G.. Kishan
-
పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య
హన్మకొండ సిటీ : బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యనందించి వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని కలెక్టర్ జి.కిషన్ తెలిపారు. ఈ మేరకు విద్యార్థుల కోసం ప్రత్యేక హాస్టళ్లు, పదో తరగతి శిక్షణ కేంద్రాలు ఏర్పాటుచేస్తున్న ట్లు పేర్కొన్నారు. హన్మకొండ బాలసముద్రంలోని సాంఘిక సంక్షేమ శాఖ బాలికల హాస్టల్లో పదో తరగతి విద్యార్థుల(బాలికల) ప్రత్యేక శిక్షణ శిబిరాన్ని శుక్రవారం కలెక్టర్ ప్రారంభించారు. తొలుత బీ.ఆర్.అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసిన కలెక్టర్ ఆ తర్వాత ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. కష్టపడి చదవాలి విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్విని యోగం చేసుకుంటూ కష్టపడి చదువుకుని ఉన్నత స్థా యికి చేరాలని కలెక్టర్ కిషన్ సూచించారు. తెలంగాణ ఆవిర్భవించి రాష్ర్ట పునర్నిర్మాణం చేసుకుంటున్న దశ లో రాష్ర్టంలోనే జిల్లాలో మొదటిసారిగా పదో తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేక శిక్షణ శిబిరాలు ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు ఎస్సెస్సీలో 10 జీపీఏ సాధించడమే లక్ష్యంగా జిల్లాలో 29 శిబి రాలు ఏర్పాటుచేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ శిబిరాల్లో విద్యార్థులకు చదువు చెప్పేందుకు నిపుణులైన ఉపాధ్యాయులను నియమించడంతో పాటు మంచి భోజన, వసతి కల్పిస్తామన్నారు. ప్రతిరోజూ సాయంత్రం ఉపాధ్యాయులు ప్రత్యేక తరగతులు బోధిస్తూ వారానికోసారి పరీక్ష నిర్వహిస్తారని కలెక్టర్ తెలిపారు. పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా బోధనలో మార్పులు చేస్తారని వివరించారు. దసరా, సంక్రాంతి సెలవులకు మాత్రమే ఇంటికి వెళ్లి, మిగతా పది నెలలు చదువుపైనే దృష్టి సారించాలని కలెక్టర్ విద్యార్థులకు సూచించారు. ఎన్సీఆర్టీ పుస్తకాలు అందుబాటులో ఉంచడంతో పాటు ఐఐటీ కోచింగ్ ఇప్పించనున్నట్లు చెప్పారు. అలాగే, ఏమైనా సమస్య ఉంటే నేరుగా తనకు ఫోన్ చేసేందుకు వీలుగా హాస్టల్లో కాయిన్ బాక్స్ ఏర్పాటుచేయిస్తానని తెలిపారు. హాస్టల్లో ఏర్పాటుచేయనున్న గ్రీవెన్స్ రిజి స్టర్‌ను వారానికో సారి పరిశీలించి విద్యార్థుల సమస్య లు పరిష్కరిస్తానని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సందర్భం గా విద్యార్థులకు పుస్తకాలు, బెడ్షీట్లు, దుప్పట్లు అం దించారు. సమావేశంలో ఏజేసీ కృష్ణారెడ్డి, డీఈఓ విజ య్‌కుమార్, సాంఘీక సంక్షేమ సహాయ అధికారిణి రమాదేవి, సమాచార కేంద్రం డిప్యూటీ డైరక్టర్ డీ.ఎస్.జగన్, హాస్టల్ వార్డెన్ పద్మజ పాల్గొన్నారు. -
పన్నులు చెల్లించి అభివృద్ధికి తోడ్పడాలి
కలెక్టర్ జి.కిషన్ నారాయణపురంలో మినీ అమరవీరుల స్థూపం ఆవిష్కరణ హాజరైన మానుకోట ఎంపీ, ఎమ్మెల్యే, ప్రభుత్వ అధికార ప్రతినిధి నారాయణపురం(నెల్లికుదురు) : పన్నులు సకాలంలో చెల్లించి గ్రామాల అభివృద్ధికి సహకరించాలని జిల్లా కలెక్టర్ జి.కిషన్ ప్రజలకు సూచించారు. మండలంలోని తుల్చాతండా, నారాయణపురం గ్రామాల్లో అంగన్వాడీ భవనాల ప్రారంభం, నారాయణపురంలో మినీ అమరవీరుల స్థూపం ఆవిష్కరణ, ఆలేరు నుంచి కల్వల వరకు మెటల్ రోడ్డు పనులకు, వెంకటి తండాకు సీసీ రోడ్డు, బోడకుంట తండా పాఠశాల భవన నిర్మాణానికి శుక్రవా రం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాలను కలెక్టర్‌తోపాటు ప్రభుత్వ అధికార ప్రతినిధి తేజావత్ రాంచంద్రునాయక్, ఎంపీ అజ్మీర సీతారాంనాయక్, ఎమ్మెల్యే బానోతు శంకర్‌నాయక్, సర్పంచ్ డాక్టర్ ఊకంటి యాకూబ్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ పం చాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ పల్లెలు బాగుంటేనే దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పిన గాంధీజీ సూక్తులను నిజం చేయాలం టే గ్రామాల్లో ప్రతి ఒక్కరూ పన్నులు చెల్లించాలన్నారు. చెప్పిన వారం రోజులకే 320 సమస్యలను తన ముందుంచిన సర్పంచ్‌ను అభినందించారు. ఇలాంటి సర్పంచ్‌లకు సహకరించాలన్నారు. నారాయణపురం గ్రామాన్ని మోడల్ పంచాయతీగా తీర్చిదిద్ధేందుకు తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా తప్పనిసరిగా పన్నులు చెల్లిస్తామని గ్రామస్తులతో వాగ్దానం చేయించారు. తెలంగాణ ప్రభుత్వ అధికార ప్రతినిధి తేజావత్ రాంచంద్రునాయక్ మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన వెంటనే ఎవరూ చేయని విధంగా అమరవీరుల కీర్తి స్థూపాన్ని ఆవిష్కరించి తెలంగాణ పట్ల తన ప్రేమను చాటుకున్న ఏకైక కలెక్టర్ కిషన్ అని కొనియాడారు. ప్రజాసమస్యలు స్వయంగా తెలుసుకునేందకు గ్రామదర్శిని పేరుతో పుస్తకం రూపొందించి అందుబాటులోకి తెచ్చారని, ఈ పుస్తకాన్ని ప్రజాప్రతినిధులు అధ్యయనం చేసి ప్రభుత్వ పథకాలను అమలు చేయడానికి తోడ్పడుతుం దని అన్నారు. పార్లమెంట్లోఉన్న టీఆర్ఎస్ ఎంపీల సహకారంతో దశలవారీగా బంగారు తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. మహబూబాబాద్ ఎంపీ సీతారాంనాయక్, ఎమ్మెల్యే శంకర్‌నాయక్ మాట్లాడుతూ మహబూబాబాద్‌ను అన్నివిధాల అభివృద్ధి చేయడానికే ఉద్యోగాలకు రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చామని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులతో నియోజకవర్గంలోని దళిత గిరిజన కాలనీలో మౌలిక వసతుల కల్పనకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు అన్నారపు యాకయ్య, ఆర్డీఓ మధుసూదన్‌నాయక్, సీడీపీఓ నిర్మలాదేవి, ఎంపీడీఓ కె.కర్ణాకర్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు వి.స్వామి, రాజ్‌కుమార్, ఏఓ నెలకుర్తి రవీదంర్‌రెడ్డి, సత్యనారాయణరెడ్డి, సదాశివరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, శ్రీనివాస్, డీటి మల్లయ్య, కార్యదర్శి సోంద్ఖాన్ తదితరులు పాల్గొన్నారు. -
వారం రోజులు రాష్ట్ర అవతరణ పండుగ
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆవతరణ వేడుకలు జూన్ 2వ తేదీ నుంచి వారంపాటు అధికారికంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ జి.కిషన్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అవతరణ దినత్సోవం సందర్భంగా జూన్ 2న ఉదయం 8.45 నిమిషాలకు హెడ్‌క్వార్టర్స్‌లో జాతీయ పతాకం ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు. జిల్లాలోని చారిత్రక భవనాలు, ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించాలని సూచించారు. స్వాతంత్య్ర సమర యోధులకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయాలన్నారు. వారంపాటు జిల్లా అంతటా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని ఆదేశించారు. అంతేగాక 2వ తేదీ నుంచి నుంచి 8 వరకు ప్రతిరోజు సాయంత్రం నేరెళ్ల వేణుమాధవ్ ఆడిటోరియంలో వివిధ కళా బృందాలతో ప్రత్యేకంగా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. నిర్వహణ బాధ్యతలను డీఈఓ విజయ్‌కుమార్, సమాచార శాఖ డీడీ బాలగంగాధర తిలక్, రాష్ట్ర సమాచార కేంద్ర ఏడీ డీఎస్.జగన్, టూరిజం అధికారి శివాజీ, సెట్వార్ సీఈఓ పురుషోత్తం, వరంగల్ ఆర్డీఓ మధుతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. క్రీడాపోటీలు నిర్వహించాలని డీఎస్డీఓఓను ఆదేశించారు. ఈ వేడుకల సందర్భంగా పాఠశాల, హాస్టళ్లలో ప్రతిభ కనబరినచిన విద్యార్థులకు గుర్తించి బహుమతులు అందజేయాలని సూచించారు. వేడుకల సందర్భంగా మండల, డివిజన్ స్థాయిల్లో కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో జేసీ పౌసుమి బసు, ఏజేసీ కృష్ణారెడ్డి, ఎస్పీ వెంకటేశ్వర్రావు, డీఆర్వో సురేందర్‌కరణ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
అమరుల త్యాగఫలమే తెలంగాణ
అంబరాన్నంటేలా రాష్ట్ర అవతరణ వేడుకలు జూన్ 1 అర్ధరాత్రి అమరుల కీర్తి స్థూపం ఆవిష్కరణ అమరుల కుటుంబాలకు సన్మానం జిల్లా కలెక్టర్ జి.కిషన్ వెల్లడి కలెక్టరేట్, న్యూస్‌లైన్ : నీళ్లు, నిధులు, నియామకాల కోసం సాగిన తెలంగాణ ఉద్యమంలో సుమారు 12వందల మంది ఆత్మబలిదానాలు చేసుకున్నారని, వారి త్యాగఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతున్న తరుణంలో అవతరణ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఓరుగల్లు సేవా ట్రస్ట్ వ్యవస్థాపక చైర్మన్, జిల్లా కలెక్టర్ జి.కిషన్ చెప్పారు. కలెక్టర్ నివాసం ఎదుట, ఆర్ట్స్ కళాశాలలో చేపడుతున్న తెలంగాణ అమరవీరుల స్థూపం పను లను ట్రస్ట్ సభ్యలతో కలిసి బుధవారం పరిశీ లించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ వేడుకల ఏర్పాట్లను వివరించారు. అమరుల త్యాగానికి గుర్తుగా అమరవీరుల కీర్తి స్థూపం ఆవిష్కరిస్తున్నామని, అనంతరం వారి కుటుంబ సభ్యులను సత్కరించనున్నామని చెప్పారు. జూన్ ఒకటో తేదీ అర్ధరాత్రి 12.01 నిమిషానికి సూపం ఆవిష్కరించడం జరుగుతుందన్నారు. అదే విధంగా జూన్ 2న ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు పలు కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. 1న అర్ధరాత్రి క్యాండిల్ ర్యాలీ జూన్ 1న అర్ధరాత్రి 12 గంటలకు కీర్తి స్థూపం వద్దకు చేరుకునే విధంగా.. కాళోజి జంక్షన్‌నుంచి, ఎన్ఐటీ నుంచి రెండు బృందాలు కొవ్వత్తులతో ప్రదర్శనగా వస్తాయని, సూప్కం వద్ద రెండు నిమిషాలు మౌనం పాటించి.. ఆవిష్కరణ కార్యక్రమం చేపడతామని తెలిపారు. అమరుల త్యాగాలు అనుక్షణం గుర్తిస్తూ వారి ఆశయ సాధనకు పాటు పడేలా కీర్తి స్థూపం వద్ద ప్రతిజ్ఞ చేయిస్తామని, లెంగాణ సంసృ్కతి ఉట్టిపడేలా బతుకమ్మ, బోనాలు, చిందుయక్షగానం వంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రభుత్వ, ప్రయివేటు పరంగా ప్రత్యేకంగా స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధికి కృషిచేయాలి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అంతర్జాతీయ స్థా యిలో అభివృద్ధి చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని కలెక్టర్ కిషన్ పిలుపునిచ్చారు. తెలంగాణ పు నర్నిర్మాణంలో ఉద్యోగుల పాత్ర కీలకమన్నారు. రాష్ట్రా న్ని అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా తీసుకెళ్లినప్పుడే అమరులకు నిజమైన నివాళి అర్పించినట్లన్నారు. 32 అడుగుల స్థూపం తెలంగాణలో తొలిసారిగా 32 అడుగుల ఎత్తు, 60 టన్నుల బరువు ఉన్న స్థూపాన్ని ఏర్పాటు చేస్తున్నామని, దీని తయారీకి స్థపతి శివకుమార్ నేతృత్వంలో 16మంది శిల్పులు 20రోజులుగా శ్రమిస్తున్నారని చెప్పారు. అన్ని శాఖల భాగస్వామ్యంతో పనులు సాగుతున్నట్లు తెలిపారు. తెలంగాణ ముద్దుబిడ్డ కలెక్టర్ : పరిటాల సుబ్బారావు తెలంగాణ ముద్దుబిడ్డ అయిన కలెక్టర్ కిషన్ జిల్లాలో ఉన్నందువల్లే ఇలాంటి గొప్ప కార్యక్రమం చేపట్టగలుగుతున్నామని, అమరుల కీర్తి స్థూపం ఏర్పాటులో కలెక్టర్ చొరవ, అంకితభావం మరువలేదనిదని ట్రస్ట్ కన్వీనర్ పరిటాల సుబ్బారావు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రథమంగా వరంగల్ జిల్లాలో మాత్రమే ఈ విధమైన కార్యక్రమం చేపడుతున్న ఘనత కలెక్టర్‌కు దక్కుతుందన్నారు. ట్రస్ట్‌కు ఉద్యోగుల సగం రోజు వేతనం రూ.30 లక్షలకు పైగా త్వరలో అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఇన్టాక్ కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారావు, టీఎన్జీవోస్ అధ్యక్షుడు కోలా రాజేష్‌కుమార్, కార్యదర్శి రత్నవీరాచారి, టీజీవోల సంఘం ప్రధాన కార్యదర్శి జగన్మోహన్రావు, శ్రీనివాస్‌రావు, వీఆర్వోల సంఘం నేతలు దొండపాటి రత్నాకర్‌రెడ్డి, నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం నేత దాస్యనాయక్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలి
కేయూ క్యాంపస్, న్యూస్‌లైన్ : విద్యార్థులు సామాజిక శాస్త్రవేత్తలుగా ఎదగాలని కలెక్టర్ జి.కిషన్ కోరా రు. హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ క ళాశాలలో సోమవారం సెట్వార్ ఇంట ర్నల్ క్వాలిటీ అస్యూరెన్స్ సెల్, సోషల్ వర్క్ డిపార్టమెంట్ ఆధ్వర్యంలో కేయూ ఎంఎస్‌డబ్ల్యూ విద్యార్థులకు ఓరియెంటేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సంక్షేమ పథకాల ప్రాధాన్యతను లబ్ధిదారులకు తెలియజేసి వారిలో అపోహలను తొలగించాలని పేర్కొన్నారు. విభజనకు ముందు రాష్ర్ట బడ్జెట్ ఒక లక్షా 15వేల కోట్లని, కేంద్రం ద్వారా రూ.15 లక్షల కోట్లతో పేదలకు సంక్షేమ పథకాలు అమ లు చేస్తున్నారని ఆయన వెల్లడించారు. ప థకాల అమలు కోసం విద్యార్థులు ప్రణాళికలు తయారు చేయాలన్నారు. ప్రజల కు ఆహారం, నీరు, విద్య, ఉపాధి, గూడు తదితర వసతులపై దృష్టిసారించాలని సూచించారు. నాగరికత పెరిగిన కొద్దీ అ లవాట్లు మారి ప్రజలు రోగాల బారిన పడుతున్నారన్నారు. మంచి అలవాట్లకు దూరమై మన ముందున్న మంచిని గ్రహించలేని పరిస్థితుల్లో ఉన్నామని ఆ వేదన వ్యక్తం చేశారు. గతంలో లక్ష మందిలో ఒకరికి కేన్సర్ ఉండగా.. ప్రస్తు తం ప్రతి వేయి మందిలో పది మందికి ఉంటుందన్నారు. సామాజిక దురాచారాలు, పారిశుద్ధ్యంపై ప్రజలను చైతన్యం చేయాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. తొలుత గ్రామీణ నీటిపారుదల, గృహ నిర్మాణం, డీఆర్డీఏ, వెనుకబడిన తరగతుల సం క్షేమం, స్త్రీ, శిశు సంక్షేమం, వైద్య, ఆరోగ్యం తదితర శాఖల ద్వారా అమలయ్యే పథకాల గురించి పవర్‌పాయింట్ ప్రజం టేషన్ ద్వారా సంబంధిత అధికారులు విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో సెట్వార్ సీఈఓ పురుషోత్తమ్, నెహ్రూ యువ కేంద్రం కోఆర్డినేటర్ మనోరంజన్, డీఆర్డీఏ పీడీ శంకరయ్య, మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ (ఎంఎస్‌డబ్ల్యూ) విభాగం అధిపతి ప్రొఫెసర్ కె.రామానుజరావు మాట్లాడారు. యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, న్యూసైన్స్, గాయత్రి, మాస్టర్జీ, మహర్షి తదితర కళాశాలల ఎంఎస్‌డబ్ల్యూ విద్యార్థులు పాల్గొన్నారు. -
రెండు విడతల్లో ‘స్థానికం’
8న వరంగల్ డివిజన్లో.. 6న మిగతా ప్రాంతాల్లో ఎన్నికలు 20 చెక్‌పోస్టుల ఏర్పాటు ఇప్పటివరకు రూ.59 లక్షల నగదు పట్టివేత కలెక్టర్ జి.కిషన్ వెల్లడి కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లా, మండల ప్రాదేశిక నియోజకవర్గాల ఎన్నికలను జిల్లాలో రెండు విడతలుగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కిషన్ తెలిపారు. జిల్లాలో ఏఐఈఈఈ పరీక్షలతోపాటు ఇతర ఎన్నికలు ఉండడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామన్నారు. ఏప్రిల్ ఆరు, ఎనిమిదో తేదీల్లో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. కలెక్టరేట్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్థానిక ఎన్నికల నేపథ్యంలో చేపట్టిన చర్యలు, ఏర్పాట్లను వివరించారు. జిల్లాలో జరగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు అన్నిరకాల చర్యలు తీసుకున్నామని, వరంగల్ డివిజన్లో ఎనిమిదిన, మిగతా డివిజన్లలో ఆరో తేదీన నిర్వహించాలనే యోచనలో ఉన్నట్లు వెల్లడించారు. 8న శ్రీరామనవమి పర్వదినం ఉన్నప్పటికీ పోలింగ్‌కు పెద్దగా ఇబ్బందులు ఉండవని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. ఎన్నికలకు సు మారు 14,500 సిబ్బం ది అవసరముంటుం దనే అంచనాతో ఎంపి క చేసినట్లు తెలిపారు. జిల్లా లో వివిధ శాఖల ప్రభు త్వ ఉద్యోగులు మొత్తం 40 వేలకు పైగా ఉన్నందున... ఎన్నికల విధుల కేటాయింపులో ఇబ్బందు లు ఉండవని కలెక్టర్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్ పకడ్బం దీగా అమలు చేసేం దుకు తొమ్మిది ప్రత్యేక బృందాలను నియమించామన్నారు. మొత్తం 5,220 బ్యాలెట్ బాక్స్‌లు అవసరమవుతాయని, వీటిలో మూడు వేల బాక్స్‌లను ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించనున్నట్లు తెలిపారు. ఎన్నికల సందర్భంగా 20 చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని, ఇప్పటివరకు రూ.59 లక్షల నగదు పట్టుకున్నట్లు వివరించారు. జిల్లాలో జరుగుతున్న మూడు రకాల ఎన్నికలకు సంబంధించి ప్రవర్తనా నియమావళి అమలుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాజకీయ పార్టీలు ప్రచారంలో వినియోగించే వస్తువుల ధరలు త్వరలో నిర్ణయించనున్నట్లు తెలిపారు. చెల్లింపు వార్తా కథనాలపై సుప్రీంకోర్డు తీర్పు ప్రకారం నడుచుకుంటామని కలెక్టర్ చెప్పారు. విలేకరుల సమావేశంలో జెడ్పీ సీఈఓ ఆంజనేయిలు పాల్గొన్నారు. -
పకడ్బందీగా ‘టెట్’ నిర్వహించాలి
ఎలాంటి లోపాలు తలెత్తొద్దు సీఎస్, డీఓల సమావేశంలో కలెక్టర్ కిషన్ విద్యారణ్యపురి, న్యూస్‌లైన్ : టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్(టెట్)లో ఎలాంటి లోపాలు తలెత్తకుండా పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ జి.కిషన్ ఆదేశించారు. 16వ తేదీ ఆదివారం టెట్ జరగనున్న సందర్భంగా హన్మకొండలోని డీఈఓ కార్యాలయ ఆవరణలో టెట్ పరీక్ష నిర్వహణలో భాగస్వాములయ్యే చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెం టల్ ఆఫీసర్లతో పాటు రూట్ ఆఫీసర్లు, స్క్వాడ్ బృందాల సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ కొన్ని నెలల క్రితం టెక్నికల్ టీచర్ సర్టిఫికెట్ పరీక్షలో కాపీ జరగడంతో ఆ పరీక్ష రద్దు చేసేలా ప్రతిపాదనలు పంపించామని గుర్తు చేస్తూ... టెట్ నిర్వహణలో అలాంటి పొరపాట్లకు తావివ్వొద్దని సూచించారు. నిర్ధేశించిన సమయం తర్వాత అభ్యర్థులను కేంద్రాల్లోకి అనుమతించొద్దని ఆదేశించారు. జిల్లా విద్యాశాఖాధికారి విజయకుమార్ మాట్లాడుతూ టెట్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తిచేశామని తెలిపారు. ఈ సందర్భంగా సీఎస్‌లు, డీవోలు, రూట్ ఆఫీసర్ల బాధ్యతలను వివరించడమే కాకుండా నిబంధనలతో కూడిన పుస్తకాలను అందజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఈఓలు డి.వాసంతి, అబ్దుల్‌హై, నరేందర్‌రెడ్డి, కృష్ణమూర్తి, ఏడీ వెంకటరమణ, ఎంఈఓ వీరభద్రునాయక్, సీనియర్ అసిస్టెంట్లు జగదీశ్వర్, ఎస్బీ.శ్రీనివాస్, సీహెచ్.శ్రీనివాస్, సూపరింటెండెంట్ వేణుగోపాల్ పాల్గొన్నారు. కాగా, సీఎస్, డీఓల సమావేశం ముగిశాక కలెక్టర్ కిష న్ డీఈఓ చాంబర్‌కు వెళ్లారు. కార్యాలయంలోని ఎస్టాబ్లిష్మెంట్, లీగల్ సెక్షన్‌ను పరిశీలించిన అనంతరం చాంబర్లో సీసీ కెమెరాల ఏర్పాటు, కార్యాలయ ఆవరణ లో సుందరీకరణ పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. పేపర్-1కు 12, పేపర్-2కు 94 కేంద్రాలు టీచర్ ఎలిజిబులిటీ టెస్టు(టెట్) కోసం జిల్లా విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. పేపర్-1 పరీక్ష ఉదయం 9-30నుంచి మధ్యాహ్నం 12-30గంటల వరకు నిర్వహిం చనుండగా 12 కేంద్రాలు ఏర్పాటుచేశారు. ఈ పరీక్షకు 2,598మంది హాజరుకానున్నారు. పేపర్-2 పరీక్ష మధ్యాహ్నం 2-30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జరగనుండగా 94 కేంద్రాలు ఏర్పాటుచేశామని, 21,932 మంది అభ్యర్థులు హాజరుకానున్నారని డీఈఓ విజయ్‌కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించడమే కాకుండా అక్కడి జిరాక్స్ సెంటర్లను మూసివేయనున్నట్లు వివరించారు. కాగా, అభ్యర్థులు నిర్ధేశించిన సమయం కంటే గంట ముందుగా కేంద్రాల వద్దకు చేరుకోవాలని సూచించారు. ఒక నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని స్పష్టం చేశారు. హాల్‌టికెట్ ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయని, డౌన్లోడ్ చేసుకోవడంలో ఇబ్బందులు ఎదురైతే గత నెలలో పరీక్ష పోస్ట్‌పోన్ కావడానికి ముందు జారీ చేసిన హాల్‌టికెట్లను కూడా అనుమతిస్తామని డీఈఓ వివరించారు. -
మహా ఏర్పాట్లు
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : మహాజాతరలో కోటి మంది భక్తులు సమ్మక్క, సారలమ్మను దర్శించుకునే విధంగా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ జి.కిషన్ తెలిపారు. ఇప్పటికే 25లక్షల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారని చెప్పారు. మేడారం ఏర్పాట్లపై కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 12 నుంచి 15వ తేదీ వరకు రద్దీ ఎంత ఉన్నా ప్రతీ భక్తుడు ప్రశాంతంగా దర్శనం చేసుకుని తిరిగి వెళ్లేలా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. రోడ్లు వెడల్పు చేయడం వల్ల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. జాతర పరిసర ప్రాంతాల్లో కూడా భక్తుల రద్దీకి తగ్గట్లు విస్తరణ పనులు చేసినట్లు తెలిపారు. దర్శనం తర్వాత బయటకు వచ్చేందుకు రెండు దారులు ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. భక్తులకు అమ్మవార్ల ప్రసాదం అమ్మవార్ల దర్శనం అనంతరం భక్తులు బయటకు వచ్చే మార్గంలో ప్రసాదం అందించేందుకు కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రత్యేక సిబ్బంది సుమారు 40 వరకు కౌంటర్ల ద్వారా ప్రసాదం అందిస్తారన్నారు. క్యూలైన్లలో నిలబడే భక్తుల కోసం మంచినీటి సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. జాతరలో మంచి నీటిని పూర్తిస్థాయిలో క్లోరినేషన్ చేసి అందజేస్తున్నామని చెప్పారు. మరుగుదొడ్ల నిర్మాణం జాతరలో భక్తుల అవసరాలకు తగ్గట్లు టాయిటెట్ల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. వీటితోపాటు జనం ఎక్కువ సంఖ్యలో గుడారాలు ఏర్పరుచుకున్న చోట మొబైల్ టాయిలెట్స్ అందుబాటులో ఉంచేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. పారిశుద్ధ్యం విషయంలో అధికారులు పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించినట్లు తెలిపారు. మద్యం అమ్మకాలపై నజర్ జాతరలో 22 మద్యం దుకాణాల ఏర్పాటుకు అ నుమతి ఇచ్చామన్నారు. మద్యం వ్యాపారులు అడ్డగోలుగా ధరలు పెంచకుండా, సిండికేట్ వ్యాపారంతో ఇబ్బందులు లేకుండా ఉండేం దుకు బృందాలు ఏర్పాటు చేస్తున్నా మన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారం చేస్తే లెసైన్స్ రద్దు చేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. సూపర్ స్పెషాలిటీ వైద్యం మేడారంలోని 60 పడకల ఆస్పత్రిలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించనున్నట్లు తెలి పారు. వైద్యాధికారులు, సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉంటారని, 104 వాహనం సంచార వైద్య సేవలు అందిస్తుందన్నారు. మేడారం జాతరలో ప్లాస్టిక్ కవర్లను పూర్తిస్థాయిలో నిషేధించడానికి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. అధికారులు ప్రత్యేక బృందాలుగా దాడులు చేసి కేసులు నమోదు చేస్తారన్నారు. ఆటోలకు అనుమతి లేదు మేడారం వెళ్లే రహదారులు విస్తరించి ఉన్నందున వాహనాలు వేగంగా వచ్చే అవకాశం ఉం దని, అలాంటి సమయంలో ఆటోలతో ఇబ్బందులు ఎదురవుతాయని, దీంతో మంగళవారం నుంచి జాతర ముగిసే వరకు మేడారం వెళ్లేందుకు ఆటోలను అనుమతించమని వరంగల్ రూరల్ ఎస్పీ లేళ్ల కాళిదాసు తెలిపారు. ద్విచక్ర వాహనాలపై ప్రయాణం కూ డా ఇబ్బందికరమేనని, ఈ విషయంలో వాహనదారులే నిర్ణయం తీసుకోవాలని అన్నారు. జాతరకు సంబంధించి ప్రధానమైంది ట్రాపిక్ సమస్య అని, దానిని అదిగమించేందుకు పక్కా ప్రణాళిక సిద్ధం చేసినట్లు వివరించారు. వీఐపీ, వీవీఐపీ పార్కింగ్ కోసం 24 స్థలాలు ఏర్పాటు చేశామని, అ డ్డంగా ఉన్న వాహనాలను తొలగించేందుకు నాలుగు క్రేన్లు, జేసీబీలు సిద్ధంగా ఉంచామన్నారు. డ్రైవర్లు మద్యం తాగొద్దు జాతరకు వాహనాలు తీసుకొచ్చే డ్రైవర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం సేవించి వాహనాలు న డపొద్దని అన్నారు. జంగాలపల్లి, పస్రాతోపాటు మరికొన్ని చోట్ల ప్రత్యేక పోలీసు గస్తీ బృందాలు బ్రీతింగ్ అనలైజర్స్తో పరీక్షలు చేస్తారని, డ్రైవర్లు తాగినట్లు గుర్తిస్తే వాహనం అక్కడే నిలిపివేస్తామని తెలిపారు. రాత్రి సమయంలో డ్రైవింగ్ చేసేవారికి నిద్రమత్తు తొలగించేందుకు పస్రాతోపాటు కొన్నిచోట్ల ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ఐస్‌లో తడిపిన కాటన్ ఇవ్వనున్నట్లు చెప్పారు. చల్లని బట్టతో కళ్లు తుడుచుకోవడం వల్ల మరో 40 కిలోమీటర్ల వరకు నిద్రమత్తు రాకుండా ఉంటుందని అన్నారు. ఇది ఈసారి ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. -
మీ సేవ కోసం...
వనం బాట పట్టిన అధికారులు ఐదు రోజులూ అక్కడే బసకు ప్రత్యేక ఏర్పాట్లు అధికారుల ఖర్చు రూ.5కోట్లు జిల్లా కేంద్రం ఖాళీ హన్మకొండ, న్యూస్‌లైన్ : కలెక్టర్ మొదలు... పోలీస్ బాస్‌లు... ఇతర అధికారులు మొత్తం వనం బాట పట్టారు. మహా జాతర ప్రారంభ ఘట్టానికి ఒక్క రోజే మిగిలి ఉండడంతో మేడారానికి పయనమయ్యూరు. సోమవారం నుంచి అధికారులందరూ మేడారం మహాజాతర విధులు నిర్వర్తించనున్నారు. 36 ప్రభుత్వ విభాగాలకు చెందిన సుమారు 14 వేల మంది అధికారులు, సిబ్బంది మళ్లొచ్చే సోమవారం వరకు భక్తులకు సేవలందించనున్నారు. కలెక్టర్ ఆదేశాలతో... జిల్లా అధికారులు మొత్తం సోమవారం నుంచి మేడారంలోనే ఉండాలని కలెక్టర్ జి.కిషన్ ఆదేశించిన నేపథ్యంలో చేతిలో వైర్లెస్ సెట్లు, వాకీటాకీలతో తమ కు కేటాయించిన స్థానాల్లో విధులు నిర్వర్తించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే 39 మంది సెక్టోరియల్ అధికారులు మేడారం వెళ్లారు. ఇక కలెక్టర్ కిషన్, జేసీ పౌసుమిబసు, ఎస్పీలు లేళ్ల కాళిదాసు రంగారావు, వెంకటేశ్వర్రావు, ఎన్పీడీసీఎల్ సీఎండీ కార్తికేయ మిశ్రా, ఇద్దరు ఓఎస్డీలు, దేవాదాయ శాఖ డీసీ, ఎక్సైజ్ డీసీ, ఈఎస్, నలుగురు ఆర్డీఓలు, 9 మంది డీఎస్పీలు, 30 మంది సీఐలు... ఇలా అధికారులంతా మేడారంలో మకాం పెట్టారు. మొత్తంగా 36 శాఖల నుంచి 14 వేల మంది అధికారులు, సిబ్బంది మేడారం తరలివెళ్లగా, వీరిలో 9 వేల మంది పోలీసులు ఉన్నారు. మిగిలిన రెవెన్యూ, వైద్య, ఆరోగ్యం, పంచాయతీ, ఫారెస్ట్, విద్యుత్, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరాతోపాటు పలు శాఖలకు చెందిన 2500 మంది సిబ్బందికి మేడారంలో డ్యూటీ వేశారు. వీరుకాకుండా ప్రత్యేకంగా 2500 మంది పారిశుద్ధ్య కార్మికులను ఇప్పటికే మేడారంలో దింపగా.. జాతర పరిసరాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లడం, శుభ్రం చేసే పనుల్లో నిమగ్నమయ్యారు. అతిథిగృహాలు, ప్రత్యేక క్యాంపులు మేడారం జాతరలో విధులు నిర్వర్తించేందుకు జిల్లా నుంచి వెళ్లే అధికారులతోపాటు ఇతర జిల్లాల నుంచి వచ్చిన అధికారులు ఉండేందుకు బస ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. మేడారంలోని ఐటీడీఏ అతిథి గృహం, ఇంగ్లీష్ మీడియం స్కూల్‌తో పాటు వివిధ ప్రాంతా ల్లో అధికారుల కోసం ఏర్పాట్లు చేశారు. ఉన్నతాధికారులు బస చేసేందుకు వీలుగా కార్యాలయాలు, అతిథి గృహాలను తీర్చిదిద్దగా, పోలీసులకు ప్రత్యేక క్యాంప్ కేటాయించారు. వివిధ విభాగాల సిబ్బంది కోసం ఎక్కడికక్కడే తాత్కాలిక క్యాంపులు ఏర్పాటు చేసుకున్నారు. విద్యుత్ శాఖ కొత్తగా నిర్మించిన గెస్ట్‌హౌస్‌లో సీఎండీ కార్తికేయ మిశ్రా ఉంటున్నారు. గద్దెల పక్కనే ఉన్న వైద్యశాలలో జిల్లా వ్యాప్తంగా ఉన్న పీహెచ్సీ వైద్యులకు విధులు అప్పగించారు. అధికారులు, ఉద్యోగుల భోజనాలు, ఇతర ఏర్పాట్ల కోసం ప్రభుత్వం రూ.5 కోట్లు కేటాయిం చింది. ఇందులో రెవెన్యూ విభాగం తరఫున రూ.3 కోట్లు, పోలీసు శాఖకు రూ.2 కోట్లు కేటాయించింది. ఈ మేరకు రూ.3కోట్లలో కలెక్టర్ ఇప్పటికే వివిధ విభాగాలకు నిధులు విడుదల చేశారు. కాగా, పోలీసు శాఖకు ఎప్పుడూ లేనివిధంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రూ.2కోట్లు కేటాయించగా, మేడారంలో క్యాంపులఏర్పాటు, ఇతరత్రాపనులు పూర్తయ్యాయి. పాలన యంత్రాంగం మొత్తం.. జాతర విధుల్లో భాగంగా సోమవారం నుంచి జిల్లా పాలన యంత్రాంగం మొత్తం వనంలోనే కొలువు దీరనుంది. దీంతో జిల్లా కేంద్రంతో పాటు ప్రధాన కార్యాలయాలన్నీ ఖాళీ అయినట్లే. మళ్లొచ్చే సోమవారం వరకు ప్రభుత్వ కార్యాలయాల్లో ఒక్క అధికారి, సిబ్బంది కూడా దొరకరు. దీంతో ఈ వారం రోజుల పాటు ఏదైనా అవసరం నిమిత్తం కార్యాల యాలకు రావాలనుకునే వారు పనులు వాయిదా వేసుకోవాల్సిందే. కాగా, జాతర విధులు నిర్వర్తించి న వారికి ప్రత్యేక సెలవులు ఇవ్వనుండడంతో వచ్చే సోమవారం కూడా కార్యాలయాల్లో విధులు నిమిత్తం అధికారులు, సిబ్బంది రావడం కష్టమేనని తెలుస్తోంది. -
రేపటి వరకు ఓటర్ల తుది జాబితా
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : శుక్రవారం నాటికి జిల్లా ఓటర్ల తుది జాబితా ప్రకటించేందుకు సిద్ధమవుతున్నట్టు జిల్లా కలెక్టర్ జి.కిషన్ తెలిపారు. బుధవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ముఖ్య ఎన్నికల కమిషనర్ బన్వర్‌లాల్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 18-19 సంవత్సరాలు గల యువత 67,716 మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారని తెలిపారు. 14,988 మంది బోగస్ ఓటర్లను జాబితా నుంచి తొలగించినట్లు తెలిపారు. జిల్లాలో ఓటర్లందరికీ ఎపిక్ కార్డులు అందజేసినట్లు తెలిపారు. జిల్లాలో 83పోలింగ్ కేంద్రాలకు ఫోన్, ఇంటర్నెట్ సౌకర్యం లేదని, ములుగు నియోజకవర్గంలోని తాడ్వాయిలో తొమ్మిది, ఏటూరునాగారంలో 18, గోవిందరావుపేటలో 14 గ్రామాలు, మహబూబాబాద్ నియోజకవర్గంలో 22గ్రామాలకు ఎటువంటి కమ్యూనికేషన్స్ లేనట్లు తెలిపారు. పోలీసు బందోబస్తుకు ప్రణాళికలు సిద్ధం చేశామని, నోడల్ అధికారులను ఏర్పాటు చేశామని చెప్పారు. మేడారం జాతర దృష్ట్యా ఉప కలెక్టర్లు, తహసీల్దార్లు ఎంపీడీవోల బదిలీలను జాతర అనంతరం చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కలెక్టర్ కోరగా.. ఎన్నికల కమిషనర్ అనుమతించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా నుంచి జాయింట్ కలెక్టర్ పౌసుమిబసు, కమిషనర్ పాండాదాస్, డీఆర్వో సురేందర్‌కరణ్ పాల్గొన్నారు. -
రేపు మేడారంలో మంత్రుల పర్యటన
=రూ. 100 కోట్ల పనులకు ప్రారంభోత్సవాలు =అక్కడే ఏర్పాట్లపై సమీక్ష =జిల్లా కలెక్టర్ కిషన్ కలెక్టరేట్, న్యూస్‌లైన్ : మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో రూ.100 కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనులను శనివారం కేంద్ర, రాష్ట్ర మంత్రులు ప్రారంభిస్తారని జిల్లా కలెక్టర్ జి.కిషన్ తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం జాతర అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర మంత్రి పోరిక బలరాంనాయక్, జిల్లా ఇన్చార్జ్ మంత్రి రాంరెడ్డి వెంకట్‌రెడ్డి, ఐటీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, బీసీ సంక్షేమశాఖ మంత్రి బస్వరాజు సారయ్య, చీఫ్‌విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మేడారంలో పర్యటిస్తారని తెలిపారు. అదేవిధంగా వివిధ శాఖలు చేపడుతున్న అభివృద్ధి పనులను సమీక్షిస్తారని వివరించారు. అనంతరం అమ్మవార్లను దర్శించుకుంటారని కలెక్టర్ అన్నారు. పస్రా నుంచి తాడ్వాయి వరకు సైడ్‌బర్మ్‌ల పనులు జనవరి 31నాటికి పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. గోవిందరావుపేట మండ లం బుస్సాపురం నుంచిలక్నవరం సరస్సు వరకు రోడ్డు నిర్మాణం కోసం నిధులు మంజూరు చేసినట్లు తెలిపా రు. ఈ పనులు వేగంగా పూర్తి చేయాలని ఐటీడీఏ అధికారులకు సూచించారు. ఊరట్టం నుంచి మల్యాల రోడ్డును మరమ్మతు చేయాలని ఆదేశించారు. ప్రధాన కూడళ్లలో హైమాస్ట్ లైట్ల ఏర్పాటు చేయాలన్నారు. ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లి నుంచి దొడ్ల వరకు ఐటీడీఏ ఆధ్వర్యంలో చేపడుతున్న రోడ్డు పనులను పీఆర్‌కు అప్పగించాలని ఆదేశించారు. ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా సైడ్‌బర్మ్‌లు పటిష్టంగా నిర్మించాలని రూరల్ ఎస్సీ లేళ్ల కాళిదాసు సూచించారు. జేసీ పౌసుమిబసు, అర్బన్ ఎస్పీ వెంకటేశ్వర్రావు, ఏజేసీ సంజీవయ్య, ఐటీడీఏ పీఓ సర్ఫరాజ్ అహ్మద్, డీఆర్వో సురేంద్రరణ్, డీఎంహెచ్ఓ సాంబశివరావు, డీఆర్డీఏ పీడీ విజయ్‌గోపాల్, జెడ్పీ సీఈఓ ఆంజనేయులు, డ్వామా పీడీ హైమావతి, ట్రాన్స్‌కో ఎస్ఈ మోహన్‌రావు, ఈఓ రాజేశ్వర్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
సమన్యాయమే లోక్ అదాలత్ లక్ష్యం : కలెక్టర్
వరంగల్ లీగల్, న్యూస్‌లైన్ : సమన్యాయం అందించడమే లోక్ అదాలత్ ముఖ్య లక్ష్యమని కలెక్టర్ జి.కిషన్ అన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో శనివారం ఏర్పాటు చేసిన జాతీయ లోక్‌అదాలత్‌లో కలెక్టర్ కిషన్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. రాజ్యాంగం పౌరులందరికీ న్యాయం పొందే అవకాశం కల్పించిందని అన్నారు. పరస్పర అవగాహనతో కక్షిదారులే న్యాయనిర్ణేతలుగా వ్యవహరించి సత్వర న్యాయం పొందాలని ఆయన సూచించారు. గ్రామాల్లో వ్యవసాయ భూముల హద్దుల గురించి తగాదా పడి కోర్టుల చుట్టూ తిరిగే రైతులు, చిరు వ్యాపారులు లోక్‌అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఘర్షణలకు దిగకుండా ప్రశాంత జీవితాన్ని కొనసాగించాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జిల్లా న్యాయసేవా అధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన జడ్జి ఎం.వెంకటరమణ మాట్లాడుతూ జాతీయ, రాష్ట్ర న్యాయసేవా సంస్థల ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా ఒకేరోజు లోక్ అదాలత్ నిర్వహించడం ప్రయోగాత్మకమైనదని అన్నారు. ఆర్టికల్ 39(ఎ) నిర్దేశించినట్లు ప్రతీ పౌరుడు ఎలాంటి వివక్ష లేకుండా న్యాయసహాయం పొందాలనే లక్ష్యంతో న్యాయసేవా అధికార సంస్థ ఆవిర్భవించిందని అన్నారు. న్యాయ సహాయం అందించే సంస్థలు న్యాయస్థానాలకు అనుబంధం, అనుగుణంగా వ్యవహరిస్తాయని అన్నారు. రెగ్యులర్ కోర్టులో పనిభారం పెరగడం వల్ల జిల్లాలో 39వేల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ కళ్యాణ్‌సేన్‌గుప్త నిర్దేశించిన విధంగా లోక్ అదాలత్‌కు వచ్చిన కక్షిదారులను ఖాళీ చేతులతో కాకుండా న్యాయం అందించి పంపిస్తామని జడ్జి వెంకటరమణ పేర్కొన్నారు. డీఐజీ కాంతారావు మాట్లాడుతూ మన న్యాయవ్యవస్థ ముద్దాయి పక్షం వహిస్తుందని అన్నారు. లోక్ అదాలత్ కక్షిదారులకు, ఫిర్యాదుదారులకు నష్టం కలగకుండా సమన్యాయం అందిస్తుందని, ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పోలీసు వ్యవస్థ ప్రజా ప్రయోజనం కోసం సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. కార్యక్రమంలో జేసీ పౌసుమిబసు, అర్బన్ ఎస్పీ వెంకటేశ్వర్రావు, రూరల్ ఎస్పీ రంగారావు కాళీదాసు, ఎన్పీడీసీఎల్ సీఎండీ కార్తికేయమిశ్రా, మొదటి అదనపు జిల్లా జడ్జి కేబీ.నర్సింహులు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు కె.అంబరీషరావు మాట్లాడారు. జిల్లా న్యాయసేవా అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి డి.సరళాకుమారి వందన సమర్పణ చేశారు. -
25,16,353 ఇదీ.. జిల్లాలోని ఓటర్ల సంఖ్య
=ముసాయిదా జాబితా విడుదల చేసిన కలెక్టర్ =స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో ఎక్కువ ఓటర్లు =చివరి స్థానంలో ములుగు =డిసెంబర్ 10 వరకు అభ్యంతరాల స్వీకరణ కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లాలో తాజా ఓటర్లు 25,16,353 మంది ఉన్నట్లు లెక్కతేలింది. 2013 జనవరి 1 వరకు 18 ఏళ్లు నిండిన వారు గత నెల 25వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా ఆన్లైన్ ద్వారా అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. వాటిని పరిశీలించిన తర్వాత అర్హులకు ఈ జాబితాలో చోటు కల్పించారు. ఈ మేరకు జిల్లా తాజా ఓటర్ల జాబితా ముసాయిదాను కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జి.కిషన్ సోమవారం విడుదల చేశారు.ముసాయిదా జాబితాను బీఎల్ఓల వారీగా అందుబాటులో ఉంచామని చెప్పారు. అభ్యంతరాలుంటే సంబంధిత బీఎల్ఓలకు గానీ, ఆన్లైన్ ద్వారా గానీ డిసెంబర్ 10లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. బీల్ఓలు, గ్రామపంచాయతీ కార్యాలయాలు, పోస్టాఫీసులు, తహసీల్దార్, ఆర్డీఓ కార్యాలయాల్లో దరఖాస్తు ఫారాలు అందుబాటలో ఉన్నాయని వెల్లడించారు. ప్రస్తుతం 2014 జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన యువతకు ఓటు హక్కు కల్పించేందుకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని బీఎల్ఓలను కలెక్టర్ ఆదేశించారు. తాజా లెక్కల ప్రకారం జిల్లాలో పురుషులకన్నామహిళా ఓటర్లు 17,598 మంది తక్కువ ఉన్నారు. డోర్నకల్, నర్సంపేట, పరకాల నియోజకవర్గాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లు ఎక్కువ. ఎక్కువ ఓటర్లున్న నియోజకవర్గం స్టేషన్‌ఘన్‌పూర్, ఆ తర్వాత స్థానంలో భూపాలపలి. తక్కువ ఓటర్లున్న నియోజకవర్గం ములుగు, ఆ తర్వాత స్థానాల్లో తూర్పు, డోర్నకల్. ములుగులో మహిళా ఓటర్ల కంటే పురుషులు కేవలం 197 మంది ఎక్కువగా ఉన్నారు. జిల్లాలో మహిళలు, పురుషులు కాకుండా ఇతరులను ఓటర్ల జాబితాలో చేర్చారు. ఈ కేటగిరిలో జిల్లావ్యాప్తంగా 131మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. వీరిలో అత్యధికంగా 76 మంది వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఓటర్లుగా నమోదై ఉన్నారు. -
పల్లెకు పోదాం
సాక్షి ప్రతినిధి, వరంగల్: ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేసేందుకు జిల్లా యంత్రాంగం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రతి గ్రామపంచాయతీకో ప్రత్యేక అధికారిని నియమిస్తోంది. ‘గ్రామాభ్యుదయ అధికారి’ పేరుతో వీరిని నియమిస్తున్నట్లు కలెక్టర్ జి.కిషన్ తెలిపారు. ఇందులో భాగంగా ఒక్కో గ్రామాన్ని ఒక అధికారికి దత్తత ఇస్తారు. మండలస్థాయి అధికారులకు ఆయూ గ్రామాల బాధ్యతలను అప్పగించనున్నారు. రాష్ట్రావతరణ దినోత్సవం నవంబర్ ఒకటి నుంచి ఈ కార్యక్రమాన్ని చేపట్టేందుకు కసరత్తు మొదలుపెట్టారు. ఈ మేరకు అన్ని విభాగాల జిల్లా అధికారులు, నియోజకవర్గ, మండల స్పెషలాఫీసర్లతో సోమవారం రాత్రి కలెక్టర్ కిషన్ ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ స్వీయ ఆలోచన జిల్లాలో మొత్తం 962 గ్రామాలున్నాయి. పంచాయతీ స్థాయిలో వీఆర్ఓలు, గ్రామ కార్యదర్శులు ఉన్నప్పటికీ సొంత విభాగాల విధులకే వారు పరిమితమవుతున్నారు. దీంతో పల్లెపల్లెనా అమలవుతున్న ప్రభుత్వ పథకాలు... వివిధ విభాగాలు చేపడుతున్న అభివృద్ధి పనులపై కనీస పర్యవేక్షణ కొరవడింది. నివేదికలకు... క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులకు పొంతన కుదరడం లేదని పలుమార్లు జరిగిన జిల్లాస్థాయి సమీక్ష సమావేశాల్లో తేలిపోయింది. వివిధ పథకాల అమలుకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది. కానీ.. జరుగుతున్న పనులపై సంబంధిత శాఖాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో లక్ష్య సాధనలో వెనుకబడిపోతున్నట్లు కలెక్టర్ గుర్తించారు. ఇటీవల రెవెన్యూ డివిజన్ల వారీగా నిర్వహించిన సమీక్ష సమావేశాల్లో వివిధ విభాగాల మధ్య సమన్వయ లోపం కూడా బయటపడింది. ఈ నేపథ్యంలో కలెక్టర్ స్వీయ ఆలోచనతో ప్రత్యేక కార్యక్రమాన్ని తలపెట్టారు. గ్రామస్థా యి నుంచే మార్పు రావాలని.. అక్కడ పనులు, పథకాలు, ప్ర భుత్వ విభాగాల పనితీరు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలుగా ముందడుగు వేసేందుకు సన్నద్ధమవుతున్నారు. గ్రా మస్థాయిలో అన్ని శాఖల పనితీరు, అన్ని పథకాల లక్ష్య సాధనను పరిశీలించే బాధ్యతను ఒకే అధికారికి అప్పగిస్తే... లోపాలనుఅధిగమించే వీలుందని జిల్లా యంత్రాంగం భావిస్తోంది. గ్రామాభ్యుదయ అధికారులు ఏం చేస్తారంటే... ప్రతి శుక్రవారం గ్రామాభ్యుదయ అధికారులు గ్రామాలను సందర్శిస్తారు. కార్యదర్శి, వీఆర్ఓ, ప్రధానోపాధ్యాయుడు, ఏఎన్ఎం, ఆశ వర్కర్, ఈజీఎస్ ఫీల్డ్అసిస్టెంట్లు, ఐకేపీ సీఏలు, హౌసింగ్ వర్క్ఇన్స్పెక్టర్లు, ట్రాన్స్‌కో లైన్మెన్ లేదా హెల్పర్, గోపాలమిత్ర, ఆదర్శ రైతు, అంగన్వాడీ టీచర్, రేషన్ డీలర్, పింఛన్లు పంపిణీ చేసే అధికారి, ఇతర విభాగాల గ్రామస్థాయి ఉద్యోగులతో సమావేశమవుతారు. తాగునీటి సరఫరా, పారిశుధ్యం, ఉపాధి హామీ పథకం, అంగన్ వాడీ కార్యక్రమాలు, అమ్మహస్తం సరుకుల పంపిణీ, ఇందిరమ్మ గృహ నిర్మాణం, మధ్యాహ్న భోజన పథకం. గ్రామ పంచాయతీ నిధులు, వివిధ ఇంజినీరింగ్ విభాగాల ద్వారా చేపట్టిన పనుల పురోగతిపై సమీక్షిస్తారు. పనుల పురోగతి... లక్ష్యసాధన... సమన్వయలోపం... లోటుపాట్లను అధిగమించే చర్యలపై దృష్టి సారిస్తారు. అక్కడ జరిగిన నిర్ణయాలు, సమావేశం వివరాలను ఆన్లైన్లో పొందుపరుస్తారు. ప్రతి గ్రామానికో మెయిల్ ఐడీ కేటాయించి ఈ సమాచారం ఎప్పటికప్పుడు జిల్లా కేంద్రానికి చేరేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా ప్రతి శనివారం గ్రామాభ్యుదయ అధికారులందరూ మండల కేంద్రంలో సమావేశమవుతారు. గ్రామ స్థాయిలో సమస్యలను పరిష్కరించేందుకు ఆయా శాఖలకు చెందిన మండల స్థాయి అధికారులతో చర్చిస్తారు. తహసీల్దార్, ఎంపీడీతోపాటు ఎంఈఓ, ఏఓ, ఏఈలు, మండల ప్రత్యేక అధికారులు ఈ కమిటీలో ఉంటారు. ఒకవేళ అక్కడ కూడా పరిష్కారానికి నోచుకోని సమస్యలుంటే.. వాటిని జిల్లా స్థాయి అధికారుల దృష్టికి తీసుకొస్తారు. నెలకోసారి కలెక్టర్ స్థాయిలో ఈ సమావేశం జరుగుతుంది. జిల్లా అధికారులు క్షేత్ర పర్యటనలకు వెళ్లినప్పుడు మార్గమధ్యలో గ్రామాభ్యుదయ అధికారులు నిర్వహించే సమావేశాలకు హాజరు కావాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ విధానంతో సింగిల్ విండో సిస్టమ్ ఏర్పడుతుందని.. ప్రభుత్వ పథకాల పురోగతి మెరుగుపడుతుందని జిల్లా అధికారులు భావిస్తున్నారు. -
పనులు త్వరగా పూర్తి చేయాలి
జిల్లా పరిషత్, న్యూస్‌లైన్ : వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా చేపట్టిన పలు అభివృద్ధి పనులను వచ్చే నెలాఖరులోగా పూర్తి చేయాలని కలెక్టర్ జి.కిషన్ అదేశించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో బుధవా రం వరంగల్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని 11 మండలాల్లోని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు, పురోగతిని ఎంపీడీఓలు, తహసీల్దా ర్లు, ఇతర శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ ఇందిరమ్మ పథకంలో లబ్ధిదారులకు గృహా లు మంజూరైనప్పటికీ ఇప్పటి వరకు పొజిషన్ సర్టిఫికెట్లు ఎందుకు ఇవ్వలేదని రెవెన్యూ అధికారులను ప్రశ్నించారు. దీనికి వారు ఇచ్చిన స మాధానాలు సరిగా లేక పోవడంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. మండల స్థాయిలోని అధికారులు స్థానికంగా ఉండి సమన్వయంతో పని చేస్తే ప్రభుత్వ పథకాలను విజయవంతం చేయవచ్చన్నారు. పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి నిధులు మంజూరైనప్పటికీ పనులు ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారని ఇంజినీరింగ్ అధికారులను ప్రశ్నించారు. హన్మకొండ ఎంపీడీఓ ఎంపీ నిధుల ద్వారా చేపట్టిన పను లు 64 అని చెప్పడం, కలెక్టర్ వద్ద ఉన్న నివేదికలో తొమ్మిది ఉండడంతో డీఆర్డీఏ పీడీని ఎందుకు తేడాలు వచ్చాయని ప్రశ్నించారు. ని వేదికలు సరిగా ఎందుకు అందించలేక పోయారని అధికారులను ప్రశ్నించారు. బీఆర్జీఎఫ్ పథకంలో నిధులు మంజూరైనప్పటికీ ఎందుకు పురోగతి ఉండడం లేదని ఇంజినీరింగ్ అధికారులను, ఎంపీడీఓలను ప్రశ్నించారు. వివిధ మండలాల్లో జీపీ సెక్టార్ జెడ్పీ సెక్టార్లో 15 పనులు ఇంకా ప్రారంభం కాకపోవడం, కొన్ని రెండేళ్లుగా పురోగతిలోనే ఉండడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు చేపట్టేందుకు అవంతరాలు ఉంటే వాటిని రద్దు చేసి జెడ్పీ అ ధికారులకు సమాచారం అందించాలన్నారు. డీ పీసీ ఆమోదం పొందిన పనులు మాత్రమే చేపట్టాలని, ఇతర పనులు చేపడితే వాటికి సంబంధిత అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుం దన్నరు. బీఆర్జీఎఫ్ 2011-12 ఆర్థిక సంవత్స రం పనులన్నీ వచ్చే నెలాఖరులోగా పూర్తి చే యాలని ఆదేశించారు. రాజీవ్ విద్యామిషన్ పథకంలో 153 తరగతి గదుల నిర్మాణం కోసం నిధులు మంజూరు కాగా, వీటిలో ఇంకా 37 పనులు ఎందుకు ప్రారంభం కాలేదని ఆర్వీఎం ఈఈ రవీందర్రావును ప్రశ్నించారు. అక్కడ స్థలాలు లేక పోవడం వల్ల పనులు చేపట్టలేక పోయమన్నారు. మండలాల్లోని ప్రభుత్వ స్థలాలను గుర్తించి హద్దులు పెట్టాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ పౌసమిబసు, ఏజేసీ సంజీవయ్య, జెడ్పీ సీఈఓ ఆంజనేయులు, డీఆర్డీఏ, హౌసింగ్ పీడీలు విజయగోపాల్, లక్ష్మణ్, సీపీఓ రాంచందర్‌రావు, పీఆర్ ఎస్ఈ సత్త య్య, డీపీఓ ఈఎస్.నాయక్, ఆర్డబ్ల్యూఎస్, పీఆర్ ఈ ఈలు శ్రీనివాసరావు, సత్యనారాయణ, శ్రీనివాస్‌రావు, డీసీఓ సంజీవయ్య, డిప్యూటీ సీఈఓ రమాదేవి, జెడ్పీ సూపరింటెండెంట్లు వెంకటస్వామి, శ్రీనివాస్‌రెడ్డి, పులి వెంకటేశ్వర్లు, వెంకటరమణ పాల్గొన్నారు.