ఫ్రీజర్లలో కిలోల కొద్దీ మురిగిపోయిన మాంసం.. | Food Control And Corporation Health Officials Conducted Extensive Checks On Monday In Nellore | Sakshi
Sakshi News home page

ముర్గీ మురిగే..! 

Published Tue, Jul 30 2019 10:37 AM | Last Updated on Thu, Aug 1 2019 11:05 AM

Food Control And Corporation Health Officials Conducted Extensive Checks On Monday In Nellore - Sakshi

సూర్య బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లో  నిల్వ ఉంచిన మాంసాన్ని పరిశీలిస్తున్న అధికారులు

చికెన్‌ – 65.. తందూరీ చికెన్‌.. చికెన్‌ టిక్కా..లాలిపప్‌.. పెప్పర్‌ చికెన్‌.. మొఘలాయ్‌ చికెన్‌.. చికెన్‌ మంచూరియా.. ధమ్‌ బిరియానీ.. రొయ్యల ఫ్రై, చేపల పులుసు .. హోటళ్లలో మెనూ చూస్తే నోరూరాల్సిందే. అయితే వీటిని తింటే మాత్రం మంచమెక్కాల్సిందే. రంగురంగుల్లో ఉన్న చికెన్‌ ముక్కను తిన్నారంటే రోగాన్ని కొనితెచ్చుకున్నట్టే. వారం రోజులుగా జిల్లాలో అధికారులు చేస్తున్న తనిఖీల్లో ఫ్రీజర్లలో కిలోల కొద్దీ నిల్వ ఉంచి మురిగిపోయిన మాంసం  వెలుగు చూస్తోంది. ఫలితంగా హోటళ్లకు వెళ్లాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. చిన్న హోటళ్ల నుంచి పెద్ద రెస్టారెంట్ల వరకూ ఎందులో చూసినా అంతా కల్తీనే. కల్తీరాయుళ్లపై కలెక్టర్‌ శేషగిరిబాబు కన్నెర్ర చేశారు. నాణ్యత పెరిగే వరకు అధికారులు దాడులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. 

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: హైదరాబాద్‌ తర్వాత నాన్‌వెజ్‌ను అమితంగా ఇష్టపడే ప్రాంతాల్లో నెల్లూరు ఒకటి. జాతీయ రహదారిని ఆనుకొని నగరం ఉండటంతో నిత్యం నగరంలోని వినియోగదారులతో పాటు ఇతర జిల్లాల వాసులు పెద్ద సంఖ్యలో ఇక్కడి హోటళ్లకు వస్తుంటారు. అయితే అన్నిట్లో నాసిరక మాంసాహారం ఉండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నగరంలో నాణ్యతను పాటించడంలేదని ప్రాథమికంగా నిర్ధారించుకొని ఐస్‌క్రీమ్‌ షాపుల మొదలుకొని బార్ల వరకు తనిఖీలు నిర్వహించి భారీగా జరిమానాలు విధిస్తున్నారు. కలెక్టర్‌ శేషగిరిబాబు ఆదేశాలతో ఫుడ్‌ కంట్రోల్‌ విభాగాధికారులు, మున్సిపల్‌ అధికారులు రంగంలోకి దిగి వరుస తనిఖీలు నిర్వహించి భారీగా కేసులు నమోదు చేసి హోటళ్ల నిర్వాహకులకు కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు. 

కాసులకు కక్కుర్తిపడుతున్న యజమానులు
కొందరు హోటళ్ల యజమానులు కాసులకు కక్కుర్తిపడి చెడిపోయిన మాంసాన్ని విక్రయిస్తున్నారు. వేడిపై మాంసం తినడంతో చెడిపోయిందా లేదాననేది గుర్తించడం కష్టమే. దీన్ని అదునుగా చేసుకొని కొందరు హోటళ్ల యజమానులు వారాల తరబడి నిల్వచేసిన మాంసాన్ని విక్రయిస్తున్నారు. నగరంలో దాదాపు 80 హోటళ్ల వరకు ఉండగా, ప్రధానమైన హోటళ్లు 20 నుంచి 30 ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా సుమారు 1100 హోటళ్లు ఉన్నాయి. చాలా మంది యజమానులు అధిక మొత్తంలో మాంసాహారం కొనుగోలు చేస్తే ధర తగ్గుతుందనే ఉద్దేశంతో భారీగా కొనుగోలు చేస్తున్నారు.

విక్రయాల్లో ఆలస్యమైతే మాంసాహారాన్ని ఫ్రీజర్లలో నిల్వ చేస్తారు. వారాల తరబడి ఫ్రీజర్లలో నిల్వ ఉండటంతో అప్పటికే మాంసం మురిగిపోతోంది. నగరంతో పాటు కావలి, సూళ్లూరుపేట, నాయుడుపేట, ఆత్మకూరు, తదితర పట్టణాల్లో నిర్వహించిన వరుస దాడుల్లో ఫ్రీజర్లలో మురుగుతున్న కిలోల కొద్దీ మాంసాన్ని గుర్తించారు. కొన్ని ప్రాంతాల్లో కళ్లిపోయి.. దుర్వాసన వస్తున్న మాంసాన్ని కూడా కనుగొన్నారు. హోటళ్ల నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేసి జరిమానాలు విధించారు. ఇలా చేసే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించడంతో పాటు గుర్తించిన మాంసాన్ని వెంటనే ధ్వంసం చేయించారు. 

కలెక్టర్‌ ఆదేశాలతో దాడులు
ఈ నెల 25న కలెక్టర్‌ శేషగిరిరావు కార్పొరేషన్, ఫుడ్‌ కంట్రోల్‌ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. నెల్లూరులో ప్రజలకు ఆరోగ్యవంతమైన ఆహారం అందజేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఉద్యోగులకు సూచించారు. కార్పొరేషన్‌ హెల్త్, ఫుడ్‌ కంట్రోల్‌ శాఖలు సంయుక్తంగా దాడులు చేపట్టాలని ఆదేశించారు. నిల్వ చేసిన ఆహారాన్ని విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని, ముందుగా జరిమానాలు విధించి హెచ్చరికలు జారీ చేయాలన్నారు. హోటళ్ల యజమానుల్లో మార్పు రాకపోతే సీజ్‌ చేసేందుకు కూడా వెనుకాడొద్దని హెచ్చరించారు. నాణ్యత పెరిగేంత వరకూ దాడులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా దాడులు నిర్వహించాలని ట్రెయినీ కలెక్టర్లను ఆదేశించారు. 

రూ.ఐదు లక్షలకు పైగా జరిమానా
కలెక్టర్‌ ఆదేశాలతో అధికారులు ఈ నెల 26న పది హోటళ్లపై దాడులు చేశారు. మద్రాస్‌ బస్టాండ్‌ వద్ద ఓ హోటల్లో చెడిపోయిన మాంసాన్ని భారీగా గుర్తించారు. దాడుల నేపథ్యంలో నగరంలోని హోటళ్ల యజమానులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. శుక్రవారం ఒక్కరోజే రూ.1.7 లక్షల జరిమానాలు విధించారు. పరిశుభ్రత పాటించని కొన్ని హోటళ్లకు జరిమానాలు వేశారు. సోమవారం మూడు బార్‌ అండ్‌ రెస్టారెంట్లు, ఆరు హోటళ్లపై దాడులు చేసి రూ.2.5 లక్షల జరిమానా విధించారు. గూడూరు, కావలి, ఆత్మకూరు, వెంకటగిరి, నాయుడుపేట, సూళ్లూరుపేట మునిసిపాలిటీల్లోనూ హోటళ్లపై దాడులు ముమ్మరం చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. దశలవారీగా హోటళ్లు, టిఫిన్‌ సెంటర్లు, స్వీట్ల దుకాణాలు, ఇతర తినుబండారాల విక్రయాలు జరిపే హోటళ్లపై కూడా దాడులు జరపాలన్నారు.  

హోటళ్లపై నిరంతర తనిఖీలు
నెల్లూరు(పొగతోట): జిల్లాలోని హోటళ్లు, దుకాణాలపై క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించి వినియోగదారులకు నాణ్యమైన ఆహార పదార్థాలు, వస్తువులను అందించాలని కలెక్టర్‌ శేషగిరిబాబు ఆదేశించారు. తన క్యాంప్‌ కార్యాలయం నుంచి మునిసిపల్‌ అధికారులతో నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ మాట్లాడారు. నగరంలోని అనేక హోటళ్లలో అపరిశుభ్ర వాతావరణంలో వంటశాలలు, ఆహారపదార్థాలు తనిఖీల్లో బయటపడ్డాయన్నారు. నాణ్యత ప్రమాణాలు పాటించని హోటళ్లు, దుకాణాలపై అపరాధ రుసుమును విధించాలని సూచించారు. ఆర్‌ఓ ప్లాంట్లు సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. మంచినీటి సరఫరా అవసరమైన ప్రాంతాలకు సంబంధించి ప్రతిపాదనలను పంపించాలని సూచించారు. కార్పొరేషన్‌ కమిషనర్‌ పీవీవీఎస్‌ మూర్తి, తదితరులు పాల్గొన్నారు.  

అధికారులపై ఆగ్రహం
సూళ్లూరుపేట: సూళ్లూరుపేట పట్టణంలో ట్రయినీ కలెక్టర్‌ కల్పనాకుమారి మంగళవారం ఆకస్మిక తనిఖీలు చేశారు.  అధికారుల నిర్లక్ష్యంపై చివాట్లు పెట్టారు. తొలుత ఆలె చేపల మార్కెట్‌లో అక్కడే కోయడం, అక్కడే చెత్తా చెదారం వేయడంతో  వస్తున్న దుర్వాసన దారుణంగా ఉన్న విషయం మీకు కనిపించలేదా? అని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలికోన్నత పాఠశాలలోకి వెళ్లి సమస్యలేమైనా వున్నాయా అని విద్యార్థులను అడగడంతో స్కూల్‌ ముందే పెద్ద మురుగునీటి కాలువ వుంది. అక్కడే అన్ని కార్యక్రమాలను నిర్వహిస్తుండడంతో దుర్వాసన భరించలేకపోతున్నామని విద్యార్థులు ఆమె దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం బాపూజీ వీధిలోని గోమతి స్వీట్‌స్టాల్‌లో తినుబండారాలను పరిశీలించి అక్కడ ప్లాస్టిక్‌ కవర్లు కనిపించడంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు.

పోలీస్‌స్టేషన్‌ సమీపంలో నిర్మిస్తున్న భవనానికి అనుమతి ఉందా? అని ప్రశ్నించారు. లేదని చెప్పడంతో అనుమతి తీసుకోకుండా భవనాన్ని నిర్మిస్తుంటే ఏం చేస్తున్నారు.. నోటీలు ఇవ్వలేదా అని అధికారులను నిలదీశారు. పట్టణంలో అనుమతి లేని భవనాలు ఎన్ని ఉన్నాయో చెప్పాలని ఆదేశించారు. అనంతరం రాజధాన్ని హోటల్‌లోకి వెళ్లి అక్కడ మురిగిపోయిన చికెన్, రొయ్యలను గుర్తించి వారి మీద తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చారు. రహదారికి పక్కనే చెత్తడంపింగ్‌ కేంద్రాన్ని పరిశీలించారు. పట్టణంలోని పరిస్థితిపై  నివేదికను కలెక్టర్‌ శేషగిరిబాబుకు అందజేస్తానని చెప్పారు. ఆమెతో పాటు కమిషనర్‌ నరేంద్ర, ఇతర సిబ్బంది వున్నారు.

హోటళ్లలో కొనసాగుతున్న తనిఖీలు  
నెల్లూరు(సెంట్రల్‌): నగరంలోని హోటళ్లు, సినిమా థియేటర్లలో ఫుడ్‌ కంట్రోల్‌ అధికారులు, కార్పొరేషన్‌ హెల్త్‌ అధికారులు మంగళవారం దాడులు కొనసాగించారు. నగరంలోని సిరి మల్టీప్లెక్స్, అమరావతి బార్‌ అండ్‌ రెస్టారెంట్, ఎస్‌ – 2 సినిమా హాల్లో ఆహారం తయారు చేసే ప్రాంతాలు, రామలింగాపురం వద్ద ఉన్న పంజాబీ దాబాను పరిశీలించారు. అమరావతి బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లో కొంత మేర లోపాలు ఉన్నట్లు కనుగొన్నారు. ఎస్‌ – 2లో అన్ని లైసెన్స్‌లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఫుడ్‌ కంట్రోల్‌ గెజిటెడ్‌ అధికారి శ్రీనివాస్‌ మాట్లాడారు. కొన్ని రోజులుగా ఆహార తయారీ కేంద్రాలపై దాడులు చేస్తున్నామని, ప్రస్తుతం కొంత మార్పు కనిపిస్తోందని చెప్పారు. ఎక్కడైనా ఫుడ్‌ లైసెన్స్‌లు లేకుండా, నిల్వ చేసిన ఆహారాన్ని ఉంచితే చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం కార్పొరేషన్‌ హెల్త్‌ అధికారి వెంకటరమణ మాట్లాడారు. హోటళ్లలో అపరిశుభ్రత, నిషేధిత ప్లాస్టిక్‌ను వినియోగిస్తే జరిమానాలు విధిస్తామని, అప్పటికీ తీరులో మార్పు రాకపోతే సీజ్‌ చేస్తామని హెచ్చరించారు.    

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement