నెల్లూరు సిటీ,న్యూస్‌లైన్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఈ ఏడాది ఫిబ్రవరి 9న నిర్వహించేందుకు ప్రభుత్వం షెడ్యూల్ ఖరారు చేసింది. దీంతో టెట్, డీఎస్సీకి సిద్ధమవుతున్న అభ్యర్థుల్లో కొత్త ఆశలు చిగురించాయి. జిల్లా వ్యాప్తంగా అన్ని కేటగిరీల్లో ఉన్న 347 ఉపాధ్యాయ ఖాళీల కోసం 11,514 మంది పోటీ పడుతున్నారు. ఇందుకోసం ప్రాథమిక దశలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష రాసేందుకు పేపర్-1కు (ఎస్‌జీటీ) 1173 మంది, పేపర్-2కు (స్కూల్ అసిస్టెంట్) 10,229 మంది, రెండు పేపర్లూ రాసేందుకు 112 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరంతా ఫిబ్రవరి 9న నిర్వహించే టెట్‌కు హాజరవుతారు. ఈ పరీక్షలో సాధించే ఉత్తీర్ణత, అర్హతలను బట్టి డీఎస్సీకి హాజరు కావాల్సి ఉంటుంది.
జిల్లాలో 268 ఎస్‌జీటీ ఖాళీలున్నాయి. వీటితోపాటు 9 పీఈటీ, 42 పండిట్, 28 స్కూల్ అసిస్టెంట్ పోస్టులను డీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు. కేవలం 28 స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు 10,229 మంది దరఖాస్తు చేసుకున్నారు. అంటే ఒక్క పోస్టుకు 366 మంది పోటీ పడుతున్నారు. సెకండరీ గ్రేడ్ టీచర్ల భర్తీకి మాత్రం అంతగా పోటీ లేకపోవడంతో డీఎడ్ అభ్యర్థులు నూతనోత్సాహంతో ముందుకు కదులుతున్నారు. ఎస్‌జీటీ తత్సమానమైన పీఈటీ, పండిట్ పోస్టులు 319 ఉంటే కేవలం 1173 మంది మాత్రమే టెట్‌కు హాజరవుతున్నారు. దీంతో ఒక్కో పోస్టుకు 37 మంది పోటీలో నిలువనున్నారు.
బీఈడీ అభ్యర్థులకు శాపం : గతంలో బీఈడీ అభ్యర్థులు సైతం ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్లకు దరఖాస్తు చేసుకుని ఏదో ఒక ఉద్యోగంలో స్థిరపడేవారు. తాజాగా బీఈడీ అభ్యర్థులు స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు, డీఈడీ అభ్యర్థులు ఎస్జీటీ పోస్టులకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలనే నిబంధనతో బీఈడీ అభ్యర్థులకు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. గత ఏడాది వరకు డిగ్రీ పూర్తి చేసిన పలువురు బీఈడీ పూర్తి చేసేవారు. డీఈడీ పూర్తి చేసిన అభ్యర్థుల సంఖ్య స్వల్పంగానే ఉండేది. గత ఏడాది ప్రభుత్వం, న్యాయస్థానాలు వెలువరించిన తాజా నిర్ణయం డీఎడ్ అభ్యర్థులకు వరంగా పరిణమించించగా, బీఈడీ అభ్యర్థులకు శాపంగా మారింది.
టెట్‌కు గట్టి పోటీ
Published Sun, Jan 19 2014 5:07 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement
Advertisement