మాజీ స్పీకర్‌ కోడెల ఆత్మహత్య | Former AP speaker Kodela Siva Prasad Rao commits suicide | Sakshi
Sakshi News home page

మాజీ స్పీకర్‌ కోడెల ఆత్మహత్య

Published Tue, Sep 17 2019 4:25 AM | Last Updated on Tue, Sep 17 2019 8:37 AM

Former AP speaker Kodela Siva Prasad Rao commits suicide - Sakshi

హైదరాబాద్‌లోని కేన్సర్‌ ఆస్పత్రిలో కోడెల మృతదేహం

సాక్షి, హైదరాబాద్‌: టీడీపీ సీనియర్‌ నేత, మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు(72) సోమవారం హైదరాబాద్‌లో అనుమానాస్పదరీతిలో మృతి చెందారు. బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.7లో తాను అద్దెకు ఉంటున్న ఇంట్లోనే కోడెల శవమై కనిపించారు. ఆయన ఒత్తిడి వల్ల ఆత్మహత్య చేసుకున్నారని కుటుంబ సభ్యులు చెబుతుండగా హైదరాబాద్‌ పోలీసులు మాత్రం దీనిని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. బంజారాహిల్స్‌ ఏసీపీ కేఎస్‌ రావ్‌ నేతృత్వంలోని బృందాలు ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ ప్రకటించారు.  

అలసటగా ఉందంటూ గడియ పెట్టుకుని..
జూబ్లీహిల్స్‌లోని ఓ మాజీ ఐఏఎస్‌ అధికారి ఇంట్లో అద్దెకు ఉండే కోడెల శివప్రసాదరావు కొన్నాళ్ల క్రితమే రోడ్‌ నెం.7లోని నివాసానికి మారారు. ఇరాన్‌ కాన్సులేట్‌ సమీపంలోని మాజీ మంత్రి దేవేందర్‌గౌడ్‌ ఇంటి పక్కన ఆయన బంధువుకు చెందిన డూప్లెక్స్‌ ఇంట్లో ఉంటున్నారు. కొద్దిరోజుల క్రితం గుండెపోటుకు గురైన శివప్రసాదరావు వైద్యుల సలహా మేరకు విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇటీవలే బంజారాహిల్స్‌లోని అద్దె ఇంటికి మారారు. సోమవారం ఉదయం నిద్ర లేచిన అనంతరం దైనందిన కార్యక్రమాలు పూర్తి చేసుకున్నారు. ఉదయం 10 గంటల సమయంలో భార్య శశికళ, కుమార్తె విజయలక్ష్మితో కలసి అల్పాహారం తీసుకున్నారు. అనంతరం అలసటగా ఉందంటూ మొదటి అంతస్తులో ఉన్న పడక గదిలోకి వెళ్లి లోపల నుంచి తలుపు గడియ పెట్టుకున్నారు. 

108 సిబ్బంది వివరాలు కోరటంతో ఫోన్‌ కట్‌ చేసి...
తన తల్లిని ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు సిద్ధమైన విజయలక్ష్మి ఆ విషయం చెప్పేందుకు మొదటి అంతస్తులోని కోడెల గది వద్దకు ఉదయం 10.20 గంటల సమయంలో వెళ్లారు. ఎంతసేపటికీ స్పందన లేకపోవడంతో పక్కనే ఉన్న కిటికీ నుంచి చూశారు. తన తండ్రి ఫ్యాన్‌కు ఉరివేసుకున్న స్థితిలో కనిపించడంతో గేటు వద్ద ఉన్న గన్‌మెన్‌ ఆదాం, డ్రైవర్‌ ప్రసాద్‌లను పిలిచారు. అదే సమయంలో అక్కడ ఉన్న మరో ముగ్గురు కూడా వారితో పాటు మొదటి అంతస్తులోకి వెళ్లారు. వరండా ద్వారా గది వెనుక వైపు ఉన్న కిటికీ సమీపంలోకి చేరుకుని గ్రిల్స్‌ పక్కకు జరపడం ద్వారా లోపలకు ప్రవేశించి తలుపు తీశారు. డ్రైవర్‌ ప్రసాద్‌ ‘108’కు కాల్‌ చేయగా కొన్ని వివరాలు కోరడంతో ఫోన్‌ కట్‌ చేసి బసవతారం కేన్సర్‌ ఆస్పత్రికి ఫోన్‌ చేసి విషయం చెప్పాడు. అనంతరం తమ కారులోనే కోడెలను బసవతారకం కేన్సర్‌ ఆస్పత్రికి తరలించారు. 

బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రిలో పలు పరీక్షలు...
అపస్మారక స్థితిలో ఉన్న కోడెలను 11.35 గంటలకు ఆస్పత్రికి తీసుకురాగా తాము పలు పరీక్షలు జరిపినట్లు బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రి మెడికల్‌ సూపరింటెండెంట్‌ చెప్పారు. సుమారు గంట పాటు ఆయనకు వైద్యం అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని, 12.39 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారని మెడికల్‌ బులెటెన్‌లో బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రి సీఈవో డాక్టర్‌ ఆర్‌వి.ప్రభాకర్‌రావు తెలిపారు. కోడెల భార్య ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మధ్యాహ్నం 2.50 గంటలకు ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. పోస్టుమార్టం అనంతరం కోడెల భౌతికకాయాన్ని ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌కు తరలించారు. కోడెల భార్య, కుమార్తె, డ్రైవర్, గన్‌మెన్‌ నుంచి పోలీసులు వాంగ్మూలం నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

పలువురు ప్రముఖుల నివాళులు
బసవతారకం ఆస్పత్రి ఎంఐసీలో ఉన్న కోడెల పార్థివదేహాన్ని పలువురు ప్రముఖులు సందర్శించి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ, బసవతారకం కేన్సర్‌ ఆస్పత్రి చైర్మన్‌ నందమూరి బాలకృష్ణ, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్, మాజీ స్పీకర్‌ మధుసూదనాచారి, నాగం జనార్ధన్‌రెడ్డి, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, కడియం శ్రీహరి, ఆరెకపూడి గాంధీ, నిర్మాత బండ్ల గణేష్‌ తదితరులు కోడెల భౌతికకాయం వద్ద నివాళులు అర్పించారు.  

తాడుతోనా.. కేబుల్‌ వైరుతోనా?
తన తండ్రి ధోవతిని చింపి తాడుగా చేసుకుని ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నట్లు విజయలక్ష్మి పోలీసులకు తెలిపారు. దాదాపు నాలుగైదు ముడులతో ఉన్న  తాడు అక్కడ లభించిందని, అయితే కేబుల్‌ వైరుతో ఉరి వేసుకున్నట్లు గుర్తించామని పోలీసులు పేర్కొన్నారు. ఘటన అనంతరం కోడెల నివాసానికి చేరుకున్న క్లూస్‌ టీమ్‌ పలు ఆధారాలు సేకరించింది. ఆయన ఉరి వేసుకున్న ఫ్యాన్‌ ఒంగిపోవడాన్ని గుర్తించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement