రామాయంపేట, న్యూస్‌లైన్: అటవీ సంరక్షణ కోసం రేంజ్ అధికారులకు త్వరలో తుపాకులు పంపిణీ చేస్తున్నట్టు సామాజిక అడవుల నిజామాబాద్, మెదక్ జిల్లాల అడిషనల్ చీఫ్ కన్జర్వేటర్ బాబూరావు తెలిపారు. శుక్రవారం ఆయన రామాయంపేటకు వచ్చిన సందర్భంగా స్థానిక విలేకరులతో మాట్లాడారు. ప్రతి రేంజ్ కార్యాలయానికి ఆరు తుపాకుల చొప్పున ఇస్తున్నట్టు చెప్పారు. మెదక్ డివిజన్‌లో 22 శాతం భూమి కబ్జాలకు గురైందన్నారు. అడవుల రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. అటవీ భూములను ఆక్రమించిన వారెందరు? ఎన్ని ఎకరాలు ఆక్రమించారనే విషయంపై నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే భూ భారతి కార్యక్రమాన్ని చేపట్టామని, అక్రమాలకు చెక్ పెడతామన్నారు. అటవీ భూములను ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు అక్రమంగా అడవులను నరికి సాగు చేస్తున్న 15 మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. మెదక్- రామాయంపేట ఆర్‌అండ్‌బీ రోడ్డు నిర్మాణానికి అడవిలోంచి రోడ్డు వేయడం అనుమతి లేదన్నారు. ఇందుకోసం ప్రతిపాదనలు ఢిల్లీకి పంపించామన్నారు. అలాగే వన్య ప్రాణులను వేటాడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
క్వార్టర్ నిర్మాణం కోసం భూమి పూజ
రామాయంపేట అటవీ శాఖ రేంజ్ ఆఫీసర్ క్వార్టర్ నిర్మాణం కోసం శుక్రవారం బాబురావు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ క్వార్టర్ నిర్మాణం కోసం ప్రభుత్వం 19 లక్షల రూపాయలు యంజూరు చేసిందన్నారు. త్వరలోనే భవన నిర్మాణ పనులు చేపట్టనున్నట్టు తెలిపారు. అడిషనల్ చీఫ్ కన్జర్వేటర్ బాబూరావు, మెదక్ డీఎఫ్‌ఓ హరికుమార్, సబ్ డీఎఫ్‌ఓ సత్య నారాయణలను రామాయంపేట రేంజ్ ఆఫీసర్ మురళీధర్ పూల మాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో రామాయంపేట అటవీ శాఖ డిప్యూటీ రేంజ్ ఆపీసర్ విద్యా సాగర్, రేంజ్ పరిధిలోని సెక్షన్, బీట్ ఆపీసర్లు, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం రేంజ్ ఆఫీసర్ మురళీధర్ మాట్లాడుతూ రామాయంపేట రేంజ్ పరిధిలో 18 బీట్లు ఉన్నాయని తెలిపారు. ఏడుగురు బీట్ ఆపీసర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. మెదక్ మండలం పాతూర్ సెక్షన్‌లో బీట్ ఆఫీసర్ లేరని తెలిపారు. రామాయంపేట రేంజ్ కార్యాలయానికి వాహనాన్ని మంజూరు చేయాలన్నారు. ఖాళీగా ఉన్న బీట్లలో అధికారులను నియమించాలని ఆయన కోరారు.
అటవీ అధికారులకు త్వరలో తుపాకులు
Published Sat, Nov 23 2013 3:37 AM | Last Updated on Thu, Oct 4 2018 6:03 PM
Advertisement
Advertisement