
మస్తాన్‌బాబు మళ్లీ పుడతాడు
కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు నివాళి
ప్రభుత్వ లాంఛనాలతో మస్తాన్‌బాబు అంత్యక్రియలు పూర్తి
సంగం: పర్వతారోహణతో దేశకీర్తిని విశ్వవ్యాప్తం చేసిన మల్లి మస్తాన్‌బాబు మళ్లీ పుడతాడని కేంద్రమంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం మండలంలోని గాంధీ జనసంఘంలో శనివారం జరిగిన మస్తాన్‌బాబు అంత్యక్రియల్లో ఆయన పాల్గొన్నారు. తొలుత స్వగృహం వద్ద మస్తాన్‌బాబుకు పార్థివదేహానికి శ్రద్ధాంజలి ఘటించి మస్తాన్‌బాబు తల్లి సుబ్బమ్మను ఓదార్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మస్తాన్‌బాబు గొప్ప దేశభక్తికలవాడని కొనియాడారు.
పార్లమెంటు, అసెంబ్లీలో నివాళులర్పించాలి: ఎంపీ మేకపాటి
పార్లమెంటు, శాసనసభల్లో మస్తాన్‌బాబుకు నివాళులర్పించాలని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. మస్తాన్‌బాబు అంత్యక్రియల్లో పాల్గొని, ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భరతమాత ముద్దుబిడ్డ మస్తాన్‌బాబు అని కొనియాడారు.
అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు
తొలుత మస్తాన్‌బాబు మృతదేహానికి నెల్లూరు కలెక్టర్ జానకి, ఎస్పీ గజరావు భూపాల్ నివాళులర్పిం చారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, ఎంపీ మేకపాటి, రాష్ట్ర మంత్రులు నారాయణ, కిశోర్‌బాబు, పల్లె రఘునాథరెడ్డి, కామినేని శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు మేకపాటి గౌతంరెడ్డి, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, పోలుబోయిన అనిల్‌కుమార్ యాదవ్, కిలివేటి సంజీవయ్య పుష్పాంజలి ఘటించారు. తర్వాత ప్రత్యేక వాహనంలో మస్తాన్‌బాబు మృతదేహాన్ని ఆయన సొంతపొలంలోని ఖనన ప్రాంతానికి చేర్చారు. చివరిచూపు అనంతరం పోలీసుల సాయుధ వందనం తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు కుటుంబసభ్యులు, ప్రజల అశ్రునయనాల మధ్య మస్తాన్‌బాబు పార్థివదేహాన్ని ఖననం చేశారు.
పాఠ్యాంశంగా మస్తాన్‌బాబు జీవితం: రావెల
హైదరాబాద్: ప్రముఖ పర్వతారోహకుడు, గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ విజేత మల్లి మస్తాన్‌బాబు జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చుతామని రాష్ట్ర గిరిజన, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్‌బాబు తెలిపారు. సచివాలయంలో శనివారం మస్తాన్‌బాబుకు మంత్రి శ్రద్ధాంజలి ఘటించారు.