- యూపీఏ పాలనలో భారత్ ప్రపంచంలోనే అగ్రగామి
- జిల్లా ఇన్‌చార్‌జ మంత్రి జయచంద్ర
పావగడ,న్యూస్‌లైన్ : మహాత్మాగాంధీని పొట్టనబెట్టుకున్న నాచూరాంగాడ్సేకంటే బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ ప్రమాదకర వ్యక్తి అని జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి జయచంద్ర ఆరోపించారు. పట్టణంలోని ఎస్‌ఎస్‌కే బయలురంగమందిరంలో శుక్రవారం ఏర్పాటుచేసిన కాంగ్రెస్ ఎన్నికల ప్రచారసభలో ఆయన మాట్లాడారు. ఆర్‌ఎస్‌ఎస్ ముసుగులో నరేంద్రమోడీ దేశ విచ్ఛినకర శక్తిగా మారారని దుయ్యబట్టారు. యూపీఏ పాలనలో భారత్ ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచిందన్నారు.
ఉపాధిహామీపథకం, ఆహారభద్రత పథకాలతో పేదలకు ఊరటనిచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని ఆయన కొనియాడారు. చిత్రదుర్గం లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థి చంద్రప్పను అత్యధికమెజార్టీతో గెలిపించి రాహుల్‌గాంధీని ప్రధానమంత్రిని చేయడానికి తోడ్పడాలని ఓటర్లకు విన్నవించారు. సాంఘిక సంక్షేమశాఖ మంత్రి ఆంజినేయులు మాట్లాడుతూ మోడీని పీఎం చేస్తే దేశం అల్లకల్లోలమవుతుందన్నారు.
అన్ని జాతులను కలుపుకునిపోయేది కేవలం కాంగ్రెస్ పార్టీ అని కొనియాడారు. మధుగిరి ఎమ్మెల్యే కేఎన్ రాజన్న మాట్లాడుతూ ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రవేశపెట్టిన కిలోరూపాయి బియ్యం, అన్నభాగ్య, క్షీరభాగ్య తదితర పథకాలు కాంగ్రెస్‌పార్టీని గెలిపిస్తాయన్నారు. స్థానిక మాజీ మంత్రి వెంకటరమణప్ప మాట్లాడుతూ లక్‌సభ ఎన్నికల్లో చిత్రదుర్గం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చంద్రప్పను గెలిపించడానికి స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నిర్విరామంగా కృషిచేయాలని కోరారు.కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సోమ్లానాయక్, మానం వెంకటస్వామి, జీఎస్ ధర్మపాల్, సుధేష్‌బాబు, జడ్పీసభ్యుడు వెంకటేష్, మైలారరెడ్డి, రాజేష్, శేషగిరి, నాగార్జునరెడ్డి తదితర వందలాది మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.