ఈ ఏడాది సకాలంలో వర్షాలు కురవడంతో జూలై మాసాంతానికే కృష్ణానది పరీవాహక ప్రాంతంలోని జలాశయాలన్నీ పూర్తిగా నిండాయి. ఆగస్టు మొదటివారంలో నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం గరిష్టస్థాయికి చేరుకోవడంతో ఈ నెల 2వ తేదీ నుంచి కుడి, ఎడమ కాల్వలకు నీటిని విడుదల చేశారు. ఈ నెల 7వ తేదీ నాటికి సాగర్ జలాశయం 585 అడుగుల నీటిమట్టాన్ని దాటడంతో ఎన్‌ఎస్‌పీ అధికారులు క్ర స్ట్‌గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేశారు. ఈ నెల 7,8 తేదీల్లో క్రస్ట్‌గేట్ల ద్వారా 20.84 టీంఎంసీలు, 17 నుంచి 21వ తేదీ వరకు మరో 68.98 టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేశారు.
నత్తనడకన లోలెవల్ కెనాల్ నిర్మాణం
నాగార్జునసాగర్ జలాశయంలో 575 అడుగులకు పైగా నీటిమట్టం ఉన్న సమయంలో గ్రావిటీ ద్వారా, మిగిలిన సమయంలో మోటార్ల ద్వారా జిల్లాలో 80 వేల ఎకరాలకు సాగునీరు అందించే ఉద్దేశంతో వరద కాల్వ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 1997లో 175 కోట్ల రూపాయల వ్యయంతో పనులు ప్రారంభించారు. అగ్రిమెంట్ ప్రకారం ఐదేళ్లలో కాల్వ నిర్మాణ పనులు పూర్తి చేయాలి. గడువు ముగిసి పదేళ్లు కావస్తున్నా నేటికి కాల్వ నిర్మాణం పూర్తి కాలేదు. 17 ఏళ్లుగా పనులు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో టేలాండ్ భూములకు సాగునీరు కలగానే మిగిలింది.
పంపుహౌస్ నిర్మాణంలోనూ జాప్యమే
సాగర్ జలాశయంలో 575 అడుగుల కంటే నీరు తక్కువగా ఉన్నప్పుడు వరద కాల్వలోకి నీటిని పంపింగ్ చేయడానికి రూ. 112 కోట్ల వ్యయంతో పంపుహౌస్ నిర్మాణ పనులు మొదలుపెట్టారు. ఇవి కూడా మందకొడిగానే సాగుతున్నాయి. వాస్తవానికి పంపుహౌస్ నిర్మాణ పనులు 2009 డిసెంబర్ నాటికి పూర్తి కావాలి. అదీ జరిగింది లేదు. దీంతో అధికారులు ఏటేటా పంపుహౌస్ నిర్మాణ కాలాన్ని పొడిగిస్తూ వస్తున్నారు. రెండేళ్ల క్రితం పంపుహౌస్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి సైతం పరిశీలించి పనులను వేగవంతం చేయాలని అధికారులను కోరారు. కానీ పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. ఈ ఏడాది డిసెంబర్ చివరినాటికి మోటర్లను బిగిస్తామని ఎన్‌ఎస్‌పీ అధికారులు చెబుతున్నా..పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. పనులు ఇలాగే మందకొడిగా సాగితే పంపుహౌస్ నిర్మాణం పూర్తయ్యే సరికే మరో ఏడాది నుంచి రెండేళ్ల సమయం పట్టే అవకాశముంది.
పూర్తికాని డిస్ట్రిబ్యూటరీల తవ్వకం
వరద కాల్వ డిస్ట్రిబ్యూటరీల తవ్వకం కూడా నత్తకు నడకలు నేర్వే విధంగా ఉంది. ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించకపోవడంతో తమ భూముల్లో కాల్వలు తవ్వవద్దంటూ రైతులు అక్కడక్కడ అడ్డుకుంటున్నారు. దీంతో డిస్ట్రిబ్యూటరీల తవ్వకానికి ఆటంకాలు ఏర్పడుతున్నాయి. వరద కాల్వ పరిధిలోని డిస్ట్రిబ్యూటరీల తవ్వకం 2009 మార్చి నాటికి పూర్తి కావాలి. కాని పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. గత శాసనసభ ఎన్నికలకు ముందు నాటి రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య హడావిడిగా డిస్ట్రిబ్యూటరీలకు నీళ్లు వదిలిపెట్టారు. దీంతో కాల్వల్లో నీరు చేరి పనులు మరింత ఆలస్యానికి కారణమయ్యాయి. నేటికి ఆ పనులు పూర్తికాలేదు.
‘వరద’ పారేది!
Published Sat, Aug 24 2013 3:05 AM | Last Updated on Fri, Oct 19 2018 7:19 PM
Advertisement