మన్నాపూర్(మద్దూరు), న్యూస్‌లైన్: ప్రతీకారం ఎంతటి దారుణానికైనా వెనుకాడబోదు. ద్వేషభావం మనిషిలో మానవత్వాన్ని మంట కలుపుతుంది. ఆధిపత్య పోరు అనర్థాలకు దారితీస్తుంది. మద్దూరు మండలం మన్నాపూర్‌లో ఇదే జరిగింది. గ్రామ ప్రథమ పౌరురాలు మాణిక్యమ్మ (60) హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించి ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ ఘటనతో గ్రామం ఉలిక్కిపడింది. అంగన్‌వాడీ ఆయాగా పనిచేస్తున్న మాణిక్యమ్మకు గ్రామంలో మంచి పేరుంది. దీంతో పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ నాయకులు ఆమెకు మద్దతు నిచ్చారు. ఆయా పని మానుకోని ఆమె ఎన్నికల్లో సర్పంచ్‌గా పోటీ చేశారు. హోరాహోరీగా సాగిన పోరులో ఆమె తన సమీప ప్రత్యర్థి సులోచనమ్మపై 36 ఓట్ల తేడాతో గెలుపొందారు. దీంతో అప్పటి నుంచి తమ కుటుంబ సభ్యులపై ప్రత్యర్థులు దాడులు చేయడం మొదలు పెట్టారని హతురాలి భర్త వెంకట్‌రెడ్డి తెలిపారు.
నెలరోజుల వ్యవధిలోనే తన భార్యను అంతమొందించేందుకు అనేక వ్యూహాలు పన్నారని, ఇందులో భాగంగా కల్లులో పురుగుల మందు కలిపారని చెప్పారు. గమనించి చికిత్స అందించడంతో ప్రాణాపాయం తప్పిందన్నారు. ఇదిలా ఉండగా కక్షలతో గ్రామంలో శాంతికి విఘాతం కలుగుతుందని గ్రామ పెద్దలు ఇరువర్గాలతో రాజీ కుదిర్చారు. కలిసి మెలిసి ఉండాలని వారికి హిత బోధ చేశారు. అయితే మాణిక్యమ్మపై దాడులు ఆగలేదు. కొందరు మహిళలు ఆమెపై దాడి చేశారు. బుధవారం సాయంత్రం పొలానికి వెళ్లివస్తున్న ఆమెపై ఏకంగా పెట్రోల్ పోసి నిప్పంటించారు. గ్రామ సమీపంలోని ఊరకుంట కట్ట వద్ద ఆమె విగతజీవిగా పడి ఉండటాన్ని గ్రామస్తులు జీర్ణించుకోలేకున్నారు. గ్రామంలో ఎప్పుడు ఏం జరుగుతుందోననే ఆందోళనలు మొదలయ్యాయి. హత్య విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకొని బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇదంతా ప్రత్యర్థుల పనేనని హతురాలి భర్త ఆరోపిస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నాడు.
నేడు మండల బంద్
మన్నాపూర్ సర్పంచ్ మాణిక్యమ్మను దారుణంగా హత్య చేసినందుకు నిరసనగా మండల బంద్‌కు టీడీపీ మండల శాఖ పిలుపు నిచ్చింది. గ్రామంలోని ప్రత్యర్థులే ఈ హత్య చేశారని మండల టీడీపీ అధ్యక్షుడు శివరాజ్, టీడీపీ నాయకులు వీరేష్‌గౌడ్, నర్సింహ, రమేష్‌రెడ్డి ఆరోపించారు. నిందుతులను గుర్తించి వారిని కఠినంగా శిక్షించాలన్నారు.
రగిలిన పగ..!
Published Thu, Dec 19 2013 3:53 AM | Last Updated on Tue, Aug 21 2018 7:53 PM
Advertisement
Advertisement