five rupees
-
చిన్నారి ఉసురుతీసిన ఐదు రూపాయల కాయిన్..
నల్గొండ (భూదాన్‌పోచంపల్లి) : ఐదు రూపాయల నాణెం ఓ చిన్నారి ప్రాణం తీసింది. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి పట్టణంలోని వెంకటరమణ కాలనీకి చెందిన బొంగు మహేశ్, సరిత దంపతులకు ఇద్దరు కుమార్తెలు. వారిలో చిన్నకుమార్తె చైత్ర(4) వారం రోజుల క్రితం ఇంటివద్ద ఆడుకొంటూ ఐదు కాయిన్ మింగగా, అది గొంతులో ఇరుక్కొంది. వెంటనే గమనించిన తల్లిదండ్రులు హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా డాక్టర్లు చికిత్స చేసి కాయిన్ తొలగించారు. అనంతరం ఇంటికి పంపించారు. అయితే, సోమవారం చైత్ర తీవ్ర అస్వస్థతకు గురై శ్వాసతీసుకోవడానికి ఇబ్బంది పడుతుండగా వెంటనే తల్లిదండ్రులు హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. ఐదు రూపాయల కాయిన్ గొంతులో ఇరుక్కోవడం వల్ల ఇన్ఫెక్షన్ అయి చిన్నారి మృతి చెందిందని స్థానికులు పేర్కొంటున్నారు. కంటికి రెప్పలా సాకుకొంటున్న చిన్నారి అర్థాంతరంగా తనువు చాలించడంతో ఆ కుటుంబం పెను విషాదంలో అలుముకొంది. -
కరోనా రాకముందు 5 రూ... ఇప్పుడు ఫ్రీ!
-
5 రూపాయల డాక్టర్ ఇకలేరు
సాక్షి, చెన్నై: ఉత్తర చెన్నై పరిధిలో 5 రూపాయల డాక్టరుగా పేరుగడించిన తిరువేంగడం గుండెపోటుతో మృతిచెందారు. ఎంత రాత్రి వేళైనా సరే తన ఇంటి తలుపు తట్టే పేదోడికి వైద్యం అందించే ఈ డాకర్ ఇక లేరన్న సమాచారంతో సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీరుసెల్వం, ప్రతి పక్ష నేత ఎంకే స్టాలిన్ దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన కుటుంబానికి తమ సానుభూతి తెలియజేశారు. ఉత్తర చెన్నై పరిధిలోని వ్యాసార్పాడి ఎరుకంచ్చేరి వి కల్యాణపురంలో పేదల వైద్యుడిగా 45 ఏళ్ల పాటు తిరువేంగడం(70) సేవల్ని అందిస్తున్నారు. ఎవరైనా రూ. 5 డాక్టర్ అడ్రస్ అడిగితే చాలు దారి చూపించే వాళ్లు ఆ పరిసరాల్లో ఎక్కువే. ఆ మేరకు తిరువేంగడం సుపరిచితులు. చిన్నతనం నుంచే డాక్టర్ కావాలన్న ఆశతో ప్రభుత్వ కళాశాలలో చదువుకుని, ప్రభుత్వ వైద్యుడిగా సేవల్ని అందించడమే కాకుండా, తన వద్దకు వచ్చే ప్రతి పేదోడికి ఉచితంగా వైద్యాన్ని దరి చేర్చిన ఘనత ఈ డాక్టర్‌కే దక్కుతుంది. తాను ఉచితంగానే చదువుకున్నట్టు, ఆ చదువుకు తగ్గ ఫలితంగా ఉచిత వైద్యం అందిస్తున్నట్టు పదేపదే ఆయన చెప్పుకొచ్చే వారు. ప్రభుత్వ వైద్యుడిగా పదవీ విరమణ అనంతరం పూర్తి స్థాయిలో పేదల సేవకు నిమగ్నమయ్యారు. రోగుల ఒత్తిడి మేరకు తొలుత రూ. 2. ఆ తర్వాత రూ. 5 ఫీజు తీసుకోవాల్సిన పరిస్థితి. ఈ మొత్తాన్ని కూడా మందులు కొనుగోలు చేయలేని పేదలకు ఖర్చు పెట్టే వారు. కేన్సర్‌తో బాధపడే పేద రోగులకు తనవంతుగా సహకారాన్ని అందించారు. 45 ఏళ్లుగా ఉత్తర చెన్నై వాసులకు అవిశ్రాంతంగా సేవల్ని అందించిన డాక్టరు తిరువేంగడం శాశ్వత విశ్రాంతిలోకి వెళ్లారు. గుండెపోటుతో మృతి.. డాక్టర్ తిరువేంగడంకు భార్య సరస్వతి, కుమార్తె ప్రీతి, కుమారుడు దీపక్ ఉన్నారు. కుటుంబసహకారంతోనే తాను పేదలకు వైద్యం అందించగలుతున్నట్టుగా చెప్పుకొచ్చే తిరువేంగడం కరోనా కాలంలో ఇంటికే పరిమితం అయ్యారు. ఫోన్ ద్వారా వైద్య సలహాలను అందిస్తూ వచ్చారు. ఈ పరిస్థితుల్లో 13వ తేదీ చాతినొప్పితో ఆస్పత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ తిరువేంగడం శనివారం మృతిచెందారు. ఈ సమాచారంతో సీఎం ఎడపాడి, డిప్యూటీ సీఎం పన్నీరు, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ దిగ్భాంతికి లోనయ్యారు. వేర్వేరుగా విడుదల చేసిన ప్రకటనల్లో ఆయన సేవల్ని గుర్తు చేస్తూ, కుటుంబానికి సానుభూతి తెలియజేశారు. ఆదివారం ఇంటి వద్ద ఉంచిన ఆయన భౌతికకాయానికి వైద్యం పొందిన పేదలు కడసారి చూసుకుని కన్నీటి పర్యంతం అయ్యారు. తన తండ్రి పేదల కోసం ఏర్పాటు చేసిన క్లినిక్‌ను ఎలా కొనసాగించే విషయాన్ని నిర్ణయాన్ని త్వరలో ప్రకటిస్తానని తిరువేంగడం కుమార్తె ప్రీతి పేర్కొన్నారు. ఆయన వద్ద 25 ఏళ్ల పాటుగా సహాయకుడిగా పనిచేసిన ఎస్ భూపాలన్ పేర్కొంటూ, అర్ధరాత్రి వరకు రోగులకు వైద్యం అందించే వారు అని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, 2017లో సూపర్ హిట్ కొట్టిన మెర్సెల్ చిత్రంలో ఈ రూ.5 డాక్టర్ ఇతివృత్తంతో ఉత్తర చెన్నై పరిధిలో దళపతి విజయ్సేవల్ని అందించే పాత్రను పోషించడం గమనార్హం. -
5 సార్లు ఎమ్మెల్యే అయినా.. రూ.5 భోజనమే
ముషీరాబాద్: ఒక్కసారి ఎమ్మెల్యే అయితేనే అతని జీవన విధానం మారిపోతుంది. షడ్రసోపేతమైన భోజనం..స్టార్ హోటల్‌కు తగ్గకుండా విలాసవంతమైన జీవనం వారి సొంతం అవుతుంది. అలాంటిది ఏకంగా 5 సార్లు ఎమ్మెల్యే అయితే..? ఆయన జీవన విధానం ఎలా ఉంటుందో ఉహించుకోవచ్చు. కానీ నీతి, నిజాయితీకి, సాదాసీదా జీవితానికి నిలువెత్తు నిదర్శమైన గుమ్మడి నర్సయ్య మంగళవారం బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య పార్కు వద్ద పేదల కోసం జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన 5 రూపాయల భోజనాన్ని ఆరగించడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. నర్సయ్య ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇల్లందు నియోజకవర్గం నుంచి 1983, 1985, 1989, 1999, 2004లో ఐదు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే ఆయన సైకిల్‌పై తిరగడం, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి ప్రజల మనిషిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఏకంగా జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన రూ.5 భోజనం తినడం ఆయన నిరాడంబరతకు నిదర్శనం అని చెప్పొచ్చు. -
ఐదు రూపాయల డాక్టర్ ఇకలేరు
చెన్నై , టీ.నగర్: ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కేవలం ఐదు రూపాయలకే వైద్య చికిత్సలందిస్తూ వచ్చిన డాక్టర్ జయచంద్రన్ (71) బుధవారం కన్నుమూశారు. చెన్నై వాషర్‌మెన్‌పేటలో డాక్టర్ జయచంద్రన్ అంటే ఎవరికీ తెలియదు. ఐదు రూపాయల డాక్టర్ అంటే ప్రజలందరికీ సుపరిచితులు. ఆ స్థాయికి ప్రజల మన్ననలందుకున్న డాక్టర్ జయచంద్రన్ అనారోగ్యంతో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. ఆయన మృతదేహాన్ని ఓల్డ్ వాషర్‌మెన్‌పేట వెంకటేశన్ వీధిలోగల ఆయన స్వగృహంలో ఉంచారు. ఆయన కుమార్తె శరణ్య స్థానిక స్టాన్లీ ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్‌గా పనిచేస్తున్నారు. కుమారుడు శరత్ ఓమందూరర్ ప్రభుత్వ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి వైద్యునిగాను, మరో కుమారుడు శరవణన్ ప్రైవేటు ఆస్పత్రిలో డాక్టర్‌గా పనిచేస్తున్నారు. జయచంద్రన్ భార్య డాక్టర్ వేణి ప్రసూతి వైద్య నిపుణురాలు. చెన్నై ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో డీన్‌గా పనిచేసి పదవీ విరమణ చేశారు. మొత్తం కుటుంబం వైద్య రంగంలో పేరు గడించింది. వైద్యం వృత్తికాదని, అది సేవాభావంతో కూడుకున్నదనే విషయాన్ని విశ్వసించే జయచంద్రన్ తుదిశ్వాస వరకూ వైద్య వృత్తిలోనే తరించారు. వైద్య సేవకు గుర్తింపు: డాక్టర్ జయచంద్రన్ సొంతవూరు కాంచీపురం జిల్లా కొడైపట్టణం గ్రామం. 1947లో జన్మించిన జయచంద్రన్ పాఠశాల విద్య పూర్తికాగానే చెన్నై మెడికల్ కళాశాల్లో చదివి ఎంబీబీఎస్ పట్టా అందుకున్నారు. ఆయన ప్రభుత్వ ఉద్యోగం చేసేందుకు ఇష్టపడక ప్రజలకు సేవ చేయాలనే ఉద్ధేశంతో చిన్న క్లినిక్ ప్రారంభించారు. తన వద్దకు చికిత్స కోసం వచ్చే వారి వద్ద ప్రారంభంలో కేవలం రెండు రూపాయల ఫీజు మాత్రమే తీసుకునేవారు. అది కూడా అక్కడున్న హుండీలో వేయమని చెప్పేవారు. ఆయనే స్వయంగా ఇంజెక్షన్లు, మాత్రలు అందజేసేవారు. ఒకటి, రెండు రూపాయలకు విలువ లేకపోవడంతో రోగులు బలవంతపెట్టడంతో రూ.5 ఫీజు తీసుకునేవారు. తన చివరి శ్వాస వరకు ఇదే ఫీజుతో సరిపెట్టుకున్న మహా వ్యక్తి. ఆయన వైద్య సేవలకు కుటుంబం ఎంతగానో సహకరించింది. ఆయన క్లినిక్ ఎప్పుడూ జనంతో రద్దీగా కనిపిస్తుంది. పేద, సామాన్య ప్రజలే ఇక్కడికి వచ్చి చికిత్స పొందుతుంటారు. కన్నీటి నివాళి: డాక్టర్ జయచంద్రన్ మరణవార్త తెలియగానే అనేక మంది పేద ప్రజలు కన్నీటి పర్యంతమయ్యారు. శోకాతప్త హృదయాలతో కుటుంబాలతో సహా ఆయన ఇంటికి చేరుకుని నివాళులర్పిస్తున్నారు. -
నిరుపేదలకు సద్దిమూట
తాండూరు : మున్సిపల్ శాఖ ఆధ్వర్యాన తాండూరు, వికారాబాద్‌లో నిరుపేదలు, అభాగ్యులకు కేవలం రూ.5కే భోజనం అందించేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. సింగిల్ చాయి ఖరీదు రూ.7 నుంచి రూ.10 ఉన్న ఈ సమయంలో పేదవాళ్ల ఆకలిబాధ తీర్చేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఎంత చిన్న హోటల్లో భోజనం చేయాలన్నా రూ.50 నుంచి రూ.70 వరకు ఖర్చు చేయాల్సిన తరుణంలో రూ.5కే భోజనం అందించేందుకు కార్యచరణ సిద్ధమవుతోంది. మున్సిపల్ శాఖ ద్వారా ప్రతి మున్సిపాలిటీలో రూ.5కే నాణ్యమైన భోజనం త్వరలో అందుబాటులోకి తీసుకువస్తామని మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఇటీవల ప్రకటించారు. రాష్ట్రంలోని 73 మున్సిపాలిటీల్లో ఈ సేవలు నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కార్యక్రమ సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు త్వరలోనే కౌన్సిల్ సభ్యులతో సమావేశం నిర్వహించనున్నారు. జిల్లాలోని తాండూరు, వికారాబాద్ మున్సిపాలిటీల్లో ఈ పథకం ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గ్రామీణ జిల్లా కావడంతో దీనికి పేదల నుంచి మంచి స్పందన వస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఫుల్ భోజనమే... మున్సిపల్ శాఖ ద్వారా మున్సిపాలిటీల్లో అమలు చేస్తున్న రూ.5 భోజనంలో అన్నం, కూరగాయలతో చేసిన కర్రీ, పప్పు, పచ్చడి, సాంబారు, మజ్జిగ, నీళ్ల ప్యాకెట్ అందిస్తారు. ప్రస్తుతం హోటల్, మెస్‌లలో ప్లేట్ భోజనం రూ.50 నుంచి రూ.80 పలుకుతోంది. మున్సిపల్ శాఖ ద్వారా అందించనున్న భోజనంతో వందలాది మంది కార్మికులు, రైతులు, పేద, మధ్య తరగతి ప్రజల కడుపు నిండనుంది. ‘సంపూర్ణ’ భోజనం.. రూ.15 తాండూరు పట్టణంలో సంపూర్ణ సంస్థ ఆధ్వర్యం లో 6 నెలలుగా రూ.15లకే భోజనం అందిస్తున్నారు. సంపూర్ణ సంస్థ తాండూరు పట్టణంలోని బస్టేషన్ ప్రాంగణంలో, వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డు, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి, ఇందిరాచౌక్‌ల వద్ద ఏర్పాటు చేసిన భోజన కేంద్రాలకు అనూహ్య స్పందన లభిస్తోంది. ప్రతీ రోజు 500 మందికి పైగా తాండూరు నియోజకవర్గంలోని ప్రజలే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. సంపూర్ణ సంస్థ అందిస్తున్న భోజనం కన్నా 100 శాతం నాణ్యతతో మున్సిపల్ శాఖ రూ.5కే భోజనం అందించేందుకు సిద్ధమవుతోంది. ఇదిలా ఉండగా పథకం అమలుతో మున్సిపాలిటీలకు అదనపు భారం తప్పదని అధికారులు చెబుతున్నారు. కౌన్సిల్ సభ్యులతో సమావేశం మున్సిపల్ శాఖ ద్వారా ప్రారంభించాలనుకుంటు న్న రూ.5 భోజనంపై.. త్వరలోనే మున్సిపల్ కౌ న్సిల్ సభ్యులతో సమావే శం నిర్వహిస్తాం. భోజనం నిర్వహణపై ఉన్న తాధికారుల నుంచి ఇంకా విధి విధానాలు అందలేదు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకం కావడంతో త్వరలోనే రూ.5 భోజనం అందించేలా ప్రణాళిక తయారు చేస్తున్నాం. – భోగీశ్వర్లు, మున్సిపల్ కమిషనర్, తాండూరు -
ఎన్నికల్లో ఐదు రూపాయల డాక్టర్
మండ్య: మండ్య నగరంలో ఐదు రూపాయల డాక్టర్‌గా ప్రసిద్ధి చెంది న డాక్టర్. ఎస్.సి. శంకరేగౌడ ఎన్నికల నాడిని పరీక్షిస్తున్నారు. సోమవారం ఆయన మండ్య స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశా రు. నగరంలోని బందీగౌడ లేఔట్లో ఉన్న నివాసం నుంచి కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి అక్కడ ఉన్న మహా పురుషుల విగ్రహాలకు పూలహారం వేసి నివాళులర్పించారు. తరువాత తాలూకా పంచాయతీ కార్యాలయానికి వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. రోగుల నుంచి కేవలం ఐదు రూపాయలు ఫీజుగా తీసుకునే శంకరేగౌడ నామినేషన్ డిపాజిట్ నగదు రూ.10 వేలను కూడా ఐదు రూపాయల నాణేలనే ఇచ్చారు. -
నరేంద్ర మోదీకో ఐదు రూపాయలు
రాంచి: జార్ఖండ్‌లోని లతేహార్ ప్రాంతంలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న 300 గ్రామీణ కుటుంబాలు అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని మే ఒకటవ తేదీన వినూత్న నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. ఈసారి గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మున్నెన్నడూ లేని విధంగా బడ్జెట్లో భారీ కేటాయింపులు జరిపామని చెప్పుకుంటున్న నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ పథకం కింద రోజుకు చెల్లించే దినసరి వేతనాన్ని కేవలం ఐదు రూపాయలు పెంచడాన్ని వారు తీవ్రంగా నిరసిస్తున్నారు. ‘మీ వద్ద నిధులు లేక కేవలం ఐదు రూపాయలను పెంచినట్టున్నారు. ఇదిగో మేము తలా ఓ ఐదు రూపాయలను మీకు విరాళంగా అందజేస్తున్నాము. ఇవి తీసుకోని ఉపాధి హామీ పథనం నిధులు పెంచుకోండి’ అని కార్మిక కుటుంబాలు వ్యంగ్యంగా విమర్శిస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి ఓ లేఖకు ఐదు రూపాయల నోటును జతచేసి పంపించాయి. ఈ వినూత్న నిరసన కార్యక్రమాన్ని ఏ నెలంతా కొనసాగిస్తామని కార్మిక కుటుంబాలు తెలిపాయి. ఉపాధి హామీ పథకం కింద గతేడాది వరకు ఇచ్చిన దినసరి వేతనాన్ని 162 రూపాయల నుంచి 167 రూపాయలకు కేంద్ర ప్రభుత్వం పెంచింది. జార్ఖండ్‌తోపాటు బీహార్, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో దినసరి వేతనాన్ని 162, 159 రూపాయల నుంచి 167కు పెంచుతూ గత మార్చి నెలలో కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జార్ఖండ్‌లో కనీస కార్మిక వేతనం 212 రూపాయలు ఉండగా, దానికన్నా 45 రూపాయలు తక్కువగా ఉపాధి హామీ పథకం కింద చెల్లిండం ఏమిటని కార్మికలోకం ప్రశ్నిస్తోంది. కరవు పరిస్థితులు తీవ్రంగా ఉన్న సమయంలో ఈ సొమ్ము ఏ మూలకు సరిపోతుందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జార్ఖండ్‌లోని లతేహార్ జిల్లాలో 11 లక్షల మంది కార్మికులు ఉపాధి హామీ పథకం కింద రోడ్డు, చెరువులు, బావుల నిర్మాణపు పనుల్లో పాల్గొంటున్నారు. వారికి ఏడాదికి వంద రోజుల పని దినాల్ని కల్పిస్తున్నారు. ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న వారిలో 43 శాతం మంది మహిళలు ఉండగా, 37 శాతం మంది గిరిజనులే ఉన్నారు. 2014లో ఈ పథకం కింద 20 రూపాయలు పెంచగా, గతేడాది 4 రూపాయలు, ఈ ఏడాది ఐదు రూపాయలు పెంచారని, ఈ పెంపులో ఎలాంటి తర్కం లేదని నరేగ సహాయత కేంద్రానికి చెందిన కార్యకర్త జేమ్స్ హెరెంజ్ వ్యాఖ్యానించారు. ఒడిశా రాష్ట్రంలోనైతే ఈ సారి ఒక్క పైసా కూడా పెంచలేదని, వారికి ఇప్పటికే ఇస్తున్న డబ్బులు ఎక్కువని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఉందని జేమ్స్ విమర్శించారు. తమ నిరసన కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేస్తామని, ఇతర జిల్లాల నుంచి ఐదు రూపాయలు జత చేసిన లేఖలను మోదికి పంపిస్తామని కార్మికులు తెలిపారు.