నాయనా..నేనూ వస్తున్నా..
తనయుడి మృతితో తల్లడిల్లిన తండ్రి
విగతజీవిగా బిడ్డను చూసి ఆగిన గుండె
తండ్రీకొడుకుల శవయాత్రతో ఘొల్లుమన్న బీరంగి
కన్నకొడుకు మరణవార్త అందుకున్న తండ్రి ఇంటిముందు షామియానా వేయించాడు. సమాధి గుంత తవ్వించాడు. అంత్యక్రియలకు వచ్చే బంధువుల కోసం భోజనాలు సిద్ధం చేయించాడు. కొడుకు మృతదేహం ఇంటికి రాగానే ‘ఏమిరా నాయనా.. నాకు మట్టిపోయాల్సిన నీవే వెళ్లిపోయావా.. అంటూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అంతే కొడుకు శవం పక్కనే తానూ శవంగా మారాడు. గంటల వ్యవధిలోనే తండ్రీకొడుకులు మృతి చెందడంతో బి.కొత్తకోట మండలం బీరంగి విషాదంలో మునిగిపోయింది.
బి.కొత్తకోట: బీరంగికి చెందిన సీహెచ్ చిన్న వెంకటరమణ(65)కు ఇద్దరు భార్యలు, ముగ్గురు కుమారులు ఉన్నారు. మొదటి భార్య రెండో కుమారుడు చాకల జయచంద్ర(35)కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇతడు ఏడాదిగా బెంగళూరులో కులవృత్తి చేసుకునేవాడు. గత నెలలో బీరంగికి తిరిగి వచ్చేశాడు. కడుపు నొప్పి రావడంతో వారం క్రితం బెంగళూరులో వైద్యం చేయించుకున్నాడు. శనివారం మళ్లీ నొప్పి రావడంతో మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి వెళ్లాడు. అక్కడి వైద్యులు తిరుపతి రుయాకు తరలించారు. చికిత్సపొందుతూ జయచంద్ర సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు మృతిచెందాడు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు జయచంద్ర తండ్రి చిన్న వెంకటరమణకు ఫోన్‌ద్వారా సమాచారం ఇచ్చారు. దీంతో షాకయ్యాడు. కుమారుడు లేడనే నిజాన్ని జీర్ణించుకోలేకపోయాడు. కాస్సేపటికి తేరుకుని అంత్యక్రియలకు ఏర్పాటుచేశాడు. ఇంటిముందు షామియానాలు వేయించాడు.
సమాధి గుంతను తవ్వించాడు. దూరప్రాంతం నుంచి వచ్చే బంధువులకు భోజన ఏర్పాట్లు కూడా చేయించాడు. ఉదయం 9 గంటలకు జయచంద్ర మృతదేహం ఇంటి వద్దకు తీసుకువచ్చారు. విగత జీవుడుగా కుమారుడు కనిపించగానే వెంకటరమణ దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు. ‘ఏమిరా నాయనా.. నాకు మట్టిపోయాల్సిన నీవు నా కళ్లముందరే వె ళ్లిపోయావా...’ అంటూ ఒక్కసారిగా మృతదేహం వద్దే కుప్పకూలిపోయాడు. సోమ్ముసిల్లి పడిపోయి ఉంటాడని భావించిన స్థానికులు, కుటుంబ సభ్యులు సపర్యలు చేశారు. ఎంతకూ లేవకపోవడంతో శంకరాపురంలోని వైద్యుడిని పిలిపించారు. ఆయన పరీక్షించి అప్పటికే మృతి చెందినట్టు ధ్రువీకరించారు. ఈ సంఘటనతో బీరంగిలో విషాదం అలుముకొంది. త ండ్రీకొడుకుల మృతదేహాలను రెండు పాడెలపై తీసుకెళ్తుండగా గ్రామస్తులు కన్నీరుమున్నీరయ్యారు. ఇద్దరికీ ఒకేచోట అంత్యక్రియలు నిర్వహించారు.