కూర్మనాథాలయంపై ఫ్లయింగ్ కెమెరా కన్ను!
- దేవాదాయ శాఖాధికారులు లేకుండా షూటింగ్ జరగడంపై అనుమానాలు
- ఆందోళన చెందుతున్న భక్తులు
శ్రీకూర్మం(గార),న్యూస్‌లైన్ : ప్రఖ్యాత క్షేత్రం శ్రీకూర్మంలోని కూర్మనాథాలయంపై కొందరు వ్యక్తులు ఫ్లయింగ్ కెమెరాతో చిత్రీకరణ జరపడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బుధవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో ముగ్గురు వ్యక్తులు ఫ్లయిం గ్ కెమెరాతో వచ్చారు. శ్వేతపుష్కరిణి, గర్భగుడి, బేడా మండపం, తదితర స్థలాల్లో చిత్రీకరణ జరిపారు. ఈ సమయంలో ఆలయ అధికారులు, సిబ్బంది ఎవరూ లేరు. వాస్తవానికి, ఆలయంలో ఫోటోలు తీయటం, కెమెరాలు, సెల్‌ఫోన్‌లు వాడటం నిషిద్ధం.
ఒకవేళ షూటిం గ్ జరపాలనుకుంటే ఉన్నతాధికారుల ప్రత్యేక అనుమతితో అధికారుల సమక్షంలో చేపట్టాలి. దీనికి సాధారణ కెమెరాలనే వినియోగించాలి. ఇప్పుడు అలా కాకుండా ఏకంగా ఫ్లయింగ్ కెమెరాను వినియోగించారు. రిమోట్ సాయంతో పనిచేసిన ఈ కెమెరా 10 నుంచి 20 అడుగుల పైకి వెళ్లి చిత్రీకరణ చేసింది. దేశంలోని ప్రముఖ ఆలయాలకు ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉందని నిఘా వర్గాలు ఎప్పటికప్పడు హెచ్చరిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు లేని సమయంలో ఎవరో తెలియని వ్యక్తులు ఫ్లయింగ్ కెమెరాతో చిత్రీకరణ జరపడంతో భక్తుల్లో ఆందోళన నెలకొంది.
ఇదిలా ఉండగా గతేడాది మూలవిరాట్‌కు మైనంతో అచ్చుతీయడం, శిలాశాసనాల డీకోడింగ్ అంశాలపై ఓ అర్చకుడు సస్పెండ్ కావడం, ఈవో బదిలీ అయిన సంగతి తెలిసిందే. ఫ్లయింగ్ కెమెరాతో చిత్రీకరణపై ఆలయ కార్యనిర్వహణాధికారి వి.శ్యామలాదేవిని ‘న్యూస్‌లైన్’ ప్రశ్నించగా షూటింగ్ జరిపిందెవరో తమకు తెలియదన్నారు. గతంలో జాయింట్ కలెక్టర్ సీసీ ఫోన్ లో చెప్పిన సూచనల మేరకు జిల్లా వైభవంపై డాక్యుమెంటరీ షూటింగ్ రెండు సార్లు ఆల యంలో జరిగిందన్నారు. ఇప్పుడు కూడా వారే చిత్రీకరణ చేసి ఉండవచ్చన్నారు.