వార్డెన్ల నిర్లక్ష్యమే కారణం! | Food Poison In Guntur Womens College Students | Sakshi
Sakshi News home page

వార్డెన్ల నిర్లక్ష్యమే కారణం!

Published Tue, Sep 24 2019 11:28 AM | Last Updated on Tue, Sep 24 2019 11:28 AM

Food Poison In Guntur Womens College Students - Sakshi

విద్యార్థినులను పరామర్శిస్తున్న ఎమ్మెల్యే ముస్తఫా, కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనందకుమార్‌  

సాక్షి, గుంటూరు : హాస్టల్‌ చీఫ్‌ వార్డెన్, వార్డెన్‌ల నిర్లక్ష్యం విద్యార్థుల ప్రాణాల మీదకు తెచ్చింది. గుంటూరు నగరంలోని ఉమెన్స్‌ కాలేజీలో ఆహారం కల్తీ కారణంగా 75 మంది విద్యార్థినులు సోమవారం వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. గుంటూరు నాజ్‌ సెంటర్‌ దగ్గర ఉన్న మహిళా కళాశాలలో ఇంటర్, ఒకేషనల్, డిగ్రీ కళాశాలలు ఉంటాయి. డిగ్రీ కళాశాలకు అనుసంధానంగా స్టూడెంట్‌ మేనేజ్‌మెంట్‌ హాస్టల్‌ ఉంది. దీనికి చీఫ్‌ వార్డెన్‌గా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్, డెప్యూటీ వార్డెన్‌గా లెక్చరర్‌ కమలకరుణ వ్యవహరిస్తున్నారు. హాస్టల్‌లో 400 మంది డిగ్రీ, 280 మంది ఇంటర్, ఒకేషనల్‌ విద్యార్థినులు వసతి పొందుతున్నారు. ఒక్కో విద్యారికి హాస్టల్‌ ఫీజు కింద సుమారు రూ.1700 ఇస్తారు.

నాసిరకమైన చికెన్‌..
హాస్టల్‌లో వారానికి ఒక్కసారి విద్యార్థినులకు చికెన్‌ పెడతారు. ఆదివారం రాత్రి విద్యార్థులకు పెట్టిన చికెన్‌ నాసిరకంగా ఉందని, అందులో గ్రేవీ కోసం శనగపిండి కలిపారని విద్యార్థులు చెప్పుకొచ్చారు. ఆదివారం తిన్న నాసిరకం చికెన్‌ కారణంగా కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలతో విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. సోమవారం రాత్రికి సుమారు 75 మంది విద్యార్థులు జీజీహెచ్‌లో చేరారు. మధ్యాహ్నం నుంచి అస్వస్తతకు గురైన విద్యార్థులు వస్తుండటంతో వైద్యులు జీజీహెచ్‌లో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేసి వారికి వైద్య చికిత్సలు అందించారు. రాత్రి వండిన ఆహారం కూడా కల్తీ కావడంతో మరో 30 మందికి పైగా విద్యార్థినులు జీజీహెచ్‌కు వచ్చారు. ఆదివారం రాత్రి మిల్‌మేకర్, టమాటా కర్రీ, అన్నం తిన్న మరి కొందరు విద్యార్థులు కొద్ది సేపటికే వాంతులు చేసుకుని కడుపునొప్పితో ఇబ్బంది పడ్డారు.  

పట్టించుకోని చీఫ్‌ వార్డెన్, వార్డెన్‌
ఆహారం కల్తీ జరిగి విద్యార్థినులు వరుసగా అస్వస్థతకు గురవుతుంటే ఇంటర్, ఒకేషనల్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్స్, సిబ్బంది తమకు సంబంధం లేదు అన్నట్టుగా వ్యవహరించారు. నీటి కాలుష్యం వల్ల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని ఆరోపణలు రావడంతో నగర
పాలక సంస్థ కమిషనర్‌ శ్రీకేష్‌ లఠ్కర్‌ ఆదేశాల మేరకు సోమవారం రాత్రి నగరపాలక సంస్థ ఇంజినీరింగ్‌ అధికారులు ఈఈ శాంతరాజు, డీఈ రమణ, ఏఈ పవన్, ఇతర సిబ్బంది అక్కడికి చేరుకునే సమయానికి రాత్రి తిన్న ఆహారం కల్తీ అయి విద్యార్థులు వాంతులు చేసుకుని కడుపునొప్పితో బాధపడుతుండటాన్ని గుర్తించారు. అక్కడ వారిని పట్టించుకునే వారు ఎవ్వరు లేకపోవడంతో వెంటనే ప్రైవేట్‌ అంబులెన్స్‌ పిలి పించి జీజీహెచ్‌కు తరలించారు. ఆహారం కల్తీ అయి విద్యార్థులు ఉదయం నుంచి అస్వస్తతకు గురవుతున్న ప్రిన్సిపాల్, విద్యా శాఖ అధికారులు పట్టించుకోలేదు.   

చాలా రోజులుగా ఫిర్యాదులు.. 
హాస్టల్‌లో ఆహార కాంట్రాక్టర్‌ రామకృష్ణ సరిగా ఆహారం పెట్టడం లేదని చాలా రోజులుగా చీఫ్‌వార్డెన్‌ అయిన ప్రిన్సిపాల్, డెప్యూటీ వార్డెన్, వార్డెన్‌లకు ఫిర్యాదు చేస్తూ వస్తున్నామని విద్యార్థినులు తెలిపారు. తక్కువ రేటుకు వచ్చే నాణ్యత లేని కూరగాయలు, బియ్యం, ఇతర సరుకు, చికెన్‌తో వంట చేస్తుంటారని, ఈ విషయమై అనేకమార్లు ఫిర్యాదులు చేసినా తనకు సంబంధం లేదని ప్రిన్సిపాల్‌ సమాధానమిచ్చారని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీకి చెందిన రామకృష్ణ గత ప్రభుత్వ హయాంలో ఫుడ్‌ కాంట్రాక్టును దక్కించుకున్నాడని, ఆదివారం కూడా నిల్వ ఉంచిన చికెన్‌ను తక్కువ ధరకు తీసుకువచ్చి విద్యార్థినులకు వండి వడ్డించారని సమాచారం. మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ను రాత్రి 7 గంటల తర్వాత ఆపి వేస్తారని, దీంతో పైపుల్లో వచ్చే నీటినే తాగుతుంటామని విద్యార్థినులు పేర్కొన్నారు. 

15 రకాల శాంపిళ్ల సేకరణ 
ఆహారం కల్తీపై ఫిర్యాదు అందడంతో జిల్లా ఆహార నియంత్రణ శాఖ అధికారి ఖాజామోహిద్దీన్‌ సోమవారం ఉదయం హాస్టల్‌కు చేరుకుని 15 రకాల శాంపిళ్లను సేకరించారు. రాత్రి కూడా ఫుడ్‌ పాయిజన్‌ అవ్వడంతో మళ్లీ అక్కడకు చేరుకుని మినరల్‌ వాటర్, రాత్రి వండిన ఆహార శాంపిల్స్‌ను సేకరించారు. చికిత్స పొందుతున్న విద్యార్థినులను కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ పరామర్శించారు. ఎమ్మెల్యే ముస్తఫా, వైఎస్సార్‌ సీపీ గుంటూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, వైఎస్సార్‌ సీపీ నాయకుడు చంద్రగిరి ఏసురత్నం పరామర్శించారు. ఎమ్మెల్యే ముస్తఫా రాత్రంతా ఆస్పత్రిలోనే ఉండి విద్యార్థినులకు మెరుగైన వైద్యం అందేలా చూశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement