సుభాష్‌నగర్, న్యూస్‌లైన్ : జిల్లా జైలు నుంచి శనివారం రాత్రి ఐదుగురు ఖైదీలకు విముక్తి కలిగింది. రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 2 వతేదీ లోపు సత్ప్రవర్తన కలిగిన వారి నివేదిక పంపాలని జైలు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అందు కోసం జీవోనం. 286ను విడుదల చేసింది.
ఈ మేరకు జైలు సిబ్బంది పంపిన నివేదిక ప్రకారం ఆదిలాబాద్ జిల్లాలోని ముధోల్ మండలం ఆష్ట గ్రామానికి చెందిన ఆసర ముత్తన్న, కుంటాల మండలం పెంచకల్‌పాడ్ గ్రామానికి చెందిన దాసరి లక్ష్మణ్, నిజామాబాద్ జిల్లాలోని నందిపేట మండలం ఖుద్వాన్‌పూర్ గ్రామానికి చెందిన కుర్మ చిన్న రాజన్న, ఎడపల్లి మండలం పోచారం గ్రామానికి చెందిన గైని పోశెట్టి, కరీంనగర్ జిల్లా మెట్‌పల్లికి చెందిన కూరపాటి ఎల్లయ్యలకు విముక్తి లభించింది. వీరందరూ హత్య కేసుల్లో శిక్ష అనుభవిస్తున్నారు.
చేయని నేరానికి శిక్ష
చేయని నేరానికి శిక్ష అనుభవించాను. పంటపొలంలో నా కొడుకు ఉరి వేసుకోగా నాపైన నేరం మోపారు. దీంతో జైలు పాలయ్యాను. జైలులో ఉన్నంత కాలం భగవంతుడి సన్నిధిలో గడిపాను. బయట వెళ్తున్నందుకు సంతోషంగా ఉంది. ఎటువంటి నేరాలు చేయకుండా వ్యవసాయం చేసుకుంటూ జీవితాన్ని గడుపుతాను. -ఆసర ముత్తన్న
తమ్ముడిని హత్య చేశాను
భూమి తగాదాల్లో తమ్ముడిని హత్య చేశాను. అయితే జైలు జీవితం గడిపినందుకు చాలా బాధగా ఉంది. ఇటువంటి జీవితం మరెవరికి రాకూడదు. -గైని పోశెట్టి
భిక్షమెత్తుకుని బతుకుతాను
దొంగతనాలు చేస్తూ ఒకరి హ త్య చేశాను. తప్పు చేసి చాలా బాదపడ్డాను. జీవితంలో భిక్షమెత్తుకుని బతుకుతాను గానీ తప్పు చేయను. -ఎల్లయ్య
జైలు జీవితం పగవాడికి కూడా రావద్దు
జైలు జీవితం పగవాడికి కూడా రావద్దు. మంత్రాలు చేస్తున్నాడని మా గ్రామంలో ఎల్లన్న అనే వ్యక్తిని హత్య చేసిన కేసులో 2004లో జైలుకు వచ్చాను. బయట ప్రపంచంలోకి వెళ్తున్నందుకు సంతోషంగా ఉంది. అందుకు సహకరించిన జైలు సిబ్బందికి కృతజ్ఞతలు.
-దాసరి లక్ష్మన్
నేరాలు చేయరాదు
క్షమాభిక్షపై జైలు నుంచి బయటకు వెళ్తున్న వారు శాంతియుత జీవితం గడపాలి. ఐదేళ్లలోపు ఎలాంటి నేరాలకు పాల్పడినా తిరిగి శిక్ష అమలులోకి వస్తుంది. విడులైన ఖైదీలు మూడు నెలలకోసారి సంబంధిత పోలీసు స్టేషన్‌లలో హాజరు ఇవ్వాల్సి ఉంటుంది.
-శంకరయ్య, జిల్లా జైలు సూపరింటెండెంట్
స్వేచ్ఛా లోకంలోకి..
Published Sun, Dec 22 2013 6:44 AM | Last Updated on Sat, Sep 2 2017 1:51 AM
Advertisement
Advertisement