ఏపీ రాజధానిపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీ నివేదికలో విజయవాడ– గుంటూరు ప్రాంతాల్లో వరదల గురించి ప్రస్తావించిన పేజీ
సాక్షి, అమరావతి బ్యూరో: ‘‘కుంభవృష్టి కురిస్తే? ఎగువ నుంచి భారీ వరద కృష్ణా నదికి వస్తే? స్థానికంగా కుంభవృష్టి కురిసినా, ఎగువ నుంచి భారీగా వరద వచ్చినా రాష్ట్ర రాజధాని అమరావతికి ముంపు ముప్పు తప్పదు. రెండూ ఒకేసారి వస్తే రాజధాని ప్రాంతం మొత్తం కృష్ణా నదిలా మారడం ఖాయం’’ అని నిపుణులు చెబుతున్నారు. గత వారం కృష్ణానదికి గరిష్టంగా 8 లక్షల క్యూసెక్కులకు పైగా వరద ప్రవాహం నమోదైంది. రాజధాని ప్రాంతంలోని గ్రామాలు చిగురుటాకుల్లా వణికిపోయాయి. ఇంకాస్త వరద పెరిగి ఉంటే.. అమరావతి పరిస్థితి ఏమిటి? స్థానికంగా వర్షాలు కురిసి కొండవీటి వాగు కూడా ఉప్పొంగి ఉంటే? తదుపరి పరిణామాలను ఊహించుకోలేం.
రాజధాని ప్రాంతంలో ఫ్లడ్ లైన్స్
ఏపీ నూతన రాజధాని అన్వేషణకు కేంద్ర ప్రభుత్వం శివరామకృష్ణన్ కమిటీని ఏర్పాటు చేసింది. వరద వస్తే మునిగిపోయే అవకాశం ఉన్న చోట రాజధాని నగరాన్ని ఏర్పాటు మంచిది కాదని ఈ కమిటీ హెచ్చరించింది. వరదలు రావడానికి అవకాశం ఉన్న ప్రాంతాల్లో రాజధాని ఏర్పాటు చేయకూడదని తన నివేదికలో వెల్లడించింది. విజయవాడ, గుంటూరు, నెల్లూరు నగరాలు వరద భారీగా వచ్చే అవకాశం ఉన్న ప్రాంతాలుగా పేర్కొంది. ఈ ప్రాంతాలను ‘రెడ్‌జోన్’గా గుర్తించింది. తెలుగుదేశం ప్రభుత్వం ఎంపిక చేసిన రాజధాని అమరావతి ప్రాంతానికి వరద ముప్పు ఉంటుందని సింగపూర్ కంపెనీలు రూపొందించిన మాస్టర్‌ప్లాన్ 82వ పేజీలో స్పష్టం పేర్కొన్నారు. రాజధాని ప్రాంతంలో లో, మీడియం, హై ఫ్లడ్ లైన్స్ ఉన్నాయని తెలిపింది. 2018 ఏప్రిల్‌లో అప్పటి టీడీపీ ప్రభుత్వం రూపొందించిన ‘హ్యాపీసిటీ బ్లూప్రింట్ ఫర్ అమరావతి’ నివేదికలోనూ రాజధానికి వరద ముప్పు ఉందని 176వ పేజీలో ప్రస్తావించారు.
2018 ఏప్రిల్‌లో టీడీపీ ప్రభుత్వం రూపొందించిన ‘హ్యాపీసిటీ బ్లూప్రింట్ ఫర్ అమరావతి’ నివేదికలో ఈ ప్రాంతానికి వరద ముంపు ఉన్నదని చెబుతున్న భాగం
నిపుణుల అంచనా ప్రకారం రాజధానికి పొంచి ఉన్న ప్రమాదం
- కృష్ణా నది ఉప్పొంగడం వల్ల రాజధానికి వరద ముప్పు ఏర్పడుతుంది. శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టులు నిండిన తర్వాత వచ్చే వరద ప్రవాహం అమరావతికి నష్టం కలిగించేదే. ఇటీవల శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టుల్లో వరదను నియంత్రించడంతో 10.6 లక్షల క్యూసెక్కుల వరద మాత్రమే ప్రకాశం బ్యారేజీకి వచి్చంది. దానికే అమరావతి ప్రాంతంలోని పొలాల్లో 5 అడుగుల నీళ్లు చేరాయి. అంతకంటే ఎక్కువ వరద వస్తే తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది.
- భారీ ప్రవాహాలకు అవకాశం ఉన్న పలు ఉపనదులు, వాగులు, వంకలు నాగార్జున సాగర్ దిగువన చాలా ఉన్నాయి. ఈ ప్రాంతంలో వర్షపాతం ఎక్కువ. పైనుంచి వరద వచ్చినప్పుడు, సాగర్ దిగువన కూడా వర్షాలు కురిస్తే కృష్ణా నది ఉగ్రరూపం దాలుస్తుంది. అది రాజధానికి అత్యంత నష్టదాయకం.
- స్థానిక వర్షాల వల్ల కొండవీటి వాగుకు మెరుపు వరద(ఫ్లాష్ ఫ్లడ్) వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల రాజధానికి ముప్పు పొంచి ఉంది. సాధారణ సమయాల్లో కొండవీటి వాగులో 4–5 వేల క్యూసెక్కుల ప్రవాహం ఉంటుంది. ఫ్లాష్ ఫ్లడ్ వస్తే నీటి ప్రవాహం 10 రెట్లు ఎక్కువగా ఉంటుందని అంచనా.
- అటు కృష్ణా నది, ఇటు కొండవీటి వాగులో ఒకేసారి వరద ఉంటే రాజధానికి ముప్పు రెట్టింపవుతుంది. కొండవీటి వాగు నుంచి 4–5 వేల క్యూసెక్కుల నీటిని లిఫ్ట్ ద్వారా మళ్లించినా పెద్దగా ప్రయోజనం ఉండదని నిపుణులు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment