
వైఎస్సార్‌సీపీలో చేరుతున్నట్లు ప్రకటన
గొల్లప్రోలు (పిఠాపురం): పట్టణా నికి చెందిన పిఠాపురం మార్కెట్ కమిటీ చైర్మన్ మొగలి వీరవెంకట సత్యనారాయణ (బాబ్జీ) టీడీపీకు శనివారం రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని జిల్లా, రాష్ట్ర పార్టీ కార్యాలయాలకు పంపినట్లు ఆయన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. తన రాజకీయ గురువు దివంగత మాదేపల్లి రంగబాబు ఆకస్మిక మరణంతో స్థానికంగా టీడీపీలో చోటుచేసుకున్న పరిణామాలు చాలా బాధ కలిగించాయన్నారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ విజయంతోపాటు నగర పంచాయతీ ఎన్నికల్లో కౌన్సిలర్లు గెలుపునకు ఎనలేని కృషి చేశానన్నారు.
పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరించిన తనకు పార్టీ ప్రజా ప్రతినిధులు వ్యవహారశైలి మనస్థాపానికి గురిచేసిందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసేందుకు నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఇప్పటికే కాకినాడ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు కురసాల కన్నబాబు, పిఠాపురం నియోజకవర్గ కో ఆర్డినేటర్ పెండెం దొరబాబు సూచన మేరకు రెండు రోజుల్లో తనతోపాటు తన అనుచరులు, అభిమానులు జగన్ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరుతున్నానన్నారు.
Comments
Please login to add a commentAdd a comment