=ముసాయిదా జాబితా విడుదల చేసిన కలెక్టర్
=స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో ఎక్కువ ఓటర్లు
=చివరి స్థానంలో ములుగు
=డిసెంబర్ 10 వరకు అభ్యంతరాల స్వీకరణ
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లాలో తాజా ఓటర్లు 25,16,353 మంది ఉన్నట్లు లెక్కతేలింది. 2013 జనవరి 1 వరకు 18 ఏళ్లు నిండిన వారు గత నెల 25వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా ఆన్‌లైన్ ద్వారా అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. వాటిని పరిశీలించిన తర్వాత అర్హులకు ఈ జాబితాలో చోటు కల్పించారు. ఈ మేరకు జిల్లా తాజా ఓటర్ల జాబితా ముసాయిదాను కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జి.కిషన్ సోమవారం విడుదల చేశారు.ముసాయిదా జాబితాను బీఎల్‌ఓల వారీగా అందుబాటులో ఉంచామని చెప్పారు.
అభ్యంతరాలుంటే సంబంధిత బీఎల్‌ఓలకు గానీ, ఆన్‌లైన్ ద్వారా గానీ డిసెంబర్ 10లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. బీల్‌ఓలు, గ్రామపంచాయతీ కార్యాలయాలు, పోస్టాఫీసులు, తహసీల్దార్, ఆర్డీఓ కార్యాలయాల్లో దరఖాస్తు ఫారాలు అందుబాటలో ఉన్నాయని వెల్లడించారు. ప్రస్తుతం 2014 జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన యువతకు ఓటు హక్కు కల్పించేందుకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని బీఎల్‌ఓలను కలెక్టర్ ఆదేశించారు.
తాజా లెక్కల ప్రకారం
జిల్లాలో పురుషులకన్నామహిళా ఓటర్లు 17,598 మంది తక్కువ ఉన్నారు.
డోర్నకల్, నర్సంపేట, పరకాల నియోజకవర్గాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లు ఎక్కువ.
ఎక్కువ ఓటర్లున్న నియోజకవర్గం స్టేషన్‌ఘన్‌పూర్, ఆ తర్వాత స్థానంలో భూపాలపలి.
తక్కువ ఓటర్లున్న నియోజకవర్గం ములుగు, ఆ తర్వాత స్థానాల్లో తూర్పు, డోర్నకల్.
ములుగులో మహిళా ఓటర్ల కంటే పురుషులు కేవలం 197 మంది ఎక్కువగా ఉన్నారు.
జిల్లాలో మహిళలు, పురుషులు కాకుండా ఇతరులను ఓటర్ల జాబితాలో చేర్చారు. ఈ కేటగిరిలో జిల్లావ్యాప్తంగా 131మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. వీరిలో అత్యధికంగా 76 మంది వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఓటర్లుగా నమోదై ఉన్నారు.