Venkatraman
-
రమ్య కేసు విచారణ వాయిదా
హైదరాబాద్: రమ్య కేసు విచారణ వచ్చే నెల 2 కు వాయిదా పడింది. రమ్య తండ్రి వెంకటరమణ మాట్లాడుతూ ఈ కేసులో మాకు న్యాయం జరుగుతుందని అనుకోవడం లేదు. ఇప్పుడు ట్రైల్స్ ప్రారంభమైతే ఈ కేసు ఎప్పటికి పూర్తవుతుందో తెలియదు. సెకండ్ ఛార్జ్‌షీట్ ఇంత వరకు కోర్ట్‌లో ఫైల్ చేయలేదు. ఈ కేసు ఫాస్ట్రాక్ కోర్టు ద్వారా విచారణ చేపడతాం అన్నారు. కానీ ఇప్పుడు సెషన్కోర్ట్ అంటున్నారు. సెషన్కోర్ట్కి ఈ కేసు వెళ్తే కాలయాపన తప్ప న్యాయం జరగుతుందని మేం భావించడం లేదు. గతంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి రమ్య చట్టం తీసుకురావాలని విన్నవించాం. కానీ ప్రభుత్వం ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు. ఈ కేసులో మైనర్లకు మద్యం అమ్మిన వారి పై కూడా కఠిన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేస్తున్నా, అయినా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. -
కడచూపునకు నోచుకోకనే..
వలస కుటుంబాన్ని ఛిద్రం చేసిన కారు కళ్లేదుటే భార్య, కుమారుడి దుర్మరణం ఆస్పత్రిపాలైన భర్త విషాదంలో గుడిపల్లె గ్రామం బెంగళూరు మహా నగరంలో కూలి పనులు దొరుకుతాయని, తద్వారా నాలుగు డబ్బులు సంపాదించుకోవడంతోపాటు బిడ్డను చదివించుకోవచ్చన్న ఆశ ఆ నిరుపేద తల్లిదండ్రుల్లో కలిగింది. వారు బిడ్డను తీసుకుని బెంగళూరు నగరానికి వెళ్లారు. అక్కడ కారు రూపంలో వచ్చిన మృత్యువు తల్లి, కుమారుడిని బలితీసుకుంది. తండ్రి తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు. మృతులకు బుధవారం సాయంత్రం బి.కొత్తకోట మండలం బీరంగి గ్రామం గుడిపల్లె ఎస్సీకాలనీలో అంత్యక్రియలు నిర్వహించారు. బి.కొత్తకోట: మండలం బీరంగి గ్రామం గుడిపల్లె ఎస్సీకాలనీకి చెందిన పి.వెంకటరమణ(48), పి.శ్యామల(40) దంపతులకు ఒక్కగానొక్క కుమారుడు పి.నందకుమార్(8) ఉన్నాడు. వ్యవసాయ కూలీలైన వీరు గుడిపల్లెలో 10 కుంటల భూమిని కౌలుకు తీసుకుని పత్తి సాగుచేశారు. ఈ నేపథ్యంలో కర్ణాటకలోని బెంగళూరులో కూలి పనులు చేసుకుంటూ కొడుకును చదివించుకోవాలని వెంకటరమణ ఆశపడ్డాడు. 14 రోజుల క్రితం భార్య, కొడుకును తీసుకుని బెంగళూరు వెళ్లాడు. నగరంలోని కాటం నెల్లూరు గేట్ సమీపంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. నందకుమార్‌ను కేఆర్పురలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చేర్పించాడు. మంగళవారం రాత్రి వెంకటరమణ, శ్యామల కుమారుడు నందకుమార్‌తో కలిసి బియ్యం కొనుగోలు చేసేందుకు బజారుకు వెళ్లారు. బియ్యం, సరుకులు తీసుకుని తిరిగి బయలుదేరారు. సప్తగిరి కల్యాణ మండపం ఎదురుగా రోడ్డును దాటుతుండగా వేగంగా వచ్చిన కారు ముగ్గురినీ ఢీకొంది. వెంకటరమణ త్రుటిలో తప్పించుకుని కిందపడిపోయాడు. శ్యామల, నందకుమార్‌పై కారు దూసుకె ళ్లడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందారు. వెంకటరమణను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. బుధవారం సాయంత్రం శ్యామల, నందకుమార్ మృతదేహాలను బెంగళూరు నుంచి స్వగ్రామం గుడిపల్లెకు తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. గ్రామంలో విషాదం ప్రమాదంలో మరణించిన భార్య, కుమారుడిని కడసారి చూపునకు నోచుకొని దయనీయ పరిస్థితి వెంకటరమణది. బిడ్డ చదువుకోసం వెళితే దేవుడు ఇలా చేశాడా అంటూ పలువురు రోదించారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
ట్రాక్టర్ బోల్తా...ఇద్దరు మృత్యువాత
వైఎస్సార్ జిల్లా సంబేపల్లి మండలం మోతుకువాండ్లపల్లి వద్ద ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో ఇద్దరు చనిపోయారు. మోతుకువాండ్లపల్లికి చెందిన నర్సింహారెడ్డి, డ్రైవర్ గుత్తి వెంకటరమణ కలసి ట్రాక్టర్లో కలకడ నుంచి మోతుకువాండ్లపల్లి వైపు వెళ్తున్నారు. సమీపంలోని హంద్రీనీవా కాల్వ వద్ద నిర్మాణంలో ఉన్న వంతెన వద్ద ఆ ట్రాక్టర్ బోల్తాపడింది. ఈ ఘటనలో నర్సింహారెడ్డి(55), వెంకటరమణ(25) అక్కడికక్కడే చనిపోయారు. -
నాయనా..నేనూ వస్తున్నా..
తనయుడి మృతితో తల్లడిల్లిన తండ్రి విగతజీవిగా బిడ్డను చూసి ఆగిన గుండె తండ్రీకొడుకుల శవయాత్రతో ఘొల్లుమన్న బీరంగి కన్నకొడుకు మరణవార్త అందుకున్న తండ్రి ఇంటిముందు షామియానా వేయించాడు. సమాధి గుంత తవ్వించాడు. అంత్యక్రియలకు వచ్చే బంధువుల కోసం భోజనాలు సిద్ధం చేయించాడు. కొడుకు మృతదేహం ఇంటికి రాగానే ‘ఏమిరా నాయనా.. నాకు మట్టిపోయాల్సిన నీవే వెళ్లిపోయావా.. అంటూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అంతే కొడుకు శవం పక్కనే తానూ శవంగా మారాడు. గంటల వ్యవధిలోనే తండ్రీకొడుకులు మృతి చెందడంతో బి.కొత్తకోట మండలం బీరంగి విషాదంలో మునిగిపోయింది. బి.కొత్తకోట: బీరంగికి చెందిన సీహెచ్ చిన్న వెంకటరమణ(65)కు ఇద్దరు భార్యలు, ముగ్గురు కుమారులు ఉన్నారు. మొదటి భార్య రెండో కుమారుడు చాకల జయచంద్ర(35)కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇతడు ఏడాదిగా బెంగళూరులో కులవృత్తి చేసుకునేవాడు. గత నెలలో బీరంగికి తిరిగి వచ్చేశాడు. కడుపు నొప్పి రావడంతో వారం క్రితం బెంగళూరులో వైద్యం చేయించుకున్నాడు. శనివారం మళ్లీ నొప్పి రావడంతో మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి వెళ్లాడు. అక్కడి వైద్యులు తిరుపతి రుయాకు తరలించారు. చికిత్సపొందుతూ జయచంద్ర సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు మృతిచెందాడు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు జయచంద్ర తండ్రి చిన్న వెంకటరమణకు ఫోన్‌ద్వారా సమాచారం ఇచ్చారు. దీంతో షాకయ్యాడు. కుమారుడు లేడనే నిజాన్ని జీర్ణించుకోలేకపోయాడు. కాస్సేపటికి తేరుకుని అంత్యక్రియలకు ఏర్పాటుచేశాడు. ఇంటిముందు షామియానాలు వేయించాడు. సమాధి గుంతను తవ్వించాడు. దూరప్రాంతం నుంచి వచ్చే బంధువులకు భోజన ఏర్పాట్లు కూడా చేయించాడు. ఉదయం 9 గంటలకు జయచంద్ర మృతదేహం ఇంటి వద్దకు తీసుకువచ్చారు. విగత జీవుడుగా కుమారుడు కనిపించగానే వెంకటరమణ దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు. ‘ఏమిరా నాయనా.. నాకు మట్టిపోయాల్సిన నీవు నా కళ్లముందరే వె ళ్లిపోయావా...’ అంటూ ఒక్కసారిగా మృతదేహం వద్దే కుప్పకూలిపోయాడు. సోమ్ముసిల్లి పడిపోయి ఉంటాడని భావించిన స్థానికులు, కుటుంబ సభ్యులు సపర్యలు చేశారు. ఎంతకూ లేవకపోవడంతో శంకరాపురంలోని వైద్యుడిని పిలిపించారు. ఆయన పరీక్షించి అప్పటికే మృతి చెందినట్టు ధ్రువీకరించారు. ఈ సంఘటనతో బీరంగిలో విషాదం అలుముకొంది. త ండ్రీకొడుకుల మృతదేహాలను రెండు పాడెలపై తీసుకెళ్తుండగా గ్రామస్తులు కన్నీరుమున్నీరయ్యారు. ఇద్దరికీ ఒకేచోట అంత్యక్రియలు నిర్వహించారు. -
మనసు దోచుకున్నాడు..
పోలీసులకు టీ అందిస్తున్న వ్యక్తి పేరు శీలంశెట్టి వెంకటరమణ. వృత్తి దొంగతనం. 200లకు పైగా దొంగతనాలతోపోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన చరిత్ర అతనిది. ఎన్నిసార్లు జైలుకు వెళ్లొచ్చినా మార్పు రాలేదు. మళ్లీ ధ్యాసంతా దొంగతనాల పైనే. 2002లో కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేసినా అతనిలో చలనం కలగలేదు. ఆఖరికి తనపై ఉన్న కేసులకు విసుగెత్తి స్వయంగా పోలీసులకు లొంగిపోయాడు. అతనిలో మార్పు వస్తుందనే నమ్మకంతో ఎలాగైనా మార్చాలని సంకల్పించిన పోలీసులు.. ఎట్టకేలకు విజయం సాధించారు. ఆరు నెలల పాటు వెంకటరమణకు, అతని కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చి మంచి మనిషిగా మార్చారు. కృష్ణా జిల్లా రాజరాజేశ్వరీపేట ఇతని స్వస్థలం. పదేళ్ల వయసు నుంచే చెడు సావాసాలతో దొంగతనాలకు అలవాటు పడ్డాడు. ఇళ్ల లో దొంగతనాలు చేస్తూ జీవనం సాగించేవాడు. తాను చేస్తున్న పనికి ముఖం చూపించుకోలేక భార్యాపిల్లలకు, బంధువులకు దూరంగా బతికేవాడు. పేదరికం, చిన్నతనంలో తెలియనితనంతో దొంగగా మారానని ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే భార్యాపిల్లల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని పూర్తిగా మారిపోయానని కన్నీటి పర్యంతమయ్యాడు వెంకటరమణ. అతడు నలుగురిలో తలెత్తుకుని జీవించేందుకు నగర క్రైం డీసీపీ నవీన్‌కుమార్ సహకారంతో హైదరాబాద్‌లోని ఉప్పల్ పోలీసులు.. దాదాపు 40 వేలతో ఓ టీస్టాల్ ఏర్పాటు చేయించారు. ఈ టీస్టాల్‌ను అదనపు డీసీపీ శ్రీనివాస్, క్రైం ఏసీపీ సాయి మనోహర్, మల్కాజిగిరి ఏసీపీ రవిచందన్రెడ్డితో కలసి బుధవారం ప్రారంభించారు. ప్రతి నేరస్తుడు తన నేరప్రవృత్తిని వీడి జనజీవన స్రవంతిలో కలిసేందుకు ముందుకొస్తే తమ వంతు సాయమందిస్తామని ఏసీపీ రవి చందన్‌రెడ్డి పేర్కొన్నారు. వారికి వివిధ రంగాల్లో శిక్షణనిచ్చి గౌరవంగా బతికేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. - హైదరాబాద్ -
కుక్కను తప్పించబోయి...
రోడ్డు ప్రమాదంలో మాజీ సైనిక ఉద్యోగి దుర్మరణం మరొకరికి తీవ్ర గాయాలు ద్విచక్ర వాహనం బోల్తాతో ప్రమాదం యలమంచిలి : రోడ్డుకు అడ్డంగా వచ్చిన శునకాన్ని తప్పించబోయి దురదృష్టవశాత్తు ద్విచక్ర వాహనం బోల్తాపడిన రోడ్డు ప్రమాదంలో ఆదివారం సాయంత్రం మాజీ సైనిక ఉద్యోగి దుర్మరణం చెందగా, మరొక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పెదపల్లి హైవే జంక్షన్‌కు సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం సాయంత్రం జరిగిన ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కశింకోట మండలం పల్లపు సోమవరానికి చెందిన మాజీ సైనిక ఉద్యోగి కలిగట్ల వెంకటరమణ (45), అదే గ్రామానికి చెందిన పూడి వెంకటనాగరాజు ద్విచక్ర వాహనంపై యలమంచిలి నుంచి స్వగ్రామం పల్లపు సోమవారానికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, పెదపల్లి హైవే జంక్షన్ దాటిన తర్వాత రోడ్డుకు అడ్డంగా శునకం అకస్మాత్తుగా అడ్డువచ్చింది. దానిని తప్పించే ప్రయత్నంలో రోడ్డు పక్కగా ఉన్న డివైడర్‌ను ఢీకొట్టి వీరు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం బోల్తాపడింది. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న మాజీ సైనిక ఉద్యోగి వెంకటరమణ రోడ్డు పక్కన ఉన్న ఇనుప కమ్మెను ఢీకొట్టారు. దీంతో అతని తలకు, శరీర భాగాలకు తీవ్ర గాయాలై రక్తస్రావమైంది. అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. బైక్‌పై ప్రయాణిస్తున్న వెంకటనాగరాజు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే 108 వాహనంలో క్షతగాత్రులను యలమంచిలి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ ప్రధమ చికిత్స చేసిన అనంతరం పరిస్థితి ప్రమాదకరంగా ఉండటంతో విశాఖ కేజీహెచ్‌కు మెరుగైన చికిత్స నిమిత్తం తరలించారు. ప్రమాదంలో దుర్మరణం పొందిన మాజీ సైనిక ఉద్యోగి వెంకటరమణ నక్కపల్లి మండలం కాగిత టోల్‌ప్లాజా వద్ద పనిచేస్తున్నారు. అతని మృతి వార్త తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు ప్రమాద స్థలానికి చేరుకుని వెంకటరమణ మృతదేహం వద్ద కన్నీరుమున్నీరుగా విలపించారు. వెంకటరమణ మృతదేహాన్ని యలమంచిలి మార్చురీలో భద్రపరిచారు. ఈ ప్రమాదంపై యలమంచిలి పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నామీదే ఫిర్యాదిస్తావా!
ఎస్ఐ ముందే టీడీపీ నాయకుని వీరంగం రావికమతం: టీడీపీ నాయకుడు, మండల పరిషత్ వైస్‌ఎంపీపీ భర్త గెంజి వెంకటరమణ ఎస్ఐ ముందే రావికమతం స్టేషన్లో గురువారం వీరంగం సృష్టించాడు. మచ్చా శ్రీను అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కోపోద్రిక్తుడైన సదరు నాయకుడు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదిని బెదిరించడమే కాక ఎస్ఐ ముందే చేయి చేసుకున్నాడు. దీనిపై రావికమతం ఎస్ఐ కేసు నమోదు చేశారు. వివరాలిలా ఉన్నాయి. రావికమతం వైఎస్‌ఎంపీపీ గెంజి కనక భర్త వెంకట రమణ ఐదు రోజుల క్రితం హాస్టల్ స్థలం ఆక్రమణకు యత్నించాడు. అక్కడి విలువైన చెట్టును కూడా నరికేశాడు. అలాగే రావికమతం హైస్కూల్ ప్రహరీ నాణ్యత లేకుండా నిర్మిస్తున్నాడంటూ గ్రామానికి చెందిన మచ్చా శ్రీను ఎంపీడీవో, విలేకర్లకు నాలుగు రోజుల క్రితం ఫిర్యాదు చేశారు. దీనిపై ఆగ్రహం చెందిన వెంకట రమణ బుధవారం రాత్రి శ్రీను ఇంటికి వెళ్లి దౌర్జన్యం చేశాడు. ఈ మేరకు బాధితుడు రావికమతం ఎస్ఐకు గురువారం ఫిర్యాదు చేశాడు. ఇది తెలిసి వెంకటరమణ గురువారం స్టేషన్‌కు వెళ్లి ఎస్ఐ సురేష్‌కుమార్‌తో పాటు అందరూ చూస్తుండగానే శ్రీనుపై చేయి చేసుకున్నాడు. దీంతో కొందరు ఫోన్ చేయడంతో కొత్తకోట సీఐ మల్లేశ్వరరావు ఎకాయెకిన రావికమతం స్టేషన్‌కు వచ్చి సదరు నాయకున్ని తీవ్రంగా మందలించారు. ఆపై తదుపరి చర్యలకు ఆదేశించి వెళ్లిపోయారు. శ్రీను ఫిర్యాదు మేరకు వెంకటరమణపై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు. -
తోలుచిత్రాలు
కాలం ముందుకు కదులుతూనే ఉంటుంది. ఆ ప్రస్థానానికి తగినట్లు మనిషి మారుతుండాలి. ఆ మార్పు అభ్యుదయం దిశగా సాగాలి. వ్యక్తి అయినా, వృత్తి అయినా అభివృద్ధికి ఇదే కొలమానం. ఆ సూత్రాన్ని పట్టుకున్నారు తోలుబొమ్మల కళాకారుడు దళవాయి వెంకటరమణ. దేనికదే ప్రత్యేకం! తోలుబొమ్మ కళాకారుల్లో ఉన్న గొప్పదనం ఏమిటంటే... డిజైన్ని ట్రేస్ పేపర్ మీద వేయడం అనే ఆలోచనే ఉండదు. ఘట్టాన్ని ఊహించుకుని స్వయంగా బొమ్మ గీసుకుంటాం. దాంతో ఈ కళలో ఉన్న డిజైన్లు మరి దేనికీ నకలుగా ఉండవు. దేనికదే కొత్త రూపం. తోలు బొమ్మలను పారేయాల్సిందే తప్ప ఎన్నేళ్లయినా అవి పాడవవు. - వెంకట రమణ వాకా మంజులారెడ్డి అనంతపురం నిమ్మలకుంట గ్రామంలో ‘చిత్రకార’ కుటుంబంలో పుట్టిన రమణ... తాత ముత్తాతల నుంచి వారసత్వంగా అందివచ్చిన తోలుబొమ్మలాటను ఇష్టంగా నేర్చుకున్నారు. అందుకే... తాత ఖడేరావు దగ్గర నేర్చుకున్న పాటలు, తండ్రి గోవిందు నేర్పిన ములుకు పట్టడం (తోలు బొమ్మల తయారీలో నైపుణ్యం), నాయనమ్మ, అమ్మ దగ్గర నేర్చుకున్న రంగనాథ రామాయణం ఘట్టాల ప్రదర్శన క్రమంగా ఆదరణ కోల్పోతున్నప్పటికీ ఆ వృత్తిని వదలడానికి ఆయన మనసు ఒప్పుకోలేదు. అలాగని తోలుబొమ్మలాట దగ్గరే ఆగిపోతే కుటుంబం గడవదు. ఈ సంఘర్షణ నుంచి తనకు తాను ఓ కొత్త దారిని వేసుకున్నారు. తోలుబొమ్మలలో అందమైన ల్యాంప్షేడ్లు, వాల్ హ్యాంగింగ్, డోర్ ప్యానెల్ పార్టిషన్... ఇంకా ఇతర గృహాలంకరణ వస్తువులు రూపొందించారు! ఆ ప్రయోగం అతణ్ణి రాష్ట్రస్థాయి హస్తకళల పోటీలో విజేతను చేసింది. లేపాక్షి హస్తకళా ప్రదర్శనలో 2008లో ప్రదర్శించిన ల్యాంప్‌షేడ్‌కి బహుమతి అందుకున్న వెంకటరమణ తాజాగా తన కళాప్రావీణ్యానికి గవర్నర్ నరసింహన్ నుంచి ప్రశంసలతోపాటు రాజ్‌భవన్‌కు ఆహ్వానమూ అందుకున్నారు. ఆట చూడకపోయినా... ‘‘తోలుబొమ్మలాట చూసే వాళ్లు లేరు కానీ తోలుబొమ్మను చూసేవాళ్లుంటారు’’ అంటారు వెంకటరమణ. ‘‘ఇది చిత్రకార ప్రధానమైన కళ. దీనిని చిత్రాలకే పరిమితం చేస్తూ కొనసాగిద్దామని ఇలాంటి ప్రయోగాలు చేశాను. నా ప్రయోగాలు విజయవంతమైన తర్వాత మధువని, కలంకారీ వంటి ఇతర చిత్రరీతులను కూడా తోలు మీద చిత్రిస్తున్నాను’’ అని చెప్పారాయన. ధర్మవరం రంగులు తోలుబొమ్మలకు పట్టుచీరలకు వేసే రంగులనే వెంకటరమణ వాడతారు. ‘‘మాకు ధర్మవరం పదికిలోమీటర్ల దూరం. రంగులన్నీ అక్కడి నుంచే తెచ్చుకుంటాం. ఆ రంగులు వేస్తే బొమ్మ అందంగా ఉంటుంది, ఎక్కువ కాలం ఆకర్షణీయంగా ఉంటుంది’’ అంటారు వెంకటరమణ. ఢిల్లీ ప్రగతి మైదాన్, హైదరాబాద్ శిల్పారామంలతో సహా ఇప్పటి వరకు. దేశంలోని దాదాపు అన్ని ప్రధాన పట్టణాలలో ఆయన తన కళా కృతులను ప్రదర్శించారు. ‘‘ఆటను ప్రదర్శించడానికైతే కనీసంగా ఆరుగురు మనుషులుండాలి. చిత్రకార కుటుంబాల్లో అందరికీ ఈ కళలో ప్రవేశం ఉంటుంది. తోలుబొమ్మలాట చూడాలనే ఆసక్తి లేకపోయినా, అది ఎలా ఉంటుందో ఈ తరం పిల్లలకు చూపించాలని ఎవరైనా సరదా పడినా సరే ఆట ఆడడానికి తాము సిద్ధమే’’ అంటున్నారు వెంకటరమణ. ఫొటోలు: నోముల రాజేశ్‌రెడ్డి -
టీడీపీ వర్గీయుల హత్యాయత్నం
వైఎస్సార్ సీపీ నేతపై మారణాయుధాలతో పట్టపగలే దాడి మంత్రి యనమల సోదరుడు కృష్ణుడే చేయించారన్న బాధితుడు వెంకటరమణ తొండంగి: తూర్పు గోదావరి జిల్లా తుని నియోజకవర్గం తొండంగి మండల వైఎస్సార్ కాంగ్రెస్ నేత, రాష్ట్ర మత్స్యకార సంఘం డెరైక్టర్ కోడా వెంకటరమణపై టీడీపీ వర్గీయులు ఆదివారం హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన రాజకీయ కక్షలతోనే జరిగిందని, రాష్ర్ట ఆర్థిక మంత్రి యనమల సోదరుడు, టీడీపీ తుని నియోజకవర్గ ఇన్చార్జి యనమల కృష్ణుడే ఈ దాడి చేయించారని వెంకటరమణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంకట రమణ.. తన స్వగ్రామం ఎల్లయ్యపేటకు సమీపంలో ఉన్న పొలానికి ఆదివారం ఉదయం వెళ్లి వస్తుండగా కోళ్లఫారం సమీపంలో గొల్ల ముసలయ్యపేటకు చెందిన టీడీపీ వర్గీయులు తాటిపర్తి దండియ్య, నేమాల సత్తిబాబు, కొత్తముసలయ్యపేటకు చెందిన తాటిపర్తి బాబూరావు, తాటిపర్తి యతిమాని మారణాయుధాలతో దాడి చేశారు. దాడిలో తీవ్ర గాయాల పాలైన వెంకటరమణను సమీప పొలంలో పనులు చేసుకుంటున్న రైతులు వచ్చి రక్షించారు. దుండగులు బాధితుని సెల్‌ఫోన్‌ను తీసుకుని పారిపోయారు.కోలుకున్న వెంకట రమణ తన పై జరిగిన హత్యాయత్నంపై ఒంటిమామిడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదుకు పోలీసుల తాత్సారం వైఎస్సార్ సీపీ నేతపై జరిగిన హత్యాయత్నంపై కేసు నమోదు చేసేందుకు పోలీసులు తాత్సారం చేశారు. దీంతో బాధితుడు వెంకటరమణ ఈ విషయాన్ని వైఎస్సార్ సీపీకి చెందిన తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాకు తెలిపారు. ఆయన ఇతర నేతలతో పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. మరోపక్క మత్స్యకారులు కూడా పెద్ద సంఖ్యలో స్టేషన్‌కు చేరుకున్నారు. దీనిపై ఎమ్మెల్యే రాజా సీఐతో చర్చించారు. పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ సీపీ శాసనసభాపక్ష ఉపనేత, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ.. జిల్లా ఎస్పీ రవిప్రకాష్‌ను కోరారు. ఎమ్మెల్యే రాజా కూడా ఎస్పీతో మాట్లాడారు. హత్యాయత్నంపై కేసు నమోదు చేసి, దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేసి న్యాయం చే స్తామని సీఐ హామీ ఇవ్వడంతో అంతా శాంతించారు. -
తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీకి వైఎస్సార్ సీపీ దూరం
నిర్ణయం ప్రకటించిన అధిష్టానం అందరి ఆమోదం మేరకే నిర్ణయం చిత్తూరు: తిరుపతి అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీచేయకూడదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ ముఖ్యనేతలు కరుణాకరరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లా అధ్యక్షుడు నారాయణస్వామితో పాటు జిల్లాకు చెందిన పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులతో గురువారం పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి చర్చించి నిర్ణయించారు. తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ మృతిచెందడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. అధికార పార్టీ తరపున వెంకటరమణ కుటుంబ సభ్యులే పోటీ చేస్తున్నారు. ఈ పోటీకి సంబంధించి నిర్ణయం తీసుకునేందుకు వైఎస్సార్సీపీ అధిష్టానం గురువారం హైదరాబాద్‌లో సమావేశమైంది. జిల్లాకు చెందిన ముఖ్యనేతలు, ప్రజాప్రతినిధులతో జగన్మోహన్రెడ్డి చర్చించారు. తిరుపతి ఎన్నికల్లో పోటీ చేయరాదని నిర్ణయించారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు తిరుపతి ఉపఎన్నికల్లో పోటీ చేయడంలేదని పార్టీ జిల్లా అధ్యక్షుడు నారాయణస్వామి పేర్కొన్నారు. సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. -
తిరుపతి ఎమ్మెల్యేకు అసెంబ్లీ నివాళి
వెంకటరమణ అజాతశత్రువని ప్రశంసించిన సభ బడుగు, బలహీనవర్గాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు: బాబు ఆయన మరణం పేదలకు తీరని లోటు: జగన్ సంతాప తీర్మానానికి సభ ఆమోదం, అసెంబ్లీ రేపటికి వాయిదా సాక్షి, హైదరాబాద్: తిరుపతి ఎమ్మెల్యే మన్నూరు వెంకటరమణకు ఏపీ శాసనసభ గురువారం నివాళులర్పించింది. వెంకట రమణ అజాతశత్రువని కొనియాడింది. ఈ మేరకు సంతాపతీర్మానాన్ని ఆమోదించింది. శాసనసభ శీతాకాల సమావేశాలు గురువారం ఉదయం 9 గంటలకు ప్రారంభమైన వెంటనే సీఎం చంద్రబాబు స్పీకర్ అనుమతితో సంతాప తీర్మానాన్ని ప్రతిపాదించారు. వెంకటరమణ కింది స్థాయి నుంచి అంచలంచెలుగా ఎదుగుతూ బలహీనవర్గాల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకున్నారని సీఎం చెప్పారు. సహనానికి మారు పేరుగా నిలిచారని కొనియాడారు. ఆయన మృతి పేదలకు తీరని లోటని చెప్పారు. ఆయన కుటుంబానికి, పిల్లలకు అండగా ఉంటామని తెలిపారు. వెంకటరమణ భార్య సేవకు మారుపేరని, దేవతామూర్తి అని చెప్పారు. రమణకు మృతికి సభ్యుల సంతాపం మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, చినరాజప్ప, అచ్చెన్నాయుడు, బి.గోపాల్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, కె.శ్రీనివాసులు, గొల్లపల్లి సూర్యారావు, విష్ణుకుమార్ రాజు, సత్యప్రభ, దేశాయ్ తిప్పారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రోజా, కాలువ శ్రీని వాసులు, నారాయణస్వామి, జగ్గిరెడ్డి తదితరులు వెంకటరమణ మృతికి సంతాపం తెలి పారు. ఆయనతో తమకున్న సాన్నిహిత్యాన్ని, ఆయన సేవాతత్పరతను,అంకితభావాన్ని గుర్తుచేసుకున్నారు. వెంకటరమణ వ్యక్తిత్వాన్ని, ఔన్నత్యాన్ని స్పీకర్ కోడెల శివప్రసాదరావు కొనియాడారు. అనంతరం సభ సంతాప తీర్మానాన్ని ఆమోదించింది. సభ్యులందరూ లేచి నిలబడి కొద్దిసేపు మౌనం పాటించి నివాళులర్పించారు. పెషావర్ ఉచకోతపై ఖండన పాకిస్తాన్‌లోని పెషావర్‌లో ఓ సైనిక స్కూలులో తాలిబన్ ఉగ్రవాదులు జరిపిన విద్యార్థుల ఊచకోతను శాసనసభ ఖండించింది. ఈ అమానవీ య, అమానుష సంఘటనను నాగరిక ప్రపం చం సహించకూడదని పేర్కొంది. తాలిబన్ల కిరాతకానికి ఇప్పటికి 148 మంది అభం శుభం తెలియని విద్యార్ధులు ప్రాణాలు కోల్పోయారని, ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న వీరిని ఉన్మాదం తలకెక్కిన ఉగ్రవాదులు కాల్చివేసి తల్లిదండ్రులకు గర్భశోకం మిగిల్చారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈమేరకు సభ ఓ తీర్మానాన్ని ఆమోదిం చింది. విద్యార్థులకు శ్రద్ధాంజలి ఘటిం చింది. సీఎం చంద్రబాబు ఈ తీర్మానాన్ని ప్రతి పాదించారు. ఉన్మాదానికి హద్దులు లేకుండా పోయాయని అన్నారు. ఈ తీర్మానానికి ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి పూర్తి మద్దతు ప్రకటించారు. ఇటువంటి హేయమైన చర్యను యావత్ ప్రపంచం ఖండించాలన్నారు. మరణిం చిన విద్యార్థుల కుటుంబాలకు సానుభూతి తెలి పారు. ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, శ్రీకాంత్ రెడ్డి, విష్ణుకుమార్‌రాజు, జాన్‌బాషా తదితరులు కూడా మాట్లాడారు. అనంతరం సభ శుక్రవారానికి వాయిదా పడింది. సింగపూర్ తీసుకెళ్లి ఉంటే బాగుండేది: జగన్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ వెంకటరమణ కుటుంబంతో తమకున్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నా రు. కార్పొరేటర్ స్థాయి నుంచి ఎదిగి అనేక ఉన్నత పదవులు నిర్వహించిన నేత అని కొనియాడారు. అసెంబ్లీ గత సమావేశాలప్పు డే ఆయన ఆరోగ్యం బాగాలేదని గమనించామని, తూలిన పరిస్థితి కూడా చూశామని తెలిపారు. ఆ సందర్భంలోనే సింగపూర్ వెళ్లి వైద్యం చేయించుకోవాలని అనుకున్నారని, ఇదే విషయాన్ని ముఖ్యమంత్రికి చెప్పారని వివరించారు. కానీ ముఖ్యమంత్రి కొందరు కార్పొరేట్ పెద్దలతో కలసి ప్రైవేటు విమానంలో సింగపూర్ వెళ్లారని, అదే విమానంలో రమణను తీసుకుని వెళ్లి వైద్యం చేయించి ఉంటే ఈవేళ ఇలా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చి ఉండేది కాదని అన్నారు. విధిని ఎవ్వరూ ఆపలేకపోయారని, ఆ కుటుంబానికి అన్ని వేళలా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. రమణకు ఇద్దరు పిల్లలని, వారు మాట్లాడలేని స్థితిలో ఉంటారని, వారిని పెంచి పెద్ద చేసేందుకు ఆ తల్లి (రమణ సతీమణి) ఎంత అవస్థ పడిందో మాటల్లో వర్ణించలేమని ఆవేదన వ్యక్తంచేశారు. ఆ కుటుంబానికి అంతా మంచి జరగాలని ఆకాంక్షిస్తూ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. -
23 వరకు ఏపీ అసెంబ్లీ
బీఏసీ సమావేశంలో నిర్ణయం రెండు రోజులు సాయంత్రం కూడా సమావేశాలు 10 అంశాలపై చర్చించాలని కోరిన వైఎస్సార్సీపీ ఆరింటిని ప్రతిపాదించిన టీడీపీ, ఉమ్మడిగా ఐదింటికి ఓకే సభను కనీసం 15 రోజులు సమావేశపర్చాలన్న వైఎస్సార్ సీపీ, కుదరదన్న సర్కారు సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ శీతాకాల సమావేశాలు ఈనెల 23వ తేదీ వరకే జరగనున్నాయి. గురువారం నుంచి 5 రోజులపాటు సమావేశాలు జరగాలని భావించినప్పటికీ, తొలి రోజైన గురువారం తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ మృతికి సంతాపం ప్రకటించి సభ వాయిదాపడింది. ఆదివారం సెలవు కావడంతో ఇక మిగిలిన నాలుగు రోజులే సభ జరగనుంది. ఇందులో రెండు రోజులు సాయంత్రం వేళ కూడా సభ జరగనుంది. గురువారం అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అధ్యక్షతన జరిగిన సభా వ్యవహారాల సలహా సంఘం (బీఏసీ) సమావేశంలో ఈమేరకు నిర్ణయించారు. 23వ తేదీన సాయంత్రం కూడా సభ నిర్వహించాలని నిర్ణయించారు. మరొక రోజు సాయంత్రం ఎప్పుడు సమావేశం కావాలన్న దానిపై నిర్ణయం తీసుకోలేదు. ఈ సమావేశాల్లో చర్చకు వైఎస్సార్ సీపీ 10 అంశాలను, టీడీపీ ఆరింటిని ప్రతిపాదించాయి. రెండు పార్టీలు ప్రతిపాదించిన వాటిలో ఉమ్మడిగా ఉన్న 5 అంశాలపై చర్చించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, చీఫ్ విప్ కాలువ శ్రీనివాసులు, వైఎస్సార్ సీపీ తరఫున జ్యోతుల నెహ్రూ, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, బీజేపీ నుంచి విష్ణుకుమార్‌రాజుతో పాటు శాసనసభ ఇన్చార్జి కార్యదర్శి కె.సత్యనారాయణ పాల్గొన్నారు. రైతుల ప్రధాన సమస్యలు (ఆత్మహత్యలు, కరువు, కనీస మద్దతు ధర లేకపోవటం, రుణమాఫీ), డ్వాక్రా రుణాలు, పింఛన్లు, కమిటీల్లో సామాజిక కార్యకర్తల నియామకం, రాజధానికి భూ సేకరణ, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు , ఐకేపీ (సంఘమిత్ర, వీఓఏ) ఉద్యోగుల సమస్యలు, హుద్‌హుద్ తపాను, ఇసుక మాఫియా, శ్రీశైలం, పోలవరం దిగువ కుడివైపు ఎత్తిపోతల పథకం, ఉద్యోగుల విభజన తదితర అంశాలపై చర్చించాలని వైఎస్సార్ సీపీ కోరింది. రుణ విముక్తి, పింఛన్లు, నూతన రాజధాని నిర్మాణం, ఉపాధ్యాయ పోస్టుల భర్తీ, ఎర్రచందనం స్మగ్లింగ్, ఇసుక మాఫియా అంశాలపై చర్చించాలని టీడీపీ కోరింది. వీటిలో ఉమ్మడి అంశాలైన హుద్‌హుద్ తుఫాను, రాజధాని నిర్మాణం, కరువు, రైతు రుణ విముక్తి, పింఛన్లపై చర్చించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. మిగిలిన అంశాలపై కూడా చర్చించాలని వైఎస్సార్ సీపీ నేతలు కోరారు. వైఎస్సార్ సీపీ ప్రస్తావించిన వాటిలో మూడు ప్రశ్నల రూపంలో ఉన్నాయని, మిగిలిన వాటిపై వివిధ రూపాల్లో రావాలని ప్రభుత్వం సూచించింది. ప్రశ్నోత్తరాలతో సంబంధం లేకుండా తమ జాబితాలోని అంశాలపై చర్చించాలని వైఎస్సార్ సీపీ ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఇందుకోసం సభను కనీసం 15 రోజులు నిర్వహించాలని కోరారు. క్రిస్మస్ సందర్భంగా బుధ, గురువారాల్లో సెలవు ప్రకటించి, ఆ తరువాత సభను కొనసాగించాలని కోరారు. ప్రభుత్వం అందుకు అంగీకరించలేదు. కౌన్సిల్ కూడా 23 వరకే.. శాసన మండలి వ్యవహారాల సలహా కమిటీ సమావేశం కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ చక్రపాణి అధ్యక్షతన జరిగింది. 23వ తేదీవరకు మండలిని సమావేశపరచాలని నిర్ణయించింది. రుణ విముక్తి, రాజధాని నిర్మాణం, హుదుహుద్ తుపాను, మెట్ట ప్రాంతాల్లో కరువుపై చర్చించాలని నిర్ణయించింది. ఎయిడెడ్ సిబ్బంది పదవీ విరమణ వయోపరిమితిని 60 సంవత్సరాలకు పెంచాలని సీఎం నిర్ణయించినా, సమయం లేకపోవడంవల్ల ఈ సమావేశాల్లో బిల్లు పెట్టలేకపోతున్నామని ప్రభుత్వం వివరించింది. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ సిబ్బంది సర్వీసు క్రమబద్ధీకరణపై కమిటీ నివేదిక వచ్చినప్పటికీ, చర్చకు అంగీకరించలేమని తెలిపింది. అయితే వీటిపై చర్చకు పట్టుబడతామని బీఏసీలో కొందరు సభ్యులు స్పష్టంచేశారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రులు కేఈ కృష్ణమూర్తి, నిమ్మకాయల చినరాజప్ప, మంత్రి పి.నారాయణ, ప్రతిపక్ష నేత సి. రామచంద్రయ్య, బీఏసీ సభ్యులు ఎంవీవీఎస్ శర్మ, గాదె శ్రీనివాసులునాయుడు, రుద్రరాజు పద్మరాజు పాల్గొన్నారు.