మీ సేవ కోసం... | For your service ... | Sakshi
Sakshi News home page

మీ సేవ కోసం...

Published Mon, Feb 10 2014 3:27 AM | Last Updated on Tue, Aug 21 2018 6:21 PM

For your service ...

  •      వనం బాట పట్టిన అధికారులు
  •      ఐదు రోజులూ అక్కడే
  •      బసకు ప్రత్యేక ఏర్పాట్లు
  •      అధికారుల ఖర్చు రూ.5కోట్లు
  •      జిల్లా కేంద్రం ఖాళీ
  •  హన్మకొండ, న్యూస్‌లైన్ : కలెక్టర్ మొదలు... పోలీస్ బాస్‌లు... ఇతర అధికారులు మొత్తం వనం బాట పట్టారు. మహా జాతర ప్రారంభ ఘట్టానికి ఒక్క రోజే మిగిలి ఉండడంతో మేడారానికి పయనమయ్యూరు. సోమవారం నుంచి అధికారులందరూ మేడారం మహాజాతర విధులు నిర్వర్తించనున్నారు. 36 ప్రభుత్వ విభాగాలకు చెందిన సుమారు 14 వేల మంది అధికారులు, సిబ్బంది మళ్లొచ్చే సోమవారం వరకు భక్తులకు సేవలందించనున్నారు.
     
    కలెక్టర్ ఆదేశాలతో...
     
    జిల్లా అధికారులు మొత్తం సోమవారం నుంచి మేడారంలోనే ఉండాలని కలెక్టర్ జి.కిషన్ ఆదేశించిన నేపథ్యంలో చేతిలో వైర్‌లెస్ సెట్లు, వాకీటాకీలతో తమ కు కేటాయించిన స్థానాల్లో విధులు నిర్వర్తించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే 39 మంది సెక్టోరియల్ అధికారులు మేడారం వెళ్లారు. ఇక కలెక్టర్ కిషన్, జేసీ పౌసుమిబసు, ఎస్పీలు లేళ్ల కాళిదాసు రంగారావు, వెంకటేశ్వర్‌రావు, ఎన్పీడీసీఎల్ సీఎండీ కార్తికేయ మిశ్రా, ఇద్దరు ఓఎస్డీలు, దేవాదాయ శాఖ డీసీ, ఎక్సైజ్ డీసీ, ఈఎస్, నలుగురు ఆర్డీఓలు, 9 మంది డీఎస్పీలు, 30 మంది సీఐలు... ఇలా అధికారులంతా మేడారంలో మకాం పెట్టారు.

    మొత్తంగా 36 శాఖల నుంచి 14 వేల మంది అధికారులు, సిబ్బంది మేడారం తరలివెళ్లగా, వీరిలో 9 వేల మంది పోలీసులు ఉన్నారు. మిగిలిన రెవెన్యూ, వైద్య, ఆరోగ్యం, పంచాయతీ, ఫారెస్ట్, విద్యుత్, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరాతోపాటు పలు శాఖలకు చెందిన 2500 మంది సిబ్బందికి మేడారంలో డ్యూటీ వేశారు. వీరుకాకుండా ప్రత్యేకంగా 2500 మంది పారిశుద్ధ్య కార్మికులను ఇప్పటికే మేడారంలో దింపగా.. జాతర పరిసరాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లడం, శుభ్రం చేసే పనుల్లో నిమగ్నమయ్యారు.
     
    అతిథిగృహాలు, ప్రత్యేక క్యాంపులు
     
    మేడారం జాతరలో విధులు నిర్వర్తించేందుకు జిల్లా నుంచి వెళ్లే అధికారులతోపాటు ఇతర జిల్లాల నుంచి వచ్చిన అధికారులు ఉండేందుకు బస ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. మేడారంలోని ఐటీడీఏ అతిథి గృహం, ఇంగ్లీష్ మీడియం స్కూల్‌తో పాటు వివిధ ప్రాంతా ల్లో అధికారుల కోసం ఏర్పాట్లు చేశారు. ఉన్నతాధికారులు బస చేసేందుకు వీలుగా కార్యాలయాలు, అతిథి గృహాలను తీర్చిదిద్దగా, పోలీసులకు ప్రత్యేక క్యాంప్ కేటాయించారు. వివిధ విభాగాల సిబ్బంది కోసం ఎక్కడికక్కడే తాత్కాలిక క్యాంపులు ఏర్పాటు చేసుకున్నారు.

    విద్యుత్ శాఖ కొత్తగా నిర్మించిన గెస్ట్‌హౌస్‌లో సీఎండీ కార్తికేయ మిశ్రా ఉంటున్నారు. గద్దెల పక్కనే ఉన్న వైద్యశాలలో జిల్లా వ్యాప్తంగా ఉన్న పీహెచ్‌సీ వైద్యులకు విధులు అప్పగించారు. అధికారులు, ఉద్యోగుల భోజనాలు, ఇతర ఏర్పాట్ల కోసం ప్రభుత్వం రూ.5 కోట్లు కేటాయిం చింది. ఇందులో రెవెన్యూ విభాగం తరఫున రూ.3 కోట్లు, పోలీసు శాఖకు రూ.2 కోట్లు కేటాయించింది. ఈ మేరకు రూ.3కోట్లలో కలెక్టర్ ఇప్పటికే వివిధ విభాగాలకు నిధులు విడుదల చేశారు. కాగా, పోలీసు శాఖకు ఎప్పుడూ లేనివిధంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రూ.2కోట్లు కేటాయించగా, మేడారంలో క్యాంపులఏర్పాటు, ఇతరత్రాపనులు పూర్తయ్యాయి.
     
    పాలన యంత్రాంగం మొత్తం..
     
    జాతర విధుల్లో భాగంగా సోమవారం నుంచి జిల్లా పాలన యంత్రాంగం మొత్తం వనంలోనే కొలువు దీరనుంది. దీంతో జిల్లా కేంద్రంతో పాటు ప్రధాన కార్యాలయాలన్నీ ఖాళీ అయినట్లే. మళ్లొచ్చే సోమవారం వరకు ప్రభుత్వ కార్యాలయాల్లో ఒక్క అధికారి, సిబ్బంది కూడా దొరకరు. దీంతో ఈ వారం రోజుల పాటు ఏదైనా అవసరం నిమిత్తం కార్యాల యాలకు రావాలనుకునే వారు పనులు వాయిదా వేసుకోవాల్సిందే. కాగా, జాతర విధులు నిర్వర్తించి న వారికి ప్రత్యేక సెలవులు ఇవ్వనుండడంతో వచ్చే సోమవారం కూడా కార్యాలయాల్లో విధులు నిమిత్తం అధికారులు, సిబ్బంది రావడం కష్టమేనని తెలుస్తోంది.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement