హుస్నాబాద్, న్యూస్‌లైన్ : పప్పు దినుసులను అప్పనంగా భోంచేసిన వ్యవసాయాధికారులపై వేటు వేసేందుకు అధికారులు నిర్ణయించారు. ఆహారభద్రత పథకంలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హుస్నాబాద్ ఏడీఏ రవీందర్‌జీ, ఏవో శ్రీనివాస్ సస్పెన్షన్‌కు కలెక్టర్ వీరబ్రహ్మయ్య బుధవారం వ్యవసాయశాఖ కమిషనర్‌కు సిఫారసు చేసినట్లు తెలిసింది. రెండు రోజుల్లో సస్పెన్షన్ ఉత్తర్వులు వెలువడనున్నాయి. పప్పు దినుసుల సాగు గణనీయంగా తగ్గిపోతుండడంతో వాటి సాగు పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం రైతాంగాన్ని ప్రోత్సహిస్తోంది. ఎరువులు, పప్పు విత్తనాలను సబ్సిడీపై అందిస్తోంది.
ఇందుకు జిల్లాలో మూడు పైలట్ మండలాలను ఎంపిక చేశారు. వీటిలో ఒకటైన హుస్నాబాద్‌కు 2012 జనవరిలో 120 డీఏపీ బస్తాలు, 2013 ఆగస్టులో 200 డీఏపీ బస్తాలు, 25 బస్తాల యూరియా, జింక్‌తోపాటు పెసర విత్తనాలు కేటాయించారు. రెండు విడతలుగా కేటాయించిన ఎరువులు, విత్తనాలను రైతులకు పంపిణీ చేయకుండా వ్యవసాయాధికారి శ్రీనివాస్ వాటిని ఎరువుల డీలర్లకు అమ్ముకున్నట్లు ఆరోపణలొచ్చాయి. కరీంనగర్ మార్క్‌ఫెడ్ నుంచి ఎరువులతో ఏవో పేరిట వచ్చే వాహనం హుస్నాబాద్ చేరకుండానే కరీంనగర్‌లోనే ఎరువులు విక్రయించినట్లు తెలిసింది. వీటిని ఎవరికి పంపిణీ చేశారనే విషయాన్ని ఏడీఏకు, ఏఈవోలకు సైతం తెలియకుండా ఏవోనే వ్యవహారం నడిపించినట్లు ఆ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.
దాగని అక్రమాలు
ఆహారభద్రత పథకం కింద కేటాయించిన ఎరువులు పక్కదారి పట్టాయంటూ స్థానిక పార్టీల నేతలు ఫిర్యాదుతో కరీంనగర్ ఏడీ కాంతారావును విచారణ అధికారిగా నియమించారు. అక్రమాలు ఎక్కడ బయటపడతాయోననే భయంతో ఏవో శ్రీనివాస్ స్థానికంగా ఉన్న ఇద్దరు ప్రైవేట్ డీలర్ల వద్ద డీఏపీ బస్తాలు కొనుగోలు చేసి గుట్టుచప్పుడు కాకుండా పంపిణీ చేసేందుకు గొల్లకుంటలో నిల్వ ఉంచాడు.
వీటిని నాయకులు పట్టుకుని విచారణాధికారికి అప్పగించారు. మల్లంపల్లిలో సైతం పంపిణీకి సిద్ధం చేసిన ఆరు డీఏపీ బస్తాలను పట్టుకున్నారు. జనవరి, ఆగస్టు నెలల్లో పంపిణీ చేయాల్సిన ఎరువులను ఇప్పడు పంపిణీ చేస్తుండడంతో అక్రమాలకు పాల్పడినట్లుగా విచారణ అధికారి కాంతారావు జేడీఏకు నివేదిక సమర్పించారు. ఈ నివేదిక జేడీఏ సోమవారం కలెక్టర్‌కు సమర్పించారు. ఏవో పనితీరుకు ఏడీఏ వంతపాడడంతోనే అక్రమాలు జరిగాయని అధికారులు నివేదికలో పేర్కొనడం గమనార్హం.
సస్పెన్షన్‌కు సిఫారసు
అక్రమాలకు పాల్పడిన ఏడీఏ రవీందర్‌జీ, ఏవో శ్రీనివాస్‌ల సస్పెన్షన్‌కు కలెక్టర్ వీరబ్రహ్మయ్య బుధవారం సిఫారసు చేసినట్లు జేడీఏ ప్రసాద్ ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. ఈ మేరకు వ్యవసాయశాఖ కమిషనర్‌కు లేఖ పంపినట్లు వెల్లడించారు. రెండు రోజుల్లో సస్పెన్షన్ ఉత్తర్వులు రానున్నట్లు సమాచారం. మరో రెండున్నర నెలల్లో ఏడీఏ రవీందర్‌జీ ఉద్యోగ విరమణ పొందనుండగా ఈ సమయంలో సస్పెన్షన్‌కు సిఫారసు వెళ్లడం గమనార్హం.
ఆహారభద్రత పథకంలో అక్రమాలపై కొరడా
Published Thu, Nov 28 2013 3:31 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement