సాక్షి ప్రతినిది, ఆదిలాబాద్ : ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి జిల్లా ప్రగతికి పెద్దపీట వేస్తోందని, అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజల సహకారంతో జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి బసవరాజు సారయ్య అన్నారు. అమరులను స్మరించుకుంటూ దేశ సమగ్రత, సమైక్యత, జాతి, కుల, మత, వర్గరహితంగాప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని, జిల్లా సర్వతోముఖాభివృద్ధి కలిసి సాగాలని ఆయన కోరారు. ఆదిలాబాద్ పోలీస్ పరేడ్ మైదానంలో గురువారం జరిగిన 67 స్వాతంత్య్ర వేడుకలకు మంత్రి సారయ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఆయన ఆదిలాబాద్ డీఎస్పీ, పరేడ్ కమాండర్ లతామాధురి ఆధ్వర్యంలో కలెక్టర్ అహ్మద్ బాబు, ఎస్పీ సర్వశ్రేష్ట త్రిపాఠిలతో కలిసి ప్రత్యేక వాహనంలో పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం కలెక్టర్ అధ్యక్షతన జరిగిన సభావేదిక నుంచి మంత్రి జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
విత్తనోత్పత్తికి ప్రోత్సాహం
జిల్లా సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని, విద్య, వైద్యం, వ్యవసాయం, గిరిజన సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి సార య్య స్పష్టం చేశారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచి ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి జరుగుతుందన్నారు. ఈ ఖరీఫ్‌లో రూ.1,255 కోట్ల పంట రుణాలు లక్ష్యం కాగా, ఇప్పటి వరకు రూ.515 కోట్లు పంపిణీ చేశామన్నారు. గ్రామీణ స్థాయిలోనే విత్తనోత్పత్తిని ప్రోత్సహించడానికి రూ.91.90 లక్షల విలువైన 3,531 క్వింటాళ్ల సోయా, మొక్కజొన్న, పెసర, మినుము విత్తనాలు 50 శాతం సబ్సిడీతో అందించడం జరుగుతుందన్నారు. గిరిజన ప్రాంతాల్లో నాబార్డు గ్రాంట్ ద్వారా రూ.48.40 లక్షలతో 4 డీఆర్ డిపోలు, రూ.51 లక్షలతో 12 అంగన్‌వాడీ భవనాలు నిర్మించామన్నారు. రూ.4.78 కోట్ల ఎన్‌ఆర్‌హెచ్‌ఎం గ్రాంట్ ద్వారా 49, రూ.4.33 కోట్ల సీఎస్‌ఎస్ గ్రాంట్‌తో నాలుగు అభివృద్ధి పనులు గిరిజన ప్రాంతాల్లో చేపట్టామన్నారు. 16, 254 సదస్సుల ద్వారా 16,91,893 మంది అవుట్ పేషెంట్లను పరీక్షించి, ఇందులో 55,674 గర్భిణులను పరీక్షించడం జరిగిందన్నారు.
పచ్చతోరణం కింద ఉపాధి
ఉపాధి హామీ ద్వారా నిరుపేద గ్రామీణులకు పని కల్పించడానికి ఇప్పటివరకు 5,23,824 జాబ్‌కార్డులు జారీ చేశామని మంత్రి సారయ్య పేర్కొన్నారు. రూ.202.24 కోట్లు ఖర్చు చేసి 2,58,295 కుటుంబాలకు ఉపాధి కల్పించాము. ఇందిరమ్మ పచ్చతోరణం ద్వారా జిల్లాలో 2,733 కిలో మీటర్ల పొడవున 3,288 ఎకరాల అసైన్డ్ భూములను గుర్తించి 3,067 మంది ద్వారా చెట్లను పెంచి తద్వారా శాశ్వత ఉపాధి కల్పించే చర్యలు తీసుకున్నామన్నారు. మహా త్మాగాంధీ వన నర్సరీ కార్యక్రమం కింద గతేడాది రూ.5.59 కోట్లు వెచ్చించి 25.58 లక్షల మొక్కలు 16,750 మంది రైతుల పొలాల్లో నాటించామన్నారు. గృహనిర్మాణం పథకం కింద జీవో 171 ప్రకారం రూ.74 కోట్ల తో 16,407 గృహాలు మంజూరు కాగా, వాటిలో రూ.60.67 కోట్ల వ్యయంతో 8,453 గృహాలు పూర్తి చేసినట్లు చెప్పారు.
రచ్చబండ-1 కింద రూ.105.29 కోట్లతో 19,153 గృహాలు మంజూరు కాగా, వాటిలో రూ.30.36 కోట్లు ఖర్చు చేసి 3,261 గృహాలు పూర్తి చేశామన్నారు. ఎనిమిదేళ్లలో ఆత్మహత్య చేసుకున్న 126 మంది రైతుల కుటుంబాలకు ఇందిరా ఆవాస్ యోజన పథకం కింద పూర్తి సబ్సిడీతో ఇళ్లు మంజూరు చేశామని పేర్కొన్నారు. జూలై 15వ తేదీ నుంచి కురిసిన భారీ వర్షాల కారణంగా ముంపునకు గురైన ప్రాంతాల్లో రూ.2.58 కోట్లతో వరద సహాయక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. సంరక్షణ అభివృద్ధికి గాను ఈ ఆర్థిక సంవత్సరం రూ.12.56 కోట్లు కేటాయించామన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ అహ్మద్ బాబు, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న, ఎస్పీ సర్వశ్రేష్ట త్రిపాఠి, జాయింట్ కలెక్టర్ సుజాత శర్మ, జిల్లా ప్రధాన న్యాయమూర్తి గోపాలకృష్ణమూర్తి, ఐటీడీఏ పీవో జె.నివాస్, ఏజేసీ బి.వెంకటయ్య, డీఆర్‌వో ఎస్‌ఎస్ రాజు, డ్వామా, డీఆర్‌డీఏ పీడీలు వినయ్‌కృష్ణారెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, ఆర్డీవో సుధాకర్‌రెడ్డి, డీపీవో పోచయ్య, సీపీవో షేక్ మీరా, డీఈవో అక్రముల్లా ఖాన్, ఏపీ ట్రాన్స్‌కో, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ అశోక్, ఇంద్రసేన్, డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ప్రవీణ్‌రావు, డీఎఫ్‌వో శేఖర్‌రెడ్డి, డీఎంహెచ్‌వో డాక్టర్ స్వామి, రిమ్స్ డైరక్టర్ శశిధర్, డీఎస్‌డీవో ఎన్.సుధాకర్‌రావు, ఆరోగ్యశ్రీ కో-ఆర్డినేటర్ విజయ్‌కుమార్, మెప్మా పీడీ రాథోడ్ రాజేశ్వర్‌లతో పాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ప్రగతికి పెద్దపీట
Published Fri, Aug 16 2013 4:03 AM | Last Updated on Mon, Sep 17 2018 5:10 PM
Advertisement
Advertisement