వారం రోజులు రాష్ట్ర అవతరణ పండుగ
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆవతరణ వేడుకలు జూన్ 2వ తేదీ నుంచి వారంపాటు అధికారికంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ జి.కిషన్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అవతరణ దినత్సోవం సందర్భంగా జూన్ 2న ఉదయం 8.45 నిమిషాలకు హెడ్‌క్వార్టర్స్‌లో జాతీయ పతాకం ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు. జిల్లాలోని చారిత్రక భవనాలు, ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించాలని సూచించారు.
స్వాతంత్య్ర సమర యోధులకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయాలన్నారు. వారంపాటు జిల్లా అంతటా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని ఆదేశించారు. అంతేగాక 2వ తేదీ నుంచి నుంచి 8 వరకు ప్రతిరోజు సాయంత్రం నేరెళ్ల వేణుమాధవ్ ఆడిటోరియంలో వివిధ కళా బృందాలతో ప్రత్యేకంగా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. నిర్వహణ బాధ్యతలను డీఈఓ విజయ్‌కుమార్, సమాచార శాఖ డీడీ బాలగంగాధర తిలక్, రాష్ట్ర సమాచార కేంద్ర ఏడీ డీఎస్.జగన్, టూరిజం అధికారి శివాజీ, సెట్వార్ సీఈఓ పురుషోత్తం, వరంగల్ ఆర్డీఓ మధుతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.
క్రీడాపోటీలు నిర్వహించాలని డీఎస్‌డీఓఓను ఆదేశించారు. ఈ వేడుకల సందర్భంగా పాఠశాల, హాస్టళ్లలో ప్రతిభ కనబరినచిన విద్యార్థులకు గుర్తించి బహుమతులు అందజేయాలని సూచించారు. వేడుకల సందర్భంగా మండల, డివిజన్ స్థాయిల్లో కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో జేసీ పౌసుమి బసు, ఏజేసీ కృష్ణారెడ్డి, ఎస్పీ వెంకటేశ్వర్‌రావు, డీఆర్వో సురేందర్‌కరణ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.