బిడ్డా...ఒక్కసారి కళ్లుతెరూ..
బిడ్డా...ఒక్కసారి కళ్లుతెరూ..
Published Wed, Aug 17 2016 10:41 PM | Last Updated on Mon, Sep 4 2017 9:41 AM
కన్నపేగుల ఆక్రందన
ఆ విద్యార్థులకు తుది వీడ్కోలు
కన్నీటి సాగరంలో తల్లిదండ్రులు
నందిగామ రూరల్ :
‘ఒక్కసారి కళ్లుతెరిచి చూడు బిడ్డా. మీరే లేకపోతేం మేం ఎవరికోసం బతకాలి. ఒక్కసారి మీ అమ్మను చూడు తండ్రీ...’ అని ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తుంటే అందరి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. పుష్కర స్నానాలకు వెళ్లి అకాల మృత్యువాత పడిన విద్యార్థులకు తల్లిదండ్రులు, బంధుమిత్రులు కన్నీటి వీడ్కోలు పలికారు. స్థానిక చైతన్య కళాశాలలో డిగ్రీ ఫైనలియర్ చదువుతున్న నందిగామ పట్టణానికి చెందిన కొమ్మవరపు హరిగోపి, కూచి లోకేష్, చెర్వుకొమ్ముపాలెం గ్రామానికి చెందిన పాశం గోపిరెడ్డి, వీరులపాడు మండలం, జయంతి గ్రామానికి చెందిన నందిగామ నగేష్, చందర్లపాడు మండలం, తోటరావులపాడు గ్రామానికి చెందిన ములకలపల్లి హరీష్ గుంటూరు జిల్లా, అమరావతి మండలం, గిడుగు సమీపంలో మంగళవారం మధ్యాహ్నం కృష్ణా నదిలో మునిగి మరణించడం తెలిసిందే. వీరిలో హరీష్ మృతదేహానికి మంగళవారం రాత్రి 11 గంటల సమయంలోనే అంత్య క్రియలు పూర్తి కాగా, మిగిలిన నాలుగు మృతదేహాలకు బుధవారం జరిపారు. కుటుంబసభ్యులు, బంధుమిత్రుల కన్నీరు మున్నీరవుతూ మృతులకు కడసారి వీడ్కోలు పలికారు. కడసారి తమ మిత్రులను చూసుకునేందుకు సహచర విద్యార్థులు విలపిస్తూ పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
మేమింక ఎవరి కోసం బతకాలి...!
చేతికందిన బిడ్డలను కోల్పోయి తామెందుకు బతకాలంటూ తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్న తీరుతో అందరూ కంటతడిపెడుతున్నారు. తమ బిడ్డలు తమలా కష్టపడకూడదన్న తలంపుతో ఎంత కష్టమైనా తామే భరిస్తూ ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నామని, తమ ఆశలన్నీ వారి పైనే పెట్టుకున్నామని, 20 ఏళ్లు కూడా నిండకుండానే వాళ్లకు నూరేళ్లు నిండిపోయాయంటూ బోరున విలపిస్తున్నారు. తమ బిడ్డలు లేని లోటు ఎవరు పూడుస్తారని, వారిని కోల్పోయి తమ జీవితాలు పూర్తిగా అంధకారమైపోయాయంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. ‘బిడ్డా ఒక్కసారి మా కోసం కళ్లు తెరువు నాయనా’ అంటూ దీనంగా రోదిస్తున్న తీరు అక్కడ ఉన్న వారి హృదయాలనే కాకుండా వాతావరణాన్ని సైతం బరువెక్కించింది.
Advertisement
Advertisement