనాయక్, కానిస్టేబుల్ నాగేంద్రలు క్షతగాత్రులను రాజంపేటకు తరలించారు. సంఘటనా స్థలంలో పడివున్న బాధితుల నగదు, బంగారు నగలను వారి బంధువులకు అప్పగించనున్నట్లు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు హెడ్‌కానిస్టేబుల్ గోపీనాయక్ పేర్కొన్నారు.
ఆ మలుపు ప్రమాదాల నెలవు
పుత్తనవారిపల్లె సమీపంలో మలుపు ప్రమాదాలకు నెలవుగా మారింది. ఈ ప్రదేశంలో పలుమార్లు రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. గతేడాది ఆటో-లారీ ఢీకొన్న సంఘటనలో ఐదుగురు మృత్యు ఒడికి చేరుకోగా మరో నలుగురు గాయాలపాలైయ్యారు. ఇక్కడ తరచూ ప్రమాదాలు జరుగుతున్నా సంబంధిత అధికారులు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోలేదు. రోడ్డు ట్యాక్సుల పేరిట వేలాదిరూపాయలు వసూలు చేస్తున్న సంబంధిత శాఖ అధికారులు ప్రయాణికుల భద్రత పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పుత్తనవారిపల్లె సమీపంలో అతిపెద్ద మలుపు ఉన్నా సంబంధిత ప్రాంతంలో ప్రమాదాల నివారణకు కనీసం ఎల్ బోర్డును కూడా ఏర్పాటు చేయలేదు. ఇకనైనా సంబంధిత అధికారులు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
ఆర్డీఓ పరామర్శ
రాజంపేట రూరల్: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వారిని, మృతదేహాలను రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. గాయపడిన వారిని ఆర్‌డీఓ విజయసునీత పరామర్శించారు. ఎంవీఐ దామోదర్‌నాయుడు ప్రమాద కారణాలపై ఆరా తీశారు. మృతుల వద్దనున్న నగదు, నగలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పుల్లంపేట పోలీసులు రూ.13,100లు నగదు, తాళిబొట్టు, ఇతర ఆభరణాలను పరిశీలించి భద్రపరిచారు. ప్రథమ చికిత్స అనంతరం క్షతగాత్రులను తిరుపతికి తరలించారు.
ఘోరం
Published Wed, Apr 30 2014 2:45 AM | Last Updated on Sat, Sep 2 2017 6:42 AM
Advertisement
Advertisement