కరువు సీమపై ..పచ్చని సంతకం  | Form For Development YSR Is An Indelible Signature On Welfare | Sakshi
Sakshi News home page

కరువు సీమపై ..పచ్చని సంతకం 

Published Mon, Jul 8 2019 6:26 AM | Last Updated on Mon, Jul 8 2019 6:27 AM

Form For Development YSR Is An Indelible Signature On Welfare - Sakshi

అభివృద్ధికి రూపం.. సంక్షేమంపై చెరగని సంతకం.. జలయజ్ఞంతో సిరులు కురించిన నేత... ‘అనంత’ గుండె గుడిలో కొలువైన మహానేత... ఆయనే వైఎస్సార్‌. కరువు సీమలో పచ్చని పొలాలు.. విద్యాలయాలు.. అడుగడుగునా అభివృద్ధి.. ప్రజల మదిలో చెరగని ముద్ర రాజన్న. అందుకే జిల్లా అభివృద్ధిని విశ్లేషించాల్సి వస్తే వైఎస్సార్‌కు ముందు, ఆ తర్వాత అని చెప్పాల్సిన పరిస్థితి. సొంత జిల్లా కడపను మించి ఇక్కడి ప్రజలపై ఆదరాభిమానాలు చూపిన అపర భగీరథుడు. బీళ్లు మురిసేలా.. దాహం తీరేలా అభివృద్ధి ఫలాలను అందించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి 70వ జయంతిని పురస్కరించుకుని ‘సాక్షి’ ప్రత్యేక కథనం.      – సాక్షి ప్రతినిధి, అనంతపురం 

• హంద్రీ–నీవా సుజల స్రవంతి పేరుతో 2004లో రూ. 6,850 కోట్లతో పథకాన్ని చేపట్టారు. తొలిదశ కింద 1.98 లక్షలు.. రెండో దశ కింద రూ.4.04 లక్షలు  కలిపి మొత్తం 6.02 లక్షల ఎకరాలకు సాగునీళ్లిచ్చేలా వైఎస్సార్‌ ప్రణాళిక సిద్ధం చేశారు. 
• హంద్రీనీవా కోసం వైఎస్సార్‌ హయాంలోనే రూ.4,054 కోట్లను ఖర్చుచేశారు. అందువల్లే 2012లోనే కృష్ణాజలాలు జీడిపల్లి రిజర్వాయర్‌కు చేరాయి.  
• ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను ఆదుకునేందుకు వైఎస్సార్‌ 421 జీఓ జారీ చేశారు. ఈ జీఓ మేరకు చనిపోయిన రైతు కుటుంబాలకు రూ.1.50 లక్షల మేర అప్పట్లో పరిహారం ఇచ్చారు. 
• వేరుశనగ రైతులను ఆదుకునేందుకు 2008లో గ్రామం యూనిట్‌గా పంటల బీమా పథకాన్ని వర్తింపజేశారు.  
• మడకశిరను విద్యాకేంద్రంగా మార్చారు. వ్యవసాయ, వ్యవసాయ ఇంజనీరింగ్, హార్టికల్చర్, వెటర్నరీ పాలిటెక్నిక్‌ కళాశాలలను ఏర్పాటు చేశారు. రిజర్వేషన్లు లేక అభివృద్ధికి నోచుకోని వక్కలిగ, సాదర, వీరశైవ కులాల వారిని బీసీలుగా గుర్తించి ఆదుకున్నారు. 
• తాడిపత్రి నియోజకవర్గంలోని సాగునీటి సమస్యలు తీర్చేందుకు రూ.536 కోట్లతో చాగల్లు, పెండేకల్లు, యాడికి కాలువను నిర్మించాలని నిర్ణయించారు. వీటి ద్వారా 50 వేల ఎకరాల ఆయకట్టుకు నీటిని అందించాలన్న లక్ష్యంతో పనులకు శ్రీకారం చుట్టారు.   
• హిందూపురం తాగునీటి సమస్య తీర్చేందుకు రూ.650 కోట్ల వ్యయంతో శ్రీరామరెడ్డి తాగునీటి పథకాన్ని చేపట్టారు. 14 వందల కి.మీ పైపులైన్లు వేయించి 2008 డిసెంబర్‌ 30న ప్రారంభించి ‘పురం’ దాహార్తి తీర్చారు.  

అనంతపురం జిల్లా కరువుకు చిరునామా. ఏడు దశాబ్దాల స్వాతంత్య్ర భారతావనిలో పాలకులు వస్తున్నారు.. పోతున్నారు కానీ ఇక్కడి ప్రజలు, దారిద్య్ర పరిస్థితులపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి పరిష్కారానికి ఉపక్రమించిన నేతలు మాత్రం అరుదు. ఎక్కడైనా రైతు ఆత్మహత్య చేసుకుంటే అయ్యో అంటాం.. కానీ ఇక్కడ సర్వసాధారణం. ఈ క్రమంలోనే జిల్లా సమస్యలపై  వైఎస్సార్‌ ప్రత్యేకంగా అధ్యయనం చేశారు. రైతుల కష్టాలు, వ్యవసాయ దీనావస్థకు చలించిపోయారు

నా జీవితం రాజన్న తాత చలువే.. 
నాకిప్పుడు పదమూడేళ్లు. రాజన్న తాత పేరు ఎక్కడ వినిపించినా మా నాన్న చెప్పే మాటలు వింటుంటే నా జీవితం ఆయన చలువేనన్న విషయం గుర్తుకొస్తుంది. నాకప్పుడు నాలుగు నెలల వయసంట. మెదడు సంబంధ వ్యాధితో ప్రాణాపాయ స్థితిలో ఉండగా చికిత్స చేయించేందుకు అమ్మానాన్న ఎక్కడెక్కడో చూపించారంట. ఆరోగ్య కుదుటపడకపోగా వయస్సు కూడా పెరుగుతుండటంతో ఎంతో బాధ పడ్డారంట. మాటలు కూడా రాకపోవడంతో ఎన్నో నిద్రలేని రాత్రిళ్లు గడిపారంట. అప్పట్లో రాజన్న తాత ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం ద్వారా నాకు మూడుసార్లు ఆపరేషన్‌ చేశారంట. ఇప్పుడు నా ఆరోగ్యం బాగుంది. అందరిలా బడికి పోతున్నా. రాజన్న తాతకు జీవితాంతం రుణపడి ఉంటాం.                – అభిషేక్, పెడపల్లి, పుట్టపర్తి మండలం  

పండుగలా వ్యవ‘సాయం’ 
2004లో వైఎస్సార్‌ అధికారం చేపట్టిన తర్వాత వ్యవసాయ, అనుబంధ రంగాలకు పెద్ద పీట వేశారు. ప్రమాణాస్వీకారం చేసిన మరుక్షణమే విద్యుత్‌ బిల్లులు మాఫీ చేసి ఉచిత విద్యుత్‌ సరఫరాకు సంతకం చేయడంతోనే రైతులకు భరోసా లభించింది. జిల్లా రైతులకు సంబంధించిన బకాయిలు రూ.70.65 కోట్లు మాఫీ కావడంతో రైతులు ఊపిరిపీల్చుకున్నారు. అప్పట్లో ఉన్న 1.75 లక్షల వ్యవసాయ మోటార్లకు ఉచితంగా కరెంటు ఇచ్చారు.

ఆయన ఐదేళ్ల హయాంలో రూ.150 కోట్లు విలువైన  ఉచిత కరెంటు రైతులకు అందజేసి వ్యవసాయానికి జీవం పోశారు. వైఎస్‌ అధికారంలో ఉన్న ఆరేళ్లలో పంట రుణాల కింద 27.37 లక్షల మంది రైతులకు రూ.6,594 కోట్లు అందజేశారు. ఏటా పంట రుణాలు పెంచుతూ, అందులోనూ కొత్త రైతులకు ప్రాధాన్యత ఇవ్వడంతో వ్యవసాయం పండుగలా సాగింది. సకాలంలో పంట రుణాలు చెల్లించిన రైతులకు పావలా వడ్డీ కింద ఐదేళ్లలో 12 లక్షల అకౌంట్లకు రూ.44 కోట్లు అందజేశారు.  
– అనంతపురం అగ్రికల్చర్‌ 

బీమాతో ధీమా 
చంద్రబాబు హయాంలో మండలం యూనిట్‌గా అమలవుతున్న పంటల బీమా పధకాన్ని రైతులకు ఉపయోగపడేలా గ్రామం యూనిట్‌గా మార్పు చేసి అమలు చేశారు. 2004–2009 మధ్య కాలంలో దెబ్బతిన్న వేరుశనగ పంటకు సంబంధించి పంటల బీమా కింద ఏకంగా రూ.1,138 కోట్లు పరిహారం ఇచ్చారు. 2008లో తీవ్ర వర్షాభావంతో 80 శాతం మేర పంటలు దెబ్బతిన్నాయి. అప్పట్లో జిల్లా వ్యాప్తంగా 4.64 లక్షల మంది రైతులు తమ వాటా కింద రూ.32 కోట్లు ప్రీమియం కట్టారు. గ్రామం యూనిట్‌గా బీమా పథకం కింద 4.59 లక్షల మంది రైతులకు ఏకంగా రూ.620 కోట్లు పరిహారం విడుదల చేసి పంటలు పండకున్నా ప్రభుత్వం ఉందనే భరోసా కల్పించారు.

2008లో నెలకొన్న తీవ్ర కరువు దృష్ట్యా ప్రకటించిన రుణమాఫీ పథకంలో భాగంగా బ్యాంకులో ఉన్న 3,03,937 మంది రైతులకు సంబంధించి రూ.554.92 కోట్లు రుణాలు ఒకేవిడతలో మాఫీ అయ్యాయి. అప్పటికే బ్యాంకులకు రుణాలు చెల్లించిన రైతులకు ప్రోత్సాహకాల కింద 3,61,269 మంది రైతులకు రూ.5 వేల చొప్పున రూ.174.04 కోట్లు అందజేశారు. 2004 నుంచి 2009 వరకు 28,05,901 మంది రైతులకు 26,02,717 క్వింటాళ్లు విత్తనకాయ పంపిణీ చేశారు. దీని కోసం ఏకంగా రూ.280.88 కోట్లు సబ్సిడీ వర్తింపజేశారు. కంది, ఆముదం లాంటి ఇతర విత్తనాల కోసం రూ.80 కోట్లు ఖర్చు చేశారు. మొత్తంగా రూ.360 కోట్లు విత్తన రాయితీ కల్పించాడు. పండిన వరి, వేరుశనగ, ఇతర పంటలకు కనీస మద్ధతు ధర (ఎంఎస్‌పీ) కల్పించడంతో రైతులకు గిట్టుబాటు ధరలు లభించాయి.           – అనంతపురం అగ్రికల్చర్‌ 

కరువు సీమలో ‘పాడి’ సిరులు  
కరువు సీమ ‘అనంత’లో క్షీరవిప్లవం సృష్టించిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికే దక్కుతుంది. 2004లో అధికారంలోకి వచ్చిన  వైఎస్‌...  పాడి పరిశ్రమకు చేయూతనిచ్చారు. 2006లో ప్రజాకర్షకమైన పశుక్రాంతి, జీవక్రాంతి లాంటి పథకాలకు రూపకల్పన చేశారు. పాల వెల్లువతోనే పేద వర్గాల జీవణప్రమాణాలు మెరుగుపడతాయని భావించి 50 శాతం రాయితీ వర్తింపజేసి గుజరాత్, హరియానా, తమిళనాడు, కర్నాటక తదితర రాష్ట్రాలకు మేలుజాతి సంకరజాతి, ముర్రా జాతి పాడి ఆవులు, గేదెల పంపిణీకి శ్రీకారం చుట్టారు. 2007, 2008, 2009... కేవలం మూడు సంవత్సరాల్లోనే 50 శాతం రాయితీతో రూ.22 కోట్లు బడ్జెట్‌ కేటాయించి 7,200 పాడి పశువులు, గేదెలు రైతులు, పేద వర్గాలకు అందజేశారు. ఈ క్రమంలో 2007–10 మధ్య కాలంలో ఏపీ డెయి రీ రోజుకు 60 వేల లీటర్ల పాలు సేక రించి లాభా ల బాట పట్టింది.                                 
– అనంతపురం, అగ్రికల్చర్‌  

‘108’తో పునర్జన్మ
శరణార్థుల పాలిట సంజీవినిగా డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ప్రవేశపెట్టిన ‘108’ మారింది. 2005 ఆగస్టు 15న ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో 108 వాహనాలను ప్రవేశపెట్టారు. జిల్లాలో మొదటిదశగా అనంతపురం, గుంతకల్లు, హిందూపురం, ధర్మవరం, కదిరి ప్రాంతాల్లో ప్రారంభించారు. మొత్తంగా  37 వాహనాలను ఏర్పాటు చేశారు. ప్రమాదాలు, గుండెజబ్బులు,  ప్రసవాలు ఇలా ఏ సమస్య వచ్చిన 108కు ఫోన్‌ చేస్తే చాలు వెంటనే సిబ్బంది అక్కడకు చేరుకుని ఆపదలో ఉన్న వారిని ఆస్పత్రికి చేరుస్తూ వచ్చారు. ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం మొదటి ఏడాది మినహా ప్రతి నెలా 5వేల మంది రోగులను ఆస్పత్రికి చేర్చారు. 2006 నుంచి ఈ ఏడాది వరకు 8,23,549 మందిని ఆస్పత్రులకు చేర్చి ప్రాణాలు కాపాడారు. 2007 ఏప్రిల్‌లో ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి, వెయ్యి రకాల జబ్బులకు ఉచిత వైద్యం అందించారు.                          
– అనంతపురం  

సాంకేతిక విద్యా ప్రదాత 
కరువు సీమలో కల్పతరువుగా జేఎన్‌టీయూ(ఎ)ను డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి తీర్చిదిద్దారు. 2008 ఆగస్టు 18న జేఎన్‌టీయూ(ఎ)కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ వర్సిటీగా మార్పు చేశారు. అనంతపురం లాంటి వెనుకబడిన జిల్లాలో సాంకేతిక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని భావించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఈ వర్సిటీ పరిధిలో 98 ఇంజినీరింగ్‌ కళాశాలలు, 33 ఫార్మసీ కళాశాలలు ఉన్నాయి. ఏటా ఒక లక్ష మంది విద్యార్థులు సాంకేతిక విద్యను అభ్యసిస్తున్నారు. అలాగే 2007–08 విద్యాసంవత్సరంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని ప్రవేశపెట్టారు.

మొదటి ఏడాది రూ.2వేల కోట్లు కేటాయించి బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, బీఫార్మసీ, ఎంఫార్మసీ, డిగ్రీ, పీజీ, బీఈడీ, ఎంఈడీ, ఎంఫిల్‌ , ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్సీ అగ్రికల్చర్, వంటి కోర్సులను నిరుపేద విద్యార్థులకు చేరువ చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకంతో లబ్ధి పొందిన అనేక మంది నేడు ఉన్నత స్థానాల్లో స్ధిరపడ్డారు. జాతీయ స్థాయిలో ఈ పథకం అమలు తీరుతెన్నులపై చర్చ జరిగి, అనేక రాష్ట్రాలు ఈ పథకాన్ని స్ఫూర్తిదాయకంగా అనుసరిస్తున్నాయి.           – జేఎన్‌టీయూ  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement