23 వరకు ఏపీ అసెంబ్లీ
- బీఏసీ సమావేశంలో నిర్ణయం
- రెండు రోజులు సాయంత్రం కూడా సమావేశాలు
- 10 అంశాలపై చర్చించాలని కోరిన వైఎస్సార్‌సీపీ
- ఆరింటిని ప్రతిపాదించిన టీడీపీ, ఉమ్మడిగా ఐదింటికి ఓకే
- సభను కనీసం 15 రోజులు సమావేశపర్చాలన్న వైఎస్సార్ సీపీ, కుదరదన్న సర్కారు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ శీతాకాల సమావేశాలు ఈనెల 23వ తేదీ వరకే జరగనున్నాయి. గురువారం నుంచి 5 రోజులపాటు సమావేశాలు జరగాలని భావించినప్పటికీ, తొలి రోజైన గురువారం తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ మృతికి సంతాపం ప్రకటించి సభ వాయిదాపడింది. ఆదివారం సెలవు కావడంతో ఇక మిగిలిన నాలుగు రోజులే సభ జరగనుంది. ఇందులో రెండు రోజులు సాయంత్రం వేళ కూడా సభ జరగనుంది. గురువారం అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అధ్యక్షతన జరిగిన సభా వ్యవహారాల సలహా సంఘం (బీఏసీ) సమావేశంలో ఈమేరకు నిర్ణయించారు.
23వ తేదీన సాయంత్రం కూడా సభ నిర్వహించాలని నిర్ణయించారు. మరొక రోజు సాయంత్రం ఎప్పుడు సమావేశం కావాలన్న దానిపై నిర్ణయం తీసుకోలేదు. ఈ సమావేశాల్లో చర్చకు వైఎస్సార్ సీపీ 10 అంశాలను, టీడీపీ ఆరింటిని ప్రతిపాదించాయి. రెండు పార్టీలు ప్రతిపాదించిన వాటిలో ఉమ్మడిగా ఉన్న 5 అంశాలపై చర్చించాలని నిర్ణయించారు.
ఈ సమావేశంలో ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, చీఫ్ విప్ కాలువ శ్రీనివాసులు, వైఎస్సార్ సీపీ తరఫున జ్యోతుల నెహ్రూ, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, బీజేపీ నుంచి విష్ణుకుమార్‌రాజుతో పాటు శాసనసభ ఇన్‌చార్జి కార్యదర్శి కె.సత్యనారాయణ పాల్గొన్నారు. రైతుల ప్రధాన సమస్యలు (ఆత్మహత్యలు, కరువు, కనీస మద్దతు ధర లేకపోవటం, రుణమాఫీ), డ్వాక్రా రుణాలు, పింఛన్లు, కమిటీల్లో సామాజిక కార్యకర్తల నియామకం, రాజధానికి భూ సేకరణ, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, అంగన్‌వాడీ ఉద్యోగుల సమస్యలు , ఐకేపీ (సంఘమిత్ర, వీఓఏ) ఉద్యోగుల సమస్యలు, హుద్‌హుద్ తపాను, ఇసుక మాఫియా, శ్రీశైలం, పోలవరం దిగువ కుడివైపు ఎత్తిపోతల పథకం, ఉద్యోగుల విభజన తదితర అంశాలపై చర్చించాలని వైఎస్సార్ సీపీ కోరింది. రుణ విముక్తి, పింఛన్లు, నూతన రాజధాని నిర్మాణం, ఉపాధ్యాయ పోస్టుల భర్తీ, ఎర్రచందనం స్మగ్లింగ్, ఇసుక మాఫియా అంశాలపై చర్చించాలని టీడీపీ కోరింది. వీటిలో ఉమ్మడి అంశాలైన హుద్‌హుద్ తుఫాను, రాజధాని నిర్మాణం, కరువు, రైతు రుణ విముక్తి, పింఛన్లపై చర్చించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. మిగిలిన అంశాలపై కూడా చర్చించాలని వైఎస్సార్ సీపీ నేతలు కోరారు.
వైఎస్సార్ సీపీ ప్రస్తావించిన వాటిలో మూడు ప్రశ్నల రూపంలో ఉన్నాయని, మిగిలిన వాటిపై వివిధ రూపాల్లో రావాలని ప్రభుత్వం సూచించింది. ప్రశ్నోత్తరాలతో సంబంధం లేకుండా తమ జాబితాలోని అంశాలపై చర్చించాలని వైఎస్సార్ సీపీ ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఇందుకోసం సభను కనీసం 15 రోజులు నిర్వహించాలని కోరారు. క్రిస్మస్ సందర్భంగా బుధ, గురువారాల్లో సెలవు ప్రకటించి, ఆ తరువాత సభను కొనసాగించాలని కోరారు. ప్రభుత్వం అందుకు అంగీకరించలేదు.
కౌన్సిల్ కూడా 23 వరకే..
శాసన మండలి వ్యవహారాల సలహా కమిటీ సమావేశం కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ చక్రపాణి అధ్యక్షతన జరిగింది. 23వ తేదీవరకు మండలిని సమావేశపరచాలని నిర్ణయించింది. రుణ విముక్తి, రాజధాని నిర్మాణం, హుదుహుద్ తుపాను, మెట్ట ప్రాంతాల్లో కరువుపై చర్చించాలని నిర్ణయించింది. ఎయిడెడ్ సిబ్బంది పదవీ విరమణ వయోపరిమితిని 60 సంవత్సరాలకు పెంచాలని సీఎం నిర్ణయించినా, సమయం లేకపోవడంవల్ల ఈ సమావేశాల్లో బిల్లు పెట్టలేకపోతున్నామని ప్రభుత్వం వివరించింది.
కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది సర్వీసు క్రమబద్ధీకరణపై కమిటీ నివేదిక వచ్చినప్పటికీ, చర్చకు అంగీకరించలేమని తెలిపింది. అయితే వీటిపై చర్చకు పట్టుబడతామని బీఏసీలో కొందరు సభ్యులు స్పష్టంచేశారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రులు కేఈ కృష్ణమూర్తి, నిమ్మకాయల చినరాజప్ప, మంత్రి పి.నారాయణ, ప్రతిపక్ష నేత సి. రామచంద్రయ్య, బీఏసీ సభ్యులు ఎంవీవీఎస్ శర్మ, గాదె శ్రీనివాసులునాయుడు, రుద్రరాజు పద్మరాజు పాల్గొన్నారు.