అనంతపురం కార్పొరేషన్/ జిల్లాపరిషత్తు, న్యూస్‌లైన్ : ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగా ఉంచేందుకు వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో దేనికైనా సై అని ఆ పార్టీ ఎమ్మెల్యేలు బి.గురునాథరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. రాజీనామాలు చేసి ప్రభుత్వాన్ని పడగొట్టి విభజన నిలిచిపోయేలా చేసేందుకైనా... అసెంబ్లీలో రాష్ర్ట విభజన తీర్మానాన్ని ఓడించేందుకుకైనా సిద్ధంగా ఉన్నామన్నారు. శుక్రవారం నగర పాలక సంస్థ ఉద్యోగ, కార్మిక జేఏసీ నాయకులు కృష్ణమూర్తి, నవనీతకృష్ణ, నగర మహిళ సమాఖ్య అధ్యక్షురాలు జానకి ఆధ్వర్యంలో ఉద్యోగులు, ఎస్‌హెచ్‌జీ మహిళలు ‘రాష్ట్రం విడిపోతే నీటి కష్టాలు’ అని రాసిన కావడి ని భుజాన పెట్టుకుని, కుండలను నెత్తిన ఉంచుకుని ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యేలు పాల్గొని సంఘీభావం ప్రకటించారు.
అనంతరం వైఎస్సార్‌సీపీ కార్యాకర్తలతో ఇద్దరూ కలిసి వచ్చి కార్పొరేషన్ వద్ద ఉద్యోగులు, ఎస్‌హెచ్‌జీ సభ్యులు చేపట్టిన రిలేదీక్షలకు మద్దతు తెలిపారు. సంఘీభావం ప్రకటించిన వారిలో వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్ శంక రనారాయణ, నగర కన్వీనర్ రంగంపేట గోపాల్‌రెడ్డి, మిహ ళా విభాగం కన్వీనర్ శ్రీదేవి, నాయకులు మహానందరెడ్డి తదితరులు ఉన్నారు. జెడ్పీ కార్యాలయం ఎదుట పంచాయతీరాజ్ ఉద్యోగుల రిలే దీక్షలను కూడా ఎమ్మెల్యేలు సందర్శించి సంఘీభావం ప్రకటించారు. ‘‘సమైక్యమే శ్వాసగా నిస్వార్థంగా పోరాడుతున్నారు. జీతాలు రాకున్నా జీవితాలను ఫణంగా పెడుతున్నారు. ఉపవాసం ఉంటూ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు.
ఆనాడు స్వాతంత్య్రం కోసం పోరాటాలు చేసిన మహనీయులతో సమానంగా ఇపుడు సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఉవ్వెత్తున సాగిస్తున్న యోధులకు శతకోటి వందనాలు సమర్పిస్తున్నాం’’ అని ఎమ్మెల్యేలు గురునాథరెడ్డి, కాపు పేర్కొన్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, కర్షకులు, అన్ని వర్గాల ప్రజలకు వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. తెలుగుజాతి ముక్కలు కాకుండా తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టమైన వైఖరితో ముందుకుపోతున్నారని వెల్లడించారు.
‘సమైక్యం’ కోసం దేనికైనా సై
Published Sat, Sep 28 2013 2:38 AM | Last Updated on Fri, Jun 1 2018 8:36 PM
Advertisement