టీడీపీ వర్గీయుల హత్యాయత్నం
- వైఎస్సార్ సీపీ నేతపై మారణాయుధాలతో పట్టపగలే దాడి
- మంత్రి యనమల సోదరుడు కృష్ణుడే చేయించారన్న బాధితుడు వెంకటరమణ
తొండంగి: తూర్పు గోదావరి జిల్లా తుని నియోజకవర్గం తొండంగి మండల వైఎస్సార్ కాంగ్రెస్ నేత, రాష్ట్ర మత్స్యకార సంఘం డెరైక్టర్ కోడా వెంకటరమణపై టీడీపీ వర్గీయులు ఆదివారం హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన రాజకీయ కక్షలతోనే జరిగిందని, రాష్ర్ట ఆర్థిక మంత్రి యనమల సోదరుడు, టీడీపీ తుని నియోజకవర్గ ఇన్‌చార్జి యనమల కృష్ణుడే ఈ దాడి చేయించారని వెంకటరమణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వెంకట రమణ.. తన స్వగ్రామం ఎల్లయ్యపేటకు సమీపంలో ఉన్న పొలానికి ఆదివారం ఉదయం వెళ్లి వస్తుండగా కోళ్లఫారం సమీపంలో గొల్ల ముసలయ్యపేటకు చెందిన టీడీపీ వర్గీయులు తాటిపర్తి దండియ్య, నేమాల సత్తిబాబు, కొత్తముసలయ్యపేటకు చెందిన తాటిపర్తి బాబూరావు, తాటిపర్తి యతిమాని మారణాయుధాలతో దాడి చేశారు. దాడిలో తీవ్ర గాయాల పాలైన వెంకటరమణను సమీప పొలంలో పనులు చేసుకుంటున్న రైతులు వచ్చి రక్షించారు. దుండగులు బాధితుని సెల్‌ఫోన్‌ను తీసుకుని పారిపోయారు.కోలుకున్న వెంకట రమణ తన పై జరిగిన హత్యాయత్నంపై ఒంటిమామిడి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదుకు పోలీసుల తాత్సారం
వైఎస్సార్ సీపీ నేతపై జరిగిన హత్యాయత్నంపై కేసు నమోదు చేసేందుకు పోలీసులు తాత్సారం చేశారు. దీంతో బాధితుడు వెంకటరమణ ఈ విషయాన్ని వైఎస్సార్ సీపీకి చెందిన తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాకు తెలిపారు. ఆయన ఇతర నేతలతో పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. మరోపక్క మత్స్యకారులు కూడా పెద్ద సంఖ్యలో స్టేషన్‌కు చేరుకున్నారు.
దీనిపై ఎమ్మెల్యే రాజా సీఐతో చర్చించారు. పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ సీపీ శాసనసభాపక్ష ఉపనేత, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ.. జిల్లా ఎస్పీ రవిప్రకాష్‌ను కోరారు. ఎమ్మెల్యే రాజా కూడా ఎస్పీతో మాట్లాడారు. హత్యాయత్నంపై కేసు నమోదు చేసి, దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేసి న్యాయం చే స్తామని సీఐ హామీ ఇవ్వడంతో అంతా శాంతించారు.