
జయచంద్రన్ (ఫైల్)
40 ఏళ్లుగా వైద్యసేవలు ప్రజల కన్నీటి నివాళి
చెన్నై , టీ.నగర్: ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కేవలం ఐదు రూపాయలకే వైద్య చికిత్సలందిస్తూ వచ్చిన డాక్టర్ జయచంద్రన్ (71) బుధవారం కన్నుమూశారు. చెన్నై వాషర్‌మెన్‌పేటలో డాక్టర్ జయచంద్రన్ అంటే ఎవరికీ తెలియదు. ఐదు రూపాయల డాక్టర్ అంటే ప్రజలందరికీ సుపరిచితులు. ఆ స్థాయికి ప్రజల మన్ననలందుకున్న డాక్టర్ జయచంద్రన్ అనారోగ్యంతో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. ఆయన మృతదేహాన్ని ఓల్డ్ వాషర్‌మెన్‌పేట వెంకటేశన్ వీధిలోగల ఆయన స్వగృహంలో ఉంచారు. ఆయన కుమార్తె శరణ్య స్థానిక స్టాన్లీ ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్‌గా పనిచేస్తున్నారు. కుమారుడు శరత్ ఓమందూరర్ ప్రభుత్వ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి వైద్యునిగాను, మరో కుమారుడు శరవణన్ ప్రైవేటు ఆస్పత్రిలో డాక్టర్‌గా పనిచేస్తున్నారు. జయచంద్రన్ భార్య డాక్టర్ వేణి ప్రసూతి వైద్య నిపుణురాలు. చెన్నై ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో డీన్‌గా పనిచేసి పదవీ విరమణ చేశారు. మొత్తం కుటుంబం వైద్య రంగంలో పేరు గడించింది. వైద్యం వృత్తికాదని, అది సేవాభావంతో కూడుకున్నదనే విషయాన్ని విశ్వసించే జయచంద్రన్ తుదిశ్వాస వరకూ వైద్య వృత్తిలోనే తరించారు.
వైద్య సేవకు గుర్తింపు: డాక్టర్ జయచంద్రన్ సొంతవూరు కాంచీపురం జిల్లా కొడైపట్టణం గ్రామం. 1947లో జన్మించిన జయచంద్రన్ పాఠశాల విద్య పూర్తికాగానే చెన్నై మెడికల్ కళాశాల్లో చదివి ఎంబీబీఎస్ పట్టా అందుకున్నారు. ఆయన ప్రభుత్వ ఉద్యోగం చేసేందుకు ఇష్టపడక ప్రజలకు సేవ చేయాలనే ఉద్ధేశంతో చిన్న క్లినిక్ ప్రారంభించారు. తన వద్దకు చికిత్స కోసం వచ్చే వారి వద్ద ప్రారంభంలో కేవలం రెండు రూపాయల ఫీజు మాత్రమే తీసుకునేవారు. అది కూడా అక్కడున్న హుండీలో వేయమని చెప్పేవారు. ఆయనే స్వయంగా ఇంజెక్షన్లు, మాత్రలు అందజేసేవారు. ఒకటి, రెండు రూపాయలకు విలువ లేకపోవడంతో రోగులు బలవంతపెట్టడంతో రూ.5 ఫీజు తీసుకునేవారు. తన చివరి శ్వాస వరకు ఇదే ఫీజుతో సరిపెట్టుకున్న మహా వ్యక్తి. ఆయన వైద్య సేవలకు కుటుంబం ఎంతగానో సహకరించింది. ఆయన క్లినిక్ ఎప్పుడూ జనంతో రద్దీగా కనిపిస్తుంది. పేద, సామాన్య ప్రజలే ఇక్కడికి వచ్చి చికిత్స పొందుతుంటారు.
కన్నీటి నివాళి: డాక్టర్ జయచంద్రన్ మరణవార్త తెలియగానే అనేక మంది పేద ప్రజలు కన్నీటి పర్యంతమయ్యారు. శోకాతప్త హృదయాలతో కుటుంబాలతో సహా ఆయన ఇంటికి చేరుకుని నివాళులర్పిస్తున్నారు.