వలస కుటుంబాన్ని ఛిద్రం చేసిన కారు
కళ్లేదుటే భార్య, కుమారుడి దుర్మరణం
ఆస్పత్రిపాలైన భర్త విషాదంలో గుడిపల్లె గ్రామం
బెంగళూరు మహా నగరంలో కూలి పనులు దొరుకుతాయని, తద్వారా నాలుగు డబ్బులు సంపాదించుకోవడంతోపాటు బిడ్డను చదివించుకోవచ్చన్న ఆశ ఆ నిరుపేద తల్లిదండ్రుల్లో కలిగింది. వారు బిడ్డను తీసుకుని బెంగళూరు నగరానికి వెళ్లారు. అక్కడ కారు రూపంలో వచ్చిన మృత్యువు తల్లి, కుమారుడిని బలితీసుకుంది. తండ్రి తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు. మృతులకు బుధవారం సాయంత్రం బి.కొత్తకోట మండలం బీరంగి గ్రామం గుడిపల్లె ఎస్సీకాలనీలో అంత్యక్రియలు నిర్వహించారు.
బి.కొత్తకోట: మండలం బీరంగి గ్రామం గుడిపల్లె ఎస్సీకాలనీకి చెందిన పి.వెంకటరమణ(48), పి.శ్యామల(40) దంపతులకు ఒక్కగానొక్క కుమారుడు పి.నందకుమార్(8) ఉన్నాడు. వ్యవసాయ కూలీలైన వీరు గుడిపల్లెలో 10 కుంటల భూమిని కౌలుకు తీసుకుని పత్తి సాగుచేశారు. ఈ నేపథ్యంలో కర్ణాటకలోని బెంగళూరులో కూలి పనులు చేసుకుంటూ కొడుకును చదివించుకోవాలని వెంకటరమణ ఆశపడ్డాడు. 14 రోజుల క్రితం భార్య, కొడుకును తీసుకుని బెంగళూరు వెళ్లాడు. నగరంలోని కాటం నెల్లూరు గేట్ సమీపంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. నందకుమార్‌ను కేఆర్‌పురలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చేర్పించాడు. మంగళవారం రాత్రి వెంకటరమణ, శ్యామల కుమారుడు నందకుమార్‌తో కలిసి బియ్యం కొనుగోలు చేసేందుకు బజారుకు వెళ్లారు. బియ్యం, సరుకులు తీసుకుని తిరిగి బయలుదేరారు. సప్తగిరి కల్యాణ మండపం ఎదురుగా రోడ్డును దాటుతుండగా వేగంగా వచ్చిన కారు ముగ్గురినీ ఢీకొంది. వెంకటరమణ త్రుటిలో తప్పించుకుని కిందపడిపోయాడు. శ్యామల, నందకుమార్‌పై కారు దూసుకె ళ్లడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందారు. వెంకటరమణను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. బుధవారం సాయంత్రం శ్యామల, నందకుమార్ మృతదేహాలను బెంగళూరు నుంచి స్వగ్రామం గుడిపల్లెకు తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించారు.
గ్రామంలో విషాదం
ప్రమాదంలో మరణించిన భార్య, కుమారుడిని కడసారి చూపునకు నోచుకొని దయనీయ పరిస్థితి వెంకటరమణది. బిడ్డ చదువుకోసం వెళితే దేవుడు ఇలా చేశాడా అంటూ పలువురు రోదించారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.