కుక్కను తప్పించబోయి...
రోడ్డు ప్రమాదంలో మాజీ సైనిక ఉద్యోగి దుర్మరణం
మరొకరికి తీవ్ర గాయాలు
ద్విచక్ర వాహనం బోల్తాతో ప్రమాదం
యలమంచిలి : రోడ్డుకు అడ్డంగా వచ్చిన శునకాన్ని తప్పించబోయి దురదృష్టవశాత్తు ద్విచక్ర వాహనం బోల్తాపడిన రోడ్డు ప్రమాదంలో ఆదివారం సాయంత్రం మాజీ సైనిక ఉద్యోగి దుర్మరణం చెందగా, మరొక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పెదపల్లి హైవే జంక్షన్‌కు సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం సాయంత్రం జరిగిన ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కశింకోట మండలం పల్లపు సోమవరానికి చెందిన మాజీ సైనిక ఉద్యోగి కలిగట్ల వెంకటరమణ (45), అదే గ్రామానికి చెందిన పూడి వెంకటనాగరాజు ద్విచక్ర వాహనంపై యలమంచిలి నుంచి స్వగ్రామం పల్లపు సోమవారానికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, పెదపల్లి హైవే జంక్షన్ దాటిన తర్వాత రోడ్డుకు అడ్డంగా శునకం అకస్మాత్తుగా అడ్డువచ్చింది. దానిని తప్పించే ప్రయత్నంలో రోడ్డు పక్కగా ఉన్న డివైడర్‌ను ఢీకొట్టి వీరు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం బోల్తాపడింది. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న మాజీ సైనిక ఉద్యోగి వెంకటరమణ రోడ్డు పక్కన ఉన్న ఇనుప కమ్మెను ఢీకొట్టారు. దీంతో అతని తలకు, శరీర భాగాలకు తీవ్ర గాయాలై రక్తస్రావమైంది.
అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. బైక్‌పై ప్రయాణిస్తున్న వెంకటనాగరాజు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే 108 వాహనంలో క్షతగాత్రులను యలమంచిలి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ ప్రధమ చికిత్స చేసిన అనంతరం పరిస్థితి ప్రమాదకరంగా ఉండటంతో విశాఖ కేజీహెచ్‌కు మెరుగైన చికిత్స నిమిత్తం తరలించారు. ప్రమాదంలో దుర్మరణం పొందిన మాజీ సైనిక ఉద్యోగి వెంకటరమణ నక్కపల్లి మండలం కాగిత టోల్‌ప్లాజా వద్ద పనిచేస్తున్నారు. అతని మృతి వార్త తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు ప్రమాద స్థలానికి చేరుకుని వెంకటరమణ మృతదేహం వద్ద కన్నీరుమున్నీరుగా విలపించారు. వెంకటరమణ మృతదేహాన్ని యలమంచిలి మార్చురీలో భద్రపరిచారు. ఈ ప్రమాదంపై యలమంచిలి పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.