న్యూస్‌లైన్- టాస్క్‌ఫోర్స్ : శాంతిభద్రలను పరిరక్షించాల్సిన పోలీసులే వాటికి విఘాతం కల్పించేందుకు పూనుకున్నారు. నిరక్షరాస్యులు.. స్పెల్లింగ్ తెలియనోళ్లు పోరాటంలో పాల్గొంటున్నారంటూ ఉద్యమాన్ని అపహాస్యం చేశారు. శాంతియుతంగా ఉద్యమిస్తోన్న ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నేతలు.. విద్యార్థులపై కేసులు బనాయించి బైండోవర్ చేస్తున్నారు. ఇది కింది స్థాయి పోలీసులు చేస్తోన్న విక ృత చేష్టలేమో అనుకుంటే తప్పులో కాలేసినట్లే..! సాక్షాత్తూ అనంతపురం జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) శ్యాంసుందర్ సాగిస్తోన్న విక ృత క్రీడ ఇది. వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లా ఎస్పీగా శ్యాంసుందర్ జూలై 13న బాధ్యతలు స్వీకరించారు. గుంటూరు, వరంగల్ జిల్లాల ఎస్పీగా పనిచేసిన కాలంలో శ్యాంసుందర్ తీరు వివాదాస్పదమైన విషయం విదితమే. అనంతపురం జిల్లాలోనూ ఆయన నడత మారలేదు.
బాధ్యతలు చేపట్టినప్పటి నుంచే వివాదాస్పద నిర్ణయాలతో పేట్రేగిపోతున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో జిల్లాలో సమైక్య ఉద్యమం మిన్నంటింది. సమైక్య ఉద్యమానికి చుక్కానిలా అనంతపురం జిల్లాలో ఉద్యమకారులు వ్యవహరిస్తున్నారు. శాంతియుతంగా సాగుతోన్న ఉద్యమాన్ని అణచేందుకు ఎస్పీ తీసుకుంటున్న చర్యలు హిట్లర్ పోకడలను తలదన్నుతున్నాయి. ఉద్యమాన్ని అదుపు తప్పకుండా చూస్తూ.. శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన ఎస్పీ తద్భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఉద్యమకారులను రెచ్చగొట్టేలా మాటల తూటాలను పేల్చుతున్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా శ్రీక ృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు ఆమరణ దీక్ష చేస్తోన్న శిబిరం వద్దకు గురువారం వెళ్లిన ఎస్పీ లాఠీలను ఝుళిపించారు. శాంతియుతంగా ఉద్యమిస్తోన్న విద్యార్థులను సాక్షాత్తూ ఎస్పీ గొడ్డులను బాదినట్లు బాదారు. దీన్ని కప్పిపుచ్చుకునే క్రమంలో ఎస్కే యూనివర్శిటీలో కడప ఫ్యాక్షనిస్టులు తిష్టవేసి.. ఉద్యమాన్ని నడిపిస్తున్నారని, అసాంఘిక శక్తులు ఉద్యమంలోకి చొరబడ్డాయంటూ ఉద్యమకారులను అపహాస్యం చేశారు.
ఎస్కే విశ్వవిద్యాలయం వద్దే ఓ పత్రికా విలేకరి అశోక్‌కుమార్‌పై దాడి చేశారు. దీంతో భయపడ్డ అశోక్‌కుమార్ ఆత్మాహత్యయత్నానికి పాల్పడ్డారు. ఇక ఎస్కే యూనివర్శిటీ వద్ద ఎస్పీ వీరంగం సృష్టించిన తర్వాత అనంతపురం నగరంలో శాంతియుతంగా ర్యాలీలు నిర్వహిస్తోన్న సాధారణ ప్రజలపై ఇష్టారాజ్యంగా దాడి చేశారు. ఆర్ట్స్ కళాశాల హాస్టల్‌లో ఉన్న విద్యార్థులపై అర్ధరాత్రి దాడి చేసి.. చావబాదారు. ఈ సంఘటనల తర్వాత శుక్రవారం అనంతపురంలో ఎస్పీ నిర్వహించిన విలేకరుల సమావేశాన్ని మీడియా ప్రతినిధులు బహిష్కరించారు. ఆ వెంటనే హిందూపురం వెళ్లి విలేకరులతో మాట్లాడుతూ సమైక్య ఉద్యమాల స్పెల్లింగ్ తెలియని వాళ్లు కూడా ఉద్యమాల్లో పాల్గొంటున్నారని ఆయన వ్యాఖ్యానించడం విమర్శలకు దారితీస్తోంది. నిరక్షరాస్యులు, స్పెల్లింగ్ తెలియని వారు ఉద్యమాల్లో పాల్గొనకూడదా అంటూ న్యాయవాదులు నిలదీస్తున్నారు. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 19(1)-ఏ ప్రకారం ప్రజలందరికీ భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. రాజ్యాంగం కల్పించిన హక్కులను పరిరక్షించాల్సిన ఎస్పీకి ఇది తెలియదనుకోవాలా అని ప్రశ్నిస్తున్నారు.
ఎస్పీ తీరుతోనే అరాచకం..
జిల్లాలో ఎస్పీగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచీ నియంత పోడలను అనుసరిస్తున్నారనే విమర్శలు పోలీసు వర్గాల నుంచే బలంగా విన్పిస్తున్నాయి. సమైక్య ఉద్యమాన్ని అణచేందుకు ఆయన అవలంబిస్తోన్న విధానాలను పోలీసులే జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసనలు వ్యక్తం చేసుకోవడానికి కూడా ఎస్పీ అనుమతించక పోవడం గమనార్హం. సమైక్య ఉద్యమ బాట పట్టిన వారిపై ఎస్పీ స్వయాన లాఠీ ఝుళిపించి.. గొడ్డుకన్నా హీనంగా చావబాదడం గమనార్హం. సమైక్య ఉద్యమకారులపై ఒక్క రబ్బరు బుల్లెట్టు.. బాష్పవాయు గోళాలు ప్రయోగించినా ఊరుకునేది లేదని సాక్షాత్తూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హెచ్చరికలు జారీ చేసినా, ఎస్పీ అత్యుత్సాహం ప్రదర్శిస్తుండటాన్ని ఎలా అర్థం చేసుకోవాలని మానవ హక్కుల సంఘాల నేతలు, సమైక్యవాదులు, ప్రజాస్వామ్యవాదులు ప్రశ్నిస్తున్నారు.
ముఖ్యమంత్రి ప్రకటనను పాటించాల్సిన ఎస్పీ బరితెగించి వీధుల్లో వీర విహారం చేశారు. తాను చెప్పిందే వేదంగా పాటించాలని జిల్లా వాసులకు హుకుం జారీ చేశారు. నియంత ృత్వ పోకడలు అవలంబిస్తోన్న ఎస్పీని ఉన్నతాధికారులు మందలించినా.. ప్రభుత్వ పెద్దలు తప్పని చెప్పినా ఆయన తీరును మార్చుకోవడం లేదు. సమైక్యాంధ్ర ఉద్యమాల్లో కొందరు ఫ్యాక్షన్ క్రిమినల్స్ కలసి జిల్లాలో పెద్ద ఎత్తున లూటీలకు పాల్పడేందుకు కుట్రలు పన్నినట్లు నిఘా వర్గాల ద్వారా గుర్తించామని చెబుతున్న పోలీసు ఉన్నతాధికారి.. నాలుగు రోజులుగా ఏ ఒక్కరిని అదుపులోకి తీసుకున్న సందర్భం లేదు. పైగా తన వాదనను బలపర్చుకొనేందుకు, ఎస్కేయూ విద్యార్థుల ఉద్యమాన్ని నీరుగార్చేందుకు తనదైన శైలిలో ఎత్తులు వేసే పనిలో పడ్డారు. ఉద్యమకారుల్లో క్రిమినల్స్, లూటీదారులు కలిశారని ప్రకటించిన ఎస్పీ సమైక్య ఉద్యమాన్ని అపహాస్యం చేస్తున్నారని ప్రజాస్వామ్యవాదులు నిరసిస్తున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం ఊపందుకున్న మొదటి రెండు రోజులు నేరుగా రంగంలోకి దిగిన ఆయన కనిపించిన వారిని కుక్కలను తరిమినట్లు తరిమి కొట్టారు. ఎస్పీ మాట్లాడిన మాటలు.. వ్యవహరించిన తీరు వల్లే ‘అనంత’లో తొలి రెండు రోజులు ఉద్యమం హింసాత్మకంగా మారిందని సమైక్యవాదులు ఆరోపిస్తున్నారు.
ప్రశాంతంగా ఉద్యమిస్తోన్న ప్రజలను ఆయన రెచ్చగొట్టేలా వ్యవహరించడంతో హింస చోటుచేసుకుంది. చేజేతులారా శాంతి భద్రతలు గతి తప్పడానికి కారణమైన ఎస్పీ.. పరిస్థితిని అదుపులో పెట్టడానికి అదనపు బలగాలు కావాలంటూ కేంద్రానికి లేఖ రాయడం గమనార్హం. ‘అనంత’ను ఖాకీవనంగా మార్చి.. సమైక్యవాదులపై పోలీసులను ఉసిగొల్పి ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచి వేయడానికి ఆయన ఎత్తులు వేస్తున్నట్లు తెలుస్తోంది. పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా ఎస్పీ నిరంకుశత్వంపై కథనాలు వెలువరించడంతో జర్నలిస్టులపై పోలీసు ‘మార్కు’ వేశారు. విలేకరులపై అక్రమ కేసులు బనాయించి.. వేధింపులకు తెర తీశారు.
ఈ అరాచకంఎవరి కోసం?
Published Fri, Aug 9 2013 2:21 AM | Last Updated on Mon, Sep 17 2018 5:36 PM
Advertisement
Advertisement