
జర భద్రం
ప్రయాణం చేయాలంటే గుండెల్లో దడ తప్పదు. ఎప్పడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తరచూ ఎక్కడో ఒకచోట రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. మొన్న అనంతపురం, నిన్న తూర్పుగోదావరి జిల్లాలో పెనువిషాదం. అధిక లోడు, డ్రైవర్ల నిర్లక్ష్యం వల్లే ఎక్కువగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. దీంతో బయట ప్రాంతాలకు ప్రయాణించాలంటే జనం జంకుతున్నారు.
- ప్రమాదాలకు నిలయంగా రహదారులు
- యాక్సిడెంట్లకు కారణం మానవ తప్పిదాలే..
- మూడేళ్లలో జిల్లాలో 50 దాకా ప్రమాదాలు
- వందమంది దాకా మృతి, 250 మందికి గాయాలు
పలమనేరు: నిత్యం రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్న సంఘటనలు జిల్లాలో మామూలైంది. ఆటోలు, కార్లు, బస్సుల్లో పరిమితికి మించి ప్రయాణికులను తరలిస్తున్న సందర్భంలో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. మూడేళ్ల కాలంలో జిల్లాలో 50 వరకు మేజర్ రోడ్డు ప్రమాదాలు జర గగా వంద మంది ప్రాణాలు గాల్లో కలిశాయి. 250 మంది దాకా గాయపడ్డారు. ఇందుకు ప్రధాన కారణం మానవ తప్పిదాలే. రహదారి సూచనలు, జాగ్రత్తలు పాటించకపోవడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఇక కండీషన్ లేని వాహ నాలు కూడా కారణమవుతున్నాయి.
చెన్నై-బెంగుళూరు రహదారిలో..
బంగారుపాళ్యం నుంచి కర్ణాటక రాష్ట్రంలోని ముల్‌బాగల్ వరకు చెన్నై-బెంగుళూరు జాతీయ రహదారి ప్రమాదాలతో రక్తమోడుతోంది. విస్తరణ పనులు ఆలస్యమవడం, భారీగా పెరిగిపోతున్న వాహనాల సంఖ్యే ఈ ప్రమాదాలకు కారణమని తెలుస్తోంది. ఇక చిత్తూరు-తిరుపతి, తిరుపతి-చెన్నై, తిరుపతి-కడప మార్గాల్లో కూడా ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.
మూడేళ్లలో పెరిగిన ప్రమాదాలు
రెండేళ్ల క్రిత ం కేటిల్‌ఫామ్ వద్ద కంటైనర్, ఆటో ఢీకొన్న ప్రమాదంలో పదిమంది మృతిచెందారు. గతేడాది గండ్రాజుపల్లె వద్ద జరిగిన రోడ్డుప్రమాదంలో ఓల్వో బస్సు దగ్ధమవడంతో పదిమందికి పైగా కాలిబూడిదయ్యారు. పత్తికొండ వద్ద జరిగిన ప్రమాదంలో నలుగురు చనిపోయారు. కేటిల్‌ఫామ్ వద్ద ప్రైవేటు బస్సు ప్రమాదంలో ఎనిమిది మంది చనిపోయారు. నాగమంగళం వద్ద కారును ఆర్టీసీ బస్సు ఢీకొనగా నలుగురు మృతిచెందారు. మూడు రోజుల క్రితం రేణిగుంట వద్ద, రెండ్రోజుల క్రితం నాగలాపురం మండలంలో భారీ రోడ్డు ప్రమాదాలు జరిగాయి.
మలుపుల వద్ద సూచిక బోర్డులేవీ ?
ప్రధాన మార్గాల్లోని మలుపుల వద్ద సూచిక బోర్డులు లేకపోవడంతో రాత్రి సమయాల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి. మితిమీరిన వేగం కూడా ప్రాణాలను హరిస్తోంది.
కండీషన్‌లేని వాహ నాలు, డ్రైవర్ల నిర్లక్ష్యం..
జిల్లాలోని ప్రయాణికుల వాహనాల్లో 40 శాతం వరకు కండీషన్ లేనివే. ఆర్టీసీలోనే కాలం చెల్లిన వాహనాలు నడుస్తూనే ఉన్నాయి. ఇక పాఠశాలలు, కళాశాలలు తెరిస్తే బస్సుల్లో ప్రయాణించే విద్యార్థులు నిత్యం ప్రమాదాలతో సహవాసం చేయాల్సిందే. డ్రైవర్ల నిద్రలేమి కూడా ప్రమాదాలకు కారణంగా మారుతోంది.