ఏసీబీపైనే నిఘా పెట్టారు
సాక్షి, నిజామాబాద్: అవినీతిలో ఆరితేరినవారు ఏసీబీ కదలికలపైనే నిఘా పెట్టారని ఏసీబీ డీఎస్‌పీ సంజీవ్‌రావు పేర్కొన్నారు. ముఖ్యంగా సబ్‌రిజిస్ట్రార్, రవాణాశాఖ వంటి కార్యాలయాల్లో పనిచేసేవారు ఏసీబీ కదలికలను గమనిస్తూ అవినీతికి పాల్పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. మంగళవారం ఏసీబీ కార్యాలయంలో అవినీతి నిరోధానికి సంబంధించి న పోస్టర్లను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లంచం అడిగిన అధికారులను ఏసీబీకి పట్టించేందుకు గ్రామీణులే ఎక్కువగా ముందుకొస్తున్నారన్నారు. పట్టణ, నగరవాసులు మాత్రం ఏసీబీని ఆశ్రయించేందుకు అంతగా ఉత్సాహం చూపడం లేదన్నారు. జిల్లా కేంద్రంలోని పలు కార్యాలయాల్లో నిత్యం లక్షల రూపాయలు లంచంగా చేతులు మారుతున్నప్పటికీ ఏ ఒక్కరూ స్పందించకపోవడంపై విచారం వ్యక్తం చేశారు. అవినీతిపై సమరం చేసేందుకు ప్రజలు ఏసీబీ అనే ఆయుధాన్ని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
7 నెలలు.. 33 కేసులు
రేంజ్ పరిధిలో ఏడు నెలల్లో 33 కేసులు నమోదు చేశామని సంజీవ్‌రావు తెలిపారు. ఇందులో ఎనిమిది కేసులు మెదక్ జిల్లాలో, 25 కేసులు నిజామాబాద్ జిల్లాలో నమోదయ్యాయని వివరించారు. ఈ కేసుల్లో మొత్తం 38 మందిని అరెస్టు చేశామన్నారు. ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలుండే పోలీసు, రెవెన్యూ వంటి శాఖల్లోని లంచగొండులపైనే ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయన్నారు.
అక్రమాస్తులు కలిగిన వారిపై..
ఆదాయానికి మించి ఆస్తులు కలిగిన అవినీతి అధికారులపై కూడా ఏసీబీకి ఫిర్యాదు చేయవచ్చని డీఎస్‌పీ తెలిపారు. అవినీతిపరుల ఆస్తుల వివరాలను తమకు తెలియజేయాలని సూచించారు. రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా ఏసీబీ టోల్‌ఫ్రీ నెంబర్ 155361కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వ శాఖలపైనా..
ఏసీబీని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు కార్యాచరణ రూపొందించామని డీఎస్‌పీ తెలిపారు. ఎన్‌జీఓలు, యువజన సంఘాలు, విద్యా సంస్థల ద్వారా ఏసీబీని మరింతగా ప్రజల్లోకి తీసుకెళతామన్నారు. కేవలం రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లోనే కాకుండా, కేంద్ర ప్రభుత్వ శాఖల్లోని అవినీతిపరులపైనా తమకు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. సీబీఐ, ఐటీ వంటి శాఖల సమన్వయంతో వారిపై కేసుల నమోదుకు కృషి చేస్తామని వివరించారు.