అనంతపురం జిల్లా పరిషత్తు, న్యూస్‌లైన్: రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేసి తెలుగు ప్రజల గొంతు కోసిన పాపానికి కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీలు మట్టిలో కలిసిపోవడం ఖాయమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బి.గురునాథ్‌రెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లు లోకసభలో మాదిరిగానే గురువారం రాజ్యసభ కూడా మూజువాణి ఓటుతో ఆమోదించడం దురదృష్టకరమన్నారు.
అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కి రాష్ట్ర విభజన బిల్లును అత్యంత అప్రజాస్వామిక పద్ధతిలో ఆమోదించడం సిగ్గుచేటన్నారు. సీమాంధ్ర ప్రజల మనోభావాలు పట్టించుకోకుండా ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం విభజన నిర్ణయం తీసుకోవడం హేయమైన చర్య అన్నారు. గురువారం రాత్రి వారు ‘న్యూస్‌లైన్’తో మాట్లాడారు. బిల్లు అసమగ్రంగా ఉందని అటార్నీ జనరల్, పలువురు రాజ్యాంగ నిపుణులు వ్యతిరేకించినా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ మొండిగా వ్యవహరించడం దారుణమన్నారు.
విభజన చేస్తామని సీమాంధ్ర ప్రజల గొంతు నిలువునా కోసేశారని ఆందోళన వెలిబుచ్చారు. కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి లోపాయికారీగా సహకరిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రాష్ట్రాన్ని ముక్కలు చేయండని... బ్లాంక్ చెక్కులా విభజనకు అనుకూలంగా లేఖ ఇవ్వడం వల్లనే తెలుగుజాతి విచ్ఛిన్నం అవడానికి ప్రధాన కారణమన్నారు. సీమాంధ్ర ప్రజలు ఎదుర్కొనే సమస్యలు, డిమాండ్లు పరిష్కరించిన తరువాతే బిల్లుకు మద్దతునిస్తామని చెప్పుకొస్తున్న మరో జాతీయ పార్టీ బీజేపీ ఉన్నఫలంగా కాంగ్రెస్ పార్టీకి ఆపన్నహస్తం అందించడం ఘోరమైన చర్యగా అభివర్ణించారు.
సవరణలు చేయాల్సిందేనంటూ చివర్లో డ్రామాను రక్తికట్టించిన బీజేపీ నేతలు సీమాంధ్ర ప్రజలను వంచనకు గురిచేశారని ధ్వజమెత్తారు. మూడు పార్టీలు విభజన ద్రోహులుగా సీమాంధ్రకు చీకటి రోజుగా మిగిల్చివేశారని మండిపడ్డారు. భాషాప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగా ఉంచడం కోసం మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అవిరళ కృషి చేశారన్నారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో వేర్పాటువాద శక్తుల అటకట్టించారన్నారు.
వైఎస్ హయాంలో తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోరలేదని గుర్తు చేశారు. మహానేత వైఎస్ ఆశయ సాధన కోసం జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కూడా రాష్ట్రం ముక్కలు కాకుండా జైలులో ఉండి పోరాటం చేశారన్నారు. తరువాత సమైక్య శంఖారావం పేరుతో రాష్ట్రంతో పాటు ఢిల్లీ వీధుల్లో కూడా ఉద్యమాన్ని చేపట్టారన్నారు. సమైక్య తీర్మానం చేసిన తరువాతనే విభజన బిల్లు గురించి మాట్లాడదామని మొదటి నుంచి జగన్‌మోహన్‌రెడ్డి మొత్తుకుంటున్నా కాంగ్రెస్, టీడీపీ పట్టించుకోక పోవడం వల్ల ఈ దుస్థితి ఏర్పడిందన్నారు. విభజన ద్రోహులకు రానున్న ఎన్నికల్లో రాజకీయ సమాధి కట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.
వారికి శిక్ష తప్పదు
Published Fri, Feb 21 2014 2:20 AM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM
Advertisement
Advertisement