మనసున్న మారాజులు
♦ వెల్లివిరుస్తోన్న మానవత్వం
♦ జంతువులంటే ఎనలేని ప్రేమ
♦ చనిపోయిన కుక్క,కోతికి అంత్యక్రియలు
♦ జంతుప్రేమికులుగా నిలుస్తోన్న
♦ లింగ్సాన్‌పల్లి, గాజిరెడ్డిపల్లి వాసులు
మెదక్: సాటి మనిషిని గౌరవించే సంప్రదాయం రోజురోజుకూ తగ్గుతోంది. ఓవైపు ఆర్థిక సంబంధాలు పెరగ్గా.. మరోవైపు హార్ధిక బాంధవ్యాలు తగ్గుముఖం పట్టాయి. ఈ మధ్య చాలామంది ఎవరికి వారు మేము బాగుంటే చాలు అన్న ధోరణీకే మొగ్గుచూపుతున్నారు. అదే సమయంలో పక్కవారి మంచిచెడును పట్టించుకునే సందర్భాలు చాలా అరుదుగా కన్పిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మెదక్ మండల వాసులు మనుషులనే కాదు జంతువుల పట్ల అంతకంటే ఎక్కువ ప్రేమను కనబరుస్తున్నారు. జంతువులు సాక్షాత్తు భగవంతుని స్వరూపంగా పరిగణిస్తున్నారు. మానవత్వంతో ఆలోచిస్తున్నారు. వాటికి ఏ ఆపద వచ్చినా తట్టుకోలేకపోతున్నారు. మనిషిని గౌరవించినట్టే వాటినీ చూస్తున్నారు. మనుషులు చనిపోతే హిందూ సంప్రదాయం ప్రకారం నిర్వహించే అంత్యక్రియలను వాటికీ నిర్వహిస్తున్నారు. ఇందుకు లింగ్సాన్‌పల్లి, గాజిరెడ్డిపల్లి వాసులే నిదర్శనం.
లింగ్సాన్‌పల్లిలో...
మెదక్ మండలం లింగ్సాన్‌పల్లి గ్రామం అడవిని ఆనుకుని ఉంటుంది. ఇక్కడ కోతుల బెడద అధికం. మహిళలు, చిన్నారులు ఇళ్లనుంచి బయటకు వస్తే చాలు దాడి చేస్తుంటాయి. వారి చేతుల్లో ఏ వస్తువు కన్పించినా లాక్కెళ్తాయి. కోతుల దాడిలో గాయపడి ఆస్పత్రుల పాలైన వారు పదుల సంఖ్యలో ఉంటారు. కాగా ఈ గ్రామానికి చెందిన బోయిని యాదగిరి నాలుగేళ్లుగా కుక్కను పెంచుకుంటున్నాడు. ఈ కుక్క ఒక్క కోతిని కూడా ఊర్లోకి రానివ్వడం లేదు. ఒకవేళ వస్తే వాటిని అడవిలోకి తరిమేంతవరకు వదలదు. దీంతో ఆ ఊరంతా యాదగిరి కుక్కను ఆదరిస్తుంది.
ఏ ఇంటికి వెళ్లినా ఆ కుక్కకు మర్యాదలు చేస్తుంటారు. పాలు పోయడంతోపాటు, అన్నం పెడుతుంటారు. ఇరవైరోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తి తినుబండారాల్లో విషం కలిపి పెట్టడంతో ఆ కుక్క ప్రాణాలు విడిచింది. విషయం తెలిసి ఊరంతా శోకసముద్రంలో మునిగిపోయింది. కుక్కపై తమకున్న మమకారాన్ని ఈ సమయంలో బయటపెట్టారు స్థానికులు. మనిషి చనిపోతే చేసే అంతిమసంస్కారాన్ని కుక్క విషయంలోనూ పాటించారు. డప్పుచప్పుళ్లతో అంతిమ యాత్ర నిర్వహించి గ్రామ శివారులో ఖననం చేశారు. కుక్కను చంపిన దుండగుడిని కఠినంగా శిక్షించాలని గ్రామస్థులంతా కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
గాజిరెడ్డిపల్లిలో...
గాజిరెడ్డిపల్లికి కొంతకాలం క్రితం రెండు కోతులు వచ్చాయి. మామూలుగా కోతులంటేనే జనం జంకుతారు. చేతిలోనూ, ఇళ్లల్లోనూ ఏ వస్తువు దొరికినా లాక్కెళ్తాయని. అయితే ఇక్కడికి వచ్చిన కోతులు ఎవరికి ఎలాంటి హానితలపెట్టేవి కావు. క్రమంగా స్థానికులు వాటి పట్ల మమకారాన్ని పెంచుకున్నారు. వాటికి నిత్యం ఎవరో ఒకరు అన్నం పెట్టేవారు. గ త నెలరోజులుగా ఉన్నట్టుండి ఓ కోతి కన్పించకుండా పోయింది. ఉన్న ఒక్క కోతి బెంగ పెట్టుకుంది. ఒంటిరిగా మిగలడంతో సరైన ఆహారం తీసుకోవడం మానేసింది.
క్రమంగా అనారోగ్యం పాలై మార్చి 31న మృత్యువాత పడింది. దీంతో స్థానికులంతా దుఃఖసాగంలో ముని గారు. ఇక్కడ కూడా సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించారు. కోతి కలేబరానికి పాలు, నీళ్లతో స్నానం చేయించారు. పాడెకట్టి అంతిమయాత్ర నిర్వహించారు. గ్రామ శివారులో ఖననం చేశారు.ఈనెల 4న దినకర్మ చేయాలని స్థానికులు నిర్ణయించారు. మెదక్ మండలంలోని లింగ్సాన్‌పల్లి, గాజిరెడ్డిపల్లి వాసులు జంతువులను ఆదరిస్తోన్న తీరు, వారు వాటిపై పెంచుకున్న మమకారాన్ని పలువురు అభినందిస్తున్నారు.