Jaya Chandra
-
జయచంద్రనాయుడి నుంచి మా కుటుంబాన్ని కాపాడండి
కావలి: తెలుగుదేశం పార్టీ మహిళా ఉపాధ్యక్షురాలి సోదరుడు జయచంద్రనాయుడు నుంచి తన కుటుంబానికి రక్షణ కల్పించి, తనకు రావాల్సిన డబ్బులు ఇప్పించాలని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి మండలం ఒట్టూరుకి చెందిన ఆక్వారైతు కుటుంబం వేడుకుంది. కావలిలోని ఎమ్మెల్యే కార్యాలయంలో గురువారం ఆక్వారైతు నారాయణ, ఆయన భార్య, కుమార్తెలు విలేకరులతో మాట్లాడారు. రొయ్యల సాగుకోసం జయచంద్రనాయుడు వద్ద రూ.34 లక్షలకు రొయ్యపిల్లలు, మేత, రసాయనాలు తీసుకున్నామని చెప్పారు. నాలుగేళ్లుగా తమ కుటుంబానికి చెందిన 15 ఎకరాల్లో సాగుచేస్తున్న రొయ్యల పంట మొత్తం జయచంద్రనాయుడు తీసుకుంటున్నాడన్నారు. ఇప్పటివరకు రూ.5 కోట్లకుపైగా విలువ చేసే రొయ్యలు తీసుకున్న జయచంద్రనాయుడు ఇంకా తాము బాకీ ఉన్నట్లు నిత్యం వేధిస్తున్నాడని విలపించారు. ఇప్పటివరకు చెల్లించిన డబ్బులు లెక్కలు చూస్తే తమకే జయచంద్రనాయుడు బాకీ ఉన్నాడన్నారు. ఇప్పుడు తమ పొలాలను స్వాధీనం చేసుకోవడానికి తమను చంపిస్తామని బెదిరిస్తున్నాడని చెప్పారు. జయచంద్రనాయుడు తాగుబోతులను ఉసిగొలిపి తమ కుమార్తెలను అల్లరి చేయిస్తూ, మాటలతో వేధిస్తున్నారని, తమపై నిత్యం దౌర్జన్యం చేస్తూ అరాచకంగా ప్రవర్తిస్తున్నాడని వాపోయారు. రొయ్యల గుంతకు విద్యుత్ సరఫరా నిలిపేసి అక్కడ పనిచేసేవారిని బెదిరించి వెళ్లగొట్టాడని చెప్పారు. జయచంద్రనాయుడు దొంగ లెక్కలు రాసిన విషయాన్ని తాము ప్రశ్నిస్తే అహంకారంతో చెలరేగిపోతున్నాడన్నారు. ఈ విషయాన్ని కావలి వచ్చిన లోకేశ్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదన్నారు. -
కుగ్రామం నుంచి సుప్రీం స్థాయికి..
వైఎస్ఆర్ జిల్లా, రాయచోటి: అత్యున్నత న్యాయస్థాన పదవులను అలంకరించి విశేష సేవలందించిన జస్టిస్ కామిరెడ్డి జయచంద్రారెడ్డి ఇక లేరనే వార్త ఆయన జన్మించిన తిమ్మసముద్రాన్ని విషాదంలో ముంచింది. సాధారణ పల్లెలో జన్మించి సుప్రీం కోర్టు జడ్జి..లా కమిషను చైర్మను లాంటి పదవులలో పనిచేసిన ఈ న్యాయశాస్త్ర కోవిదుడు ఆదివారం సాయంత్రం బెంగళూరులో తుదిశ్వాస విడిచారు. సుండుపల్లి మండలం తిమ్మసముద్రం గ్రామం వండ్లపల్లెకు చెందిన కామిరెడ్డి క్రిష్ణారెడ్డి– చెన్నమ్మల సంతానం ఈయన. 1929 జులై 15వ తేదిన జన్మించారు. జయచంద్రారెడ్డికి భార్య సరోజని, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ప్రాథమిక విద్య మదనపల్లె, రాయచోటిలలో సాగింది. ఇప్పటి చెన్నై(నాటి మద్రాసు)లో న్యాయశాస్త్రం అభ్యసించారు. జయచంద్రారెడ్డి అంత్యక్రియలు మంగళవారం బెంగుళూరులో జరుగుతాయని బంధువులు తెలిపారు. ఆయన కన్నుమూశారనే సమాచారం తెలిసి ఆదివారం రాత్రి తిమ్మసముద్రంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఉన్నత హోదా లో ఉన్నా కన్న ఊరి అభివృద్ధికి ఆయన పరితపించేవారని స్థానికులు ఈ సందర్భంగా గుర్తు్త చేసుకుంటూ కన్నీరు పెడుతున్నారు. సుండుపల్లితో పాటు రాయచోటి, కడప కేంద్రాల్లోని కోర్టులతో ఆయనకు సంబంధాలున్నాయి. సుండుపల్లి మండలంలో విద్యాభివృద్ధిలో ఈయన మార్కు కనిపిస్తుందని సీనియర్ న్యాయవాదులు చెప్పారు. జయచంద్రారెడ్డిని ఆదర్శంగా తీసుకున్న అనేకమంది చదువుబాట పట్టారు. వీరిలో కొందరు న్యాయవాదులుగా ను, ఐఏఎస్‌లు, పోలీసు శాఖలలో అత్యున్నత స్థానాల్లో ఉన్నారని గ్రామస్తులు చెప్పారు. జయ చంద్రారెడ్డి మృతికి రాయచోటి బార్ అసోసియేషన్ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసింది. ఆదివారం రాత్రి బార్ అసొసియేషన్ అధ్యక్షులు నాగిరెడ్డి, కార్యదర్శి రెడ్డెప్పరెడ్డి, ఇతర న్యాయవాదులు ఒక ప్రకటన విడుదల చేశారు. దివంగత వైఎస్సార్‌తో అనుబందం.. జస్టీస్ కె.జయచంద్రారెడ్డితో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి విడదీయరాని అనుబంధం ఉండేది. సుండుపల్లికు చెందిన స్వాతంత్య్ర సమర యోధులు యర్రపురెడ్డి ఆదినారాయణరెడ్డితో మంచి సంబంధాలుండేవి. అత్యున్నత పదవులలో ఉన్నా వీరిని మర్యాదపూర్వకంగా కలిసేవారు. -
జస్టిస్ జయచంద్రారెడ్డి కన్నుమూత
రాయచోటి/అమరావతి: న్యాయకోవిదుడు, సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కామిరెడ్డి జయచంద్రారెడ్డి (90) ఆదివారం సాయంత్రం కన్నుమూశారు. బెంగళూరులోని తన స్వగృహంలో ఆయన తుదిశ్వాస విడిచినట్లు బంధువులు తెలిపారు. పదవీ విరమణ అనంతరం ఆయన శేష జీవితాన్ని అక్కడే గడుపుతున్నారు. కుమారుడు చనిపోవడంతో కోడలు, మనవళ్లతో బెంగళూరులో విశ్రాంత జీవితం గడుపుతున్న జస్టిస్ జయచంద్రరెడ్డి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన అంత్యక్రియలు మంగళవారం బెంగళూరులోనే నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మదనపల్లె, రాయచోటి ప్రాంతాల్లో ప్రాథమిక, ఇంటర్మీడియట్ విద్యను అభ్యసించిన ఆయన మద్రాసు లా కళాశాలలో న్యాయశాస్త్రంలో పట్టాను అందుకున్నారు. తర్వాత మద్రాసు హైకోర్టులో క్రిమినల్ న్యాయవాదిగా వృత్తిని చేపట్టి అంచలంచెలుగా ఎదిగారు. కడప జిల్లా కుగ్రామంలో జననం వైఎస్సార్ జిల్లా సుండుపల్లి మండలం తిమ్మసముద్రం గ్రామం వండ్లపల్లెకు చెందిన కామిరెడ్డి క్రిష్ణారెడ్డి, చెన్నమ్మ దంపతులకు జయచంద్రారెడ్డి 1929లో జన్మించారు. ఈయనకు భార్య సరోజని, కుమారుడు, కుమార్తె ఉన్నారు. న్యాయవ్యవస్థలో మార్పులకు శ్రీకారం దేశంలోని పలువురు న్యాయకోవిదులతో కలిసి జయచంద్రారెడ్డి అనేక మార్పులకు నాంది పలికారు. ముఖ్యమైన కేసుల విషయంలో ప్రభుత్వాలకు, న్యాయాధిపతులకు ఆయన సలహాలు, సూచనలను అందించేవారు. ఉమ్మడి ఏపీ స్టేట్ లీగల్ బోర్డు చైర్మన్‌గా, అడ్వయిజర్‌గా సేవలందించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా, లా కమిషన్ చైర్మన్‌గా, లా కమిషన్ ఇండియన్ కౌన్సెలర్‌గా.. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్‌గా ఆయన పలు కీలక పదవులు నిర్వహించారు. అంతర్జాతీయ స్థాయిలో యుగోస్లోవియా, రువాండ దేశాలతో జరిపిన న్యాయపరమైన కార్యక్రమాలను సమర్ధవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీ, జస్టిస్ పీఎన్ భగవతిల నుంచి అవార్డులను అందుకున్నారు. ప్రస్థానం ఇలా.. - 1951లో మద్రాసు లా కళాశాలలో న్యాయశాస్త్రంలో పట్టాను పొందారు. - 1952లో మద్రాసు హైకోర్టులో సీనియర్ న్యాయవాది బసిరెడ్డి దగ్గర క్రిమినల్ లాయర్‌గా ఆయన న్యాయవాద ప్రస్థానాన్ని ప్రారంభించారు. - 1956లో ఆంధ్ర రాష్ట్ర విభజన అనంతరం హైదరాబాదుకు మకాం మార్చి హైకోర్టు న్యాయవాదిగా కొనసాగారు. - 1956లోనే హైకోర్టు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్) పనిచేశారు. - 1965–70లలో హైకోర్టు ప్రిన్సిపల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా కొనసాగారు. - 1975లో అడిషనల్ హైకోర్టు న్యాయమూర్తిగా ఎంపికైన ఆయన అనేక హోదాలలో పనిచేస్తూ 1976లో పర్మినెంట్ న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. - 1979–80లలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎంపికై అనేక హోదాల్లో పనిచేశారు. - 1995–97 14వ లా కమిషన్ చైర్మన్‌గా బాధ్యతలను నిర్వర్తించారు. - 2001–2005 వరకు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్‌గా ఆయన సేవలను అందించారు. -
ఐదు రూపాయల డాక్టర్ ఇకలేరు
చెన్నై , టీ.నగర్: ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కేవలం ఐదు రూపాయలకే వైద్య చికిత్సలందిస్తూ వచ్చిన డాక్టర్ జయచంద్రన్ (71) బుధవారం కన్నుమూశారు. చెన్నై వాషర్‌మెన్‌పేటలో డాక్టర్ జయచంద్రన్ అంటే ఎవరికీ తెలియదు. ఐదు రూపాయల డాక్టర్ అంటే ప్రజలందరికీ సుపరిచితులు. ఆ స్థాయికి ప్రజల మన్ననలందుకున్న డాక్టర్ జయచంద్రన్ అనారోగ్యంతో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. ఆయన మృతదేహాన్ని ఓల్డ్ వాషర్‌మెన్‌పేట వెంకటేశన్ వీధిలోగల ఆయన స్వగృహంలో ఉంచారు. ఆయన కుమార్తె శరణ్య స్థానిక స్టాన్లీ ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్‌గా పనిచేస్తున్నారు. కుమారుడు శరత్ ఓమందూరర్ ప్రభుత్వ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి వైద్యునిగాను, మరో కుమారుడు శరవణన్ ప్రైవేటు ఆస్పత్రిలో డాక్టర్‌గా పనిచేస్తున్నారు. జయచంద్రన్ భార్య డాక్టర్ వేణి ప్రసూతి వైద్య నిపుణురాలు. చెన్నై ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో డీన్‌గా పనిచేసి పదవీ విరమణ చేశారు. మొత్తం కుటుంబం వైద్య రంగంలో పేరు గడించింది. వైద్యం వృత్తికాదని, అది సేవాభావంతో కూడుకున్నదనే విషయాన్ని విశ్వసించే జయచంద్రన్ తుదిశ్వాస వరకూ వైద్య వృత్తిలోనే తరించారు. వైద్య సేవకు గుర్తింపు: డాక్టర్ జయచంద్రన్ సొంతవూరు కాంచీపురం జిల్లా కొడైపట్టణం గ్రామం. 1947లో జన్మించిన జయచంద్రన్ పాఠశాల విద్య పూర్తికాగానే చెన్నై మెడికల్ కళాశాల్లో చదివి ఎంబీబీఎస్ పట్టా అందుకున్నారు. ఆయన ప్రభుత్వ ఉద్యోగం చేసేందుకు ఇష్టపడక ప్రజలకు సేవ చేయాలనే ఉద్ధేశంతో చిన్న క్లినిక్ ప్రారంభించారు. తన వద్దకు చికిత్స కోసం వచ్చే వారి వద్ద ప్రారంభంలో కేవలం రెండు రూపాయల ఫీజు మాత్రమే తీసుకునేవారు. అది కూడా అక్కడున్న హుండీలో వేయమని చెప్పేవారు. ఆయనే స్వయంగా ఇంజెక్షన్లు, మాత్రలు అందజేసేవారు. ఒకటి, రెండు రూపాయలకు విలువ లేకపోవడంతో రోగులు బలవంతపెట్టడంతో రూ.5 ఫీజు తీసుకునేవారు. తన చివరి శ్వాస వరకు ఇదే ఫీజుతో సరిపెట్టుకున్న మహా వ్యక్తి. ఆయన వైద్య సేవలకు కుటుంబం ఎంతగానో సహకరించింది. ఆయన క్లినిక్ ఎప్పుడూ జనంతో రద్దీగా కనిపిస్తుంది. పేద, సామాన్య ప్రజలే ఇక్కడికి వచ్చి చికిత్స పొందుతుంటారు. కన్నీటి నివాళి: డాక్టర్ జయచంద్రన్ మరణవార్త తెలియగానే అనేక మంది పేద ప్రజలు కన్నీటి పర్యంతమయ్యారు. శోకాతప్త హృదయాలతో కుటుంబాలతో సహా ఆయన ఇంటికి చేరుకుని నివాళులర్పిస్తున్నారు. -
నాయనా..నేనూ వస్తున్నా..
తనయుడి మృతితో తల్లడిల్లిన తండ్రి విగతజీవిగా బిడ్డను చూసి ఆగిన గుండె తండ్రీకొడుకుల శవయాత్రతో ఘొల్లుమన్న బీరంగి కన్నకొడుకు మరణవార్త అందుకున్న తండ్రి ఇంటిముందు షామియానా వేయించాడు. సమాధి గుంత తవ్వించాడు. అంత్యక్రియలకు వచ్చే బంధువుల కోసం భోజనాలు సిద్ధం చేయించాడు. కొడుకు మృతదేహం ఇంటికి రాగానే ‘ఏమిరా నాయనా.. నాకు మట్టిపోయాల్సిన నీవే వెళ్లిపోయావా.. అంటూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అంతే కొడుకు శవం పక్కనే తానూ శవంగా మారాడు. గంటల వ్యవధిలోనే తండ్రీకొడుకులు మృతి చెందడంతో బి.కొత్తకోట మండలం బీరంగి విషాదంలో మునిగిపోయింది. బి.కొత్తకోట: బీరంగికి చెందిన సీహెచ్ చిన్న వెంకటరమణ(65)కు ఇద్దరు భార్యలు, ముగ్గురు కుమారులు ఉన్నారు. మొదటి భార్య రెండో కుమారుడు చాకల జయచంద్ర(35)కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇతడు ఏడాదిగా బెంగళూరులో కులవృత్తి చేసుకునేవాడు. గత నెలలో బీరంగికి తిరిగి వచ్చేశాడు. కడుపు నొప్పి రావడంతో వారం క్రితం బెంగళూరులో వైద్యం చేయించుకున్నాడు. శనివారం మళ్లీ నొప్పి రావడంతో మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి వెళ్లాడు. అక్కడి వైద్యులు తిరుపతి రుయాకు తరలించారు. చికిత్సపొందుతూ జయచంద్ర సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు మృతిచెందాడు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు జయచంద్ర తండ్రి చిన్న వెంకటరమణకు ఫోన్‌ద్వారా సమాచారం ఇచ్చారు. దీంతో షాకయ్యాడు. కుమారుడు లేడనే నిజాన్ని జీర్ణించుకోలేకపోయాడు. కాస్సేపటికి తేరుకుని అంత్యక్రియలకు ఏర్పాటుచేశాడు. ఇంటిముందు షామియానాలు వేయించాడు. సమాధి గుంతను తవ్వించాడు. దూరప్రాంతం నుంచి వచ్చే బంధువులకు భోజన ఏర్పాట్లు కూడా చేయించాడు. ఉదయం 9 గంటలకు జయచంద్ర మృతదేహం ఇంటి వద్దకు తీసుకువచ్చారు. విగత జీవుడుగా కుమారుడు కనిపించగానే వెంకటరమణ దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు. ‘ఏమిరా నాయనా.. నాకు మట్టిపోయాల్సిన నీవు నా కళ్లముందరే వె ళ్లిపోయావా...’ అంటూ ఒక్కసారిగా మృతదేహం వద్దే కుప్పకూలిపోయాడు. సోమ్ముసిల్లి పడిపోయి ఉంటాడని భావించిన స్థానికులు, కుటుంబ సభ్యులు సపర్యలు చేశారు. ఎంతకూ లేవకపోవడంతో శంకరాపురంలోని వైద్యుడిని పిలిపించారు. ఆయన పరీక్షించి అప్పటికే మృతి చెందినట్టు ధ్రువీకరించారు. ఈ సంఘటనతో బీరంగిలో విషాదం అలుముకొంది. త ండ్రీకొడుకుల మృతదేహాలను రెండు పాడెలపై తీసుకెళ్తుండగా గ్రామస్తులు కన్నీరుమున్నీరయ్యారు. ఇద్దరికీ ఒకేచోట అంత్యక్రియలు నిర్వహించారు. -
మంత్రి కళాశాలపై సమాచారం ఇవ్వడం లేదు..
ఆర్టీఐ సమావేశాలు నిర్వహించడం లేదు సమాచారం అడిగినందుకు కుల సర్టిఫికెట్స్ ఇవ్వడం లేదు అడిగితే ముఖ్యమంత్రికి చెప్పుకోమంటున్నారు ఆర్టీఐ కమిషనర్‌కు ఫిర్యాదుల వెల్లువ తిరుపతి కార్పొరేషన్ రాష్ట్ర మంత్రి నారాయణకు సం బంధించిన కళాశాలల గురించి సమాచా రం అడిగితే ఇవ్వడం లేదని సీపీఎం జయచంద్ర రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్ పి.విజయబాబుకు ఫిర్యాదు చేశా రు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం, వైఎస్ఆర్ సమావేశ మం దిరంలో రాయలసీమ పరిధిలోని సమాచార హక్కు చట్టం కింద కేసులను విచారించారు. పలువురు నేరుగా కమిషనర్ వద్దకు చేరుకుని ఆర్టీఐ ద్వారా తమకు సమాచారం అందడం లేదంటూ ఫిర్యా దు చేశారు. సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్.జయచంద్ర మాట్లాడుతూ గిరిజన, వెనుకబడిన తరగతుల స్కాలర్షిప్స్, ఫీజు రీయంబర్స్మెంట్ వివరాలు ఇవ్వాలని నవంబర్‌లో కలెక్టరేట్ కార్యాల యంలో దరఖాస్తు చేసానన్నారు. రెండు నెలలు అవుతున్నా ఇంతవరకు సమాచారం ఇవ్వకపోగా ఉపయోగం లేని సమాచారం ఇస్తూ అవినీతి ని ప్రోత్సహిస్తున్నారని ఫిర్యాదు చేశారు. శ్రీకాళహస్తి ప్రభుత్వ బాలుర, బాలికల డిగ్రీ కళాశాలలో సమాచారం కోరితే 46 రోజులు గడుస్తున్నా ఇవ్వడం లేదన్నా రు. రెవెన్యూ పరమైన సమాచారం ఇవ్వ డం లేదని, దీనికి భాద్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. కమిషనర్ స్పందిస్తూ మీకు సమాచారం అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కుల సర్టిఫికెట్స్ ఇవ్వడం లేదు.. తిరుపతిలో తనకు బట్రాజు (బిసి-డి) కుల సర్టిఫికెట్ ఇవ్వకుండా అవమాని స్తున్నారంటూ లేపాక్షి ఈశ్వర్‌రాజు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. గతం లో పీలేరులో రెవెన్యూ పరమైన సమాచారం అడిగితే ఇవ్వనందుకు ఆర్టీఐ కమిషన్‌కు ఫిర్యాదు చేశానని, దాన్ని దృష్టిలో ఉంచుకుని తిరుపతి రూరల్ తహవీల్దార్ యుగంధర్ సర్టిఫికెట్ ఇవ్వ డం లేదని ఆరోపించారు. పైగా సిఎంకు చెప్పుకో, జేడీ లక్ష్మీనారాయణకు చెప్పు కో అంటూ వెటకారంగా మాట్లాడుతున్నారని తెలిపారు. ఫలితంగా తన పిల్ల లు ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఆటంకం కలిగిస్తున్నారని ఫిర్యాదు చేశారు. సంబంధం లేని సమాచారం ఇస్తున్నారు గతంలో ఆర్టిఐ కమిషనర్ తాంతియాకుమారి నిర్వహించిన విచారణ, జరిమా నా విధింపు, జారీ చేసిన నోటీసుల వివరాలను ఆర్టిఐ సెక్షన్ 4(1)బి కింద సమాచారం అడిగితే సంబంధం లేని సమాచారం ఇచ్చారంటూ సమాచార హక్కు చట్టం ఉద్యమకారుడు భాస్కర్ ఫిర్యాదు చేశారు. కమిషనరే స్వయంగా సమాచారం ఇవ్వాలని ఆదేశించినా జిల్లాలో ఆదేశాలు అమలు చేయడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. -
గాడ్సేకంటే మోడీ ప్రమాదకరం
యూపీఏ పాలనలో భారత్ ప్రపంచంలోనే అగ్రగామి జిల్లా ఇన్చార్జ మంత్రి జయచంద్ర పావగడ,న్యూస్‌లైన్ : మహాత్మాగాంధీని పొట్టనబెట్టుకున్న నాచూరాంగాడ్సేకంటే బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ ప్రమాదకర వ్యక్తి అని జిల్లా ఇన్చార్జ్ మంత్రి జయచంద్ర ఆరోపించారు. పట్టణంలోని ఎస్ఎస్కే బయలురంగమందిరంలో శుక్రవారం ఏర్పాటుచేసిన కాంగ్రెస్ ఎన్నికల ప్రచారసభలో ఆయన మాట్లాడారు. ఆర్ఎస్ఎస్ ముసుగులో నరేంద్రమోడీ దేశ విచ్ఛినకర శక్తిగా మారారని దుయ్యబట్టారు. యూపీఏ పాలనలో భారత్ ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచిందన్నారు. ఉపాధిహామీపథకం, ఆహారభద్రత పథకాలతో పేదలకు ఊరటనిచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని ఆయన కొనియాడారు. చిత్రదుర్గం లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థి చంద్రప్పను అత్యధికమెజార్టీతో గెలిపించి రాహుల్‌గాంధీని ప్రధానమంత్రిని చేయడానికి తోడ్పడాలని ఓటర్లకు విన్నవించారు. సాంఘిక సంక్షేమశాఖ మంత్రి ఆంజినేయులు మాట్లాడుతూ మోడీని పీఎం చేస్తే దేశం అల్లకల్లోలమవుతుందన్నారు. అన్ని జాతులను కలుపుకునిపోయేది కేవలం కాంగ్రెస్ పార్టీ అని కొనియాడారు. మధుగిరి ఎమ్మెల్యే కేఎన్ రాజన్న మాట్లాడుతూ ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రవేశపెట్టిన కిలోరూపాయి బియ్యం, అన్నభాగ్య, క్షీరభాగ్య తదితర పథకాలు కాంగ్రెస్‌పార్టీని గెలిపిస్తాయన్నారు. స్థానిక మాజీ మంత్రి వెంకటరమణప్ప మాట్లాడుతూ లక్‌సభ ఎన్నికల్లో చిత్రదుర్గం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చంద్రప్పను గెలిపించడానికి స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నిర్విరామంగా కృషిచేయాలని కోరారు.కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సోమ్లానాయక్, మానం వెంకటస్వామి, జీఎస్ ధర్మపాల్, సుధేష్బాబు, జడ్పీసభ్యుడు వెంకటేష్, మైలారరెడ్డి, రాజేష్, శేషగిరి, నాగార్జునరెడ్డి తదితర వందలాది మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.