మాట్లాడే అవకాశం ఇవ్వండి: వైఎస్ జగన్
* స్పీకర్‌కు విపక్ష నేత పలుమార్లు విజ్ఞప్తి - నిరాకరించిన కోడెల
* ఉన్నది ఒక్కటే ప్రతిపక్షం.. గంటన్నర అవకాశమే ఎక్కువగా చెప్తున్నారు
* ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ఎన్ని గంటలు మాట్లాడారో పరిశీలించండి
* మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే.. నిరసనగా వాకౌట్ చేయడమే మార్గం
* బడ్జెట్‌పై మాట్లాడే అవకాశం ఇవ్వకపోవటం పట్ల విపక్ష నిరసన, వాకౌట్
సాక్షి, హైదరాబాద్: ‘‘సభలో ఉన్నది ఒకే ఒక ప్రతిపక్ష పార్టీ. ఇచ్చిన సమయం ఒకటిన్నర గంటలు. అది కూడా విపక్ష నేత ప్రసంగం ముగించకముందే మైక్ కట్ చేశారు. బడ్జెట్ కేటాయింపులు, వాస్తవ అవసరాల మధ్య తీవ్రమైన వ్యత్యాసం ఉంది. దాని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. బడ్జెట్ మీద జరిగిన చర్చలో ఒక్క సభ్యుడు కూడా.. ప్రజల అవసరాలు, కేటాయింపులపై మాట్లాడలేదు. ఎన్నికల హామీల మేరకు ఏఏ శాఖలకు ఏమేరకు కేటాయింపులు జరిగాయి, అవసరాలు ఎలా ఉన్నాయనే విషయం మీద సభలో చర్చ అవసరం. సబ్‌ప్లాన్ మీదా మాట్లాడాలి. సభ సజావుగా జరగడానికి సహకరిస్తామని చెప్పిన మేరకు.. నేను మధ్యలో లేచి మాట్లాడలేదు.
నాకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వండి’’ అని బుధవారం అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేసినా స్పీకర్ కోడెల శివప్రసాదరావు నిరాకరించారు. ఆర్థికమంత్రి సమాధానానికి ముందు ప్రతిపక్ష నేతకు అవకాశం ఇస్తామని చెప్పారని, తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని జగన్ పలుమార్లు కోరగా.. విపక్ష నేతకు మైక్ ఇచ్చిన స్పీకర్ కొన్ని సెకన్లకే కట్ చేశారు. వైఎస్సార్‌సీపీ ఉప నేతతో కుదిరిన ఒప్పందం మేరకు షెడ్యూలు నిర్ణయించామని, దాని ప్రకారం ప్రతిపక్ష నేతకు మాట్లాడే అవకాశం ఇవ్వడం సాధ్యం కాదని స్పీకర్ పేర్కొన్నా రు. వైఎస్సార్ సీపీ సభ్యుడు రాజన్నదొరకు అవకాశం ఇస్తున్నానని చెప్తూ.. మాట్లాడాల్సిందిగా దొరకు సూచించారు.
‘‘మా నేతకు పది నిమిషా ల సమయం ఇవ్వండి. తర్వాత నేను క్లుప్తంగా మాట్లాడి ముగిస్తాను’’ అని దొర స్పీకర్‌కు విజ్ఞప్తిచేయగా ‘‘నో రెకమండేషన్స్ మాట్లాడితే మీరు మాట్లాడండి. లేదంటే ఆర్థికమంత్రి సమాధానానికి వెళతాం’’ అంటూ స్పీకర్ తిరస్కరించారు. జగన్‌మోహన్‌రెడ్డి స్పందిస్తూ ‘ గతంలో ప్రతిపక్ష నేతగా చంద్రబాబునాయుడు ఎన్ని గంటలు మాట్లాడారో చూడండి. నిబంధనల పుస్తకంలోని 59వ పేజీలో ఉన్న నిబంధన ప్రకారం.. బడ్జెట్ మీద చర్చకు 6 రోజులు తప్పకుండా ఇవ్వాలి. డిమాండ్స్ మీద చర్చకు 8 రోజులు కేటాయించాలి. కానీ ఉన్న ఒకే పత్రిపక్ష పార్టీకి ఇచ్చింది కేవలం ఒకటిన్నర గంటే. ఇంతగా అడుగుతున్నా ప్రతిపక్ష నేతకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదంటే.. వాకౌట్ చేయడం మినహా మాకు మరో మార్గం కనిపించడం లేదు’’ అని నిరసన వ్యక్తం చేస్తూ పార్టీ సహచర సభ్యులతో కలిసి వాకౌట్ చేశారు.