కొద్దిరోజులుగా రాయలసీమలోని ఏ ఇద్దరు సీఐ(సర్కిల్ ఇన్‌స్పెక్టర్)లు కలిసినా...లేదా.. ఫోన్‌లో మాట్లాడుకున్నా ఇదే చర్చ సాగిస్తున్నారు. ‘
సాక్షి, కడ ప: కొద్దిరోజులుగా రాయలసీమలోని ఏ ఇద్దరు సీఐ(సర్కిల్ ఇన్‌స్పెక్టర్)లు కలిసినా...లేదా.. ఫోన్‌లో మాట్లాడుకున్నా ఇదే చర్చ సాగిస్తున్నారు. ‘సీమ’ పరిధిలో త్వరలో బదిలీలు ఉండటం, మరో రెండు, మూడు నెలల్లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఉండటంతో సీఐల బదిలీలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
ఈ నెల 23 తర్వాత సీఐల బదిలీలు జరగనున్నట్లు తెలుస్తోంది. దీంతో డీవోలపై సీఐలు ఫోకస్ పెట్టారు. ప్రాధాన్యత లేని పోస్టుల్లో కొనసాగుతున్న వారు సర్కిల్ కోసం తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇదే క్రమంలో సర్కిల్‌లో పని చేస్తున్న వారు కీలక సమయంలో లూప్‌లైన్‌లోకి వెళ్లకుండా జాగ్రత్తపడేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నారు.
వారు వెళితేనే...వీరికి ఖాళీ:
సీఐల బదిలీల్లో ఒక విషయంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఏపీపీఎం( ఆంధ్రప్రదేశ్ పోలీస్ మాన్యువల్) నిబంధనల ప్రకారం ఒక ఎస్‌ఐ తన సర్వీసులో మూడేళ్లు, సీఐ రెండేళ్లు, డీఎస్పీ ఏడాది పాటు లూప్‌లైన్(అప్రాధాన్యత పోస్టింగ్)లో విధులు నిర్వహించాలి. ఈ క్రమంలో కొంతమంది ఎస్‌ఐలు సీఐలుగా పదోన్నతి పొందినప్పుడు రెండేళ్ల పాటు అప్రాధాన్యత పోస్టుల్లో విధులు నిర్వహించి ఆపై సర్కిల్‌లో పోస్టింగ్ పొందారు. ఇంకొందరు ఎస్‌ఐ నుంచి నేరుగా సీఐగా సర్కిల్‌లోనే అడుగుపెట్టారు. వీరు లూప్‌లైన్‌లో పనిచేయలేదు. త్వరలో జరగబోయే సీఐల బదిలీల్లో ‘లూప్‌లైన్’లలో పని చేయకుండా సర్కిల్‌లో కొనసాగుతున్నవారిపైనే తీవ్ర చర్చ జరుగుతోంది.
సీఐ పదోన్నతి సమయంలో లూప్‌లైన్‌లో పనిచేసి, ఆపై కొంతకాలం సర్కిల్‌లో విధులు నిర్వహించి తిరిగి లూప్‌లైన్’(ఎస్‌పీ అటాచ్‌డ్, పోలీస్‌కంట్రోల్‌రూం, సీసీఎస్, ఐజీ అటాచ్‌డ్, ఎస్‌బీ)లలో ఉన్నవారు సర్కిళ్ల కోసం ప్రయత్నాలను ముమ్మరం చేశారు. అయితే వీరికి సర్కిల్‌లో పోస్టింగ్ రావాలంటే ప్రస్తుతం ఉన్నవారిలో కొందరు లూప్‌లైన్‌కు రావాల్సి ఉంది. లేదంటే ఖాళీలు లేని పరిస్థితి. లూప్‌లైన్‌లో పనిచేయకుండా నేరుగా సర్కిల్‌లో కొనసాగుతున్న సీఐలను ఈ డీవోలలోనైనా లూప్‌లైన్‌కు పంపుతారా.. లేదా.. అనే అంశంపై తీవ్ర చర్చజరుగుతోంది.
రాజకీయనేతల సిఫార్సుల కోసం యత్నాలు:
త్వరలో జరగబోయే బదిలీల్లో కోరుకున్న చోట పోస్టింగ్ పొందేందుకు ఎవరి ప్రయత్నాలకు వారు పదును పెడుతున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సర్కిల్‌లో పోస్టింగు కోసం శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. తమకు అనుకూలమైన ప్రజాప్రతినిధులతో సిఫార్సు చేయించుకుంటున్నారు. ఇదే అదనుగా కొంతమంది నేతలు భారీగా ముడుపులు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
సర్కిల్‌ను బట్టి రూ. 2-5 లక్షల వరకూ డిమాండ్ చేస్తున్నారు. ఇచ్చిన మొత్తం ఎన్నికల్లో సంపాదించుకోవచ్చులే అనే ధైర్యంతో కొందరు డబ్బులు ఇచ్చేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. మూడేళ్లకుపైబడి ఒకే స్థానంలో కొనసాగుతున్నవారు చాలామంది ఉన్నారు. అలాగే ఎర్రచందనం, మట్కాతో పాటు పలు రకాల అసాంఘిక కార్యకలాపాలను నివారించడంలో విఫలమై, ఆరోపణలు ఎదుర్కొంటున్నవారికి ఈ బదిలీల్లో స్థానచలనం తప్పనిసరి అని తెలుస్తోంది. దీంతో ఆయా స్థానాల కోసం ఆశావహులు ప్రయత్నాలు మొదలెట్టారు. రాజకీయనేతల ఇళ్లవద్దకు వెళ్లి కలవడం, వారు దొరక్కపోతే వారి పీఏలను సంప్రదించి ముఖ్యనేతల ద్వారా సిఫార్సు చేయించుకుంటున్నారు.
లూప్‌లైన్‌లో పనిచేయకుండా విధులు నిర్వహిస్తున్నవారు 55మందిపైనే:
పదోన్నతి సమయంలో లూప్‌లైన్‌లో విధులు నిర్వహించకుండా నేరుగా సీఐగా పదోన్నతి పొందినవారు 55 మందిదాకా ఉన్నట్లు తెలుస్తోంది. వీరు సీఐగా ఉన్నకాలంలో ఏ రెండేళ్లయినా లూప్‌లైన్‌లో పనిచేయాలి. కచ్చితంగా పదోన్నతి సమయంలోనే లూప్‌లైన్‌కు వెళ్లాలనే నిబంధన లేదు. దీంతో సీఐలంతా ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. రాయలసీమ ఐజీ రాజీవ్త్రన్, డీఐజీ మురళీకృష్ణ రెండురోజులుగా జిల్లాలో పర్యటించారు. అలాగే తక్కిన జిల్లాల్లోకూడా పర్యటించి సీఐల పనితీరుపై ఎస్పీలు, డీఎస్పీలతో నివేదికలు తీసుకుంటున్నట్లు తెలిసింది.