సాక్షి, చెన్నై: ఉత్తర చెన్నై పరిధిలో 5 రూపాయల డాక్టరుగా పేరుగడించిన తిరువేంగడం గుండెపోటుతో మృతిచెందారు. ఎంత రాత్రి వేళైనా సరే తన ఇంటి తలుపు తట్టే పేదోడికి వైద్యం అందించే ఈ డాకర్ ఇక లేరన్న సమాచారంతో సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీరుసెల్వం, ప్రతి పక్ష నేత ఎంకే స్టాలిన్ దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన కుటుంబానికి తమ సానుభూతి తెలియజేశారు.
ఉత్తర చెన్నై పరిధిలోని వ్యాసార్పాడి ఎరుకంచ్చేరి వి కల్యాణపురంలో పేదల వైద్యుడిగా 45 ఏళ్ల పాటు తిరువేంగడం(70) సేవల్ని అందిస్తున్నారు. ఎవరైనా రూ. 5 డాక్టర్ అడ్రస్ అడిగితే చాలు దారి చూపించే వాళ్లు ఆ పరిసరాల్లో ఎక్కువే. ఆ మేరకు తిరువేంగడం సుపరిచితులు. చిన్నతనం నుంచే డాక్టర్ కావాలన్న ఆశతో ప్రభుత్వ కళాశాలలో చదువుకుని, ప్రభుత్వ వైద్యుడిగా సేవల్ని అందించడమే కాకుండా, తన వద్దకు వచ్చే ప్రతి పేదోడికి ఉచితంగా వైద్యాన్ని దరి చేర్చిన ఘనత ఈ డాక్టర్‌కే దక్కుతుంది. తాను ఉచితంగానే చదువుకున్నట్టు, ఆ చదువుకు తగ్గ ఫలితంగా ఉచిత వైద్యం అందిస్తున్నట్టు పదేపదే ఆయన చెప్పుకొచ్చే వారు. ప్రభుత్వ వైద్యుడిగా పదవీ విరమణ అనంతరం పూర్తి స్థాయిలో పేదల సేవకు నిమగ్నమయ్యారు. రోగుల ఒత్తిడి మేరకు తొలుత రూ. 2. ఆ తర్వాత రూ. 5 ఫీజు తీసుకోవాల్సిన పరిస్థితి. ఈ మొత్తాన్ని కూడా మందులు కొనుగోలు చేయలేని పేదలకు ఖర్చు పెట్టే వారు. కేన్సర్‌తో బాధపడే పేద రోగులకు తనవంతుగా సహకారాన్ని అందించారు. 45 ఏళ్లుగా ఉత్తర చెన్నై వాసులకు అవిశ్రాంతంగా సేవల్ని అందించిన డాక్టరు తిరువేంగడం శాశ్వత విశ్రాంతిలోకి వెళ్లారు.
గుండెపోటుతో మృతి..
డాక్టర్ తిరువేంగడంకు భార్య సరస్వతి, కుమార్తె ప్రీతి, కుమారుడు దీపక్ ఉన్నారు. కుటుంబసహకారంతోనే తాను పేదలకు వైద్యం అందించగలుతున్నట్టుగా చెప్పుకొచ్చే తిరువేంగడం కరోనా కాలంలో ఇంటికే పరిమితం అయ్యారు. ఫోన్ ద్వారా వైద్య సలహాలను అందిస్తూ వచ్చారు. ఈ పరిస్థితుల్లో 13వ తేదీ చాతినొప్పితో ఆస్పత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ తిరువేంగడం శనివారం మృతిచెందారు. ఈ సమాచారంతో సీఎం ఎడపాడి, డిప్యూటీ సీఎం పన్నీరు, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ దిగ్భాంతికి లోనయ్యారు. వేర్వేరుగా విడుదల చేసిన ప్రకటనల్లో ఆయన సేవల్ని గుర్తు చేస్తూ, కుటుంబానికి సానుభూతి తెలియజేశారు. ఆదివారం ఇంటి వద్ద ఉంచిన ఆయన భౌతికకాయానికి వైద్యం పొందిన పేదలు కడసారి చూసుకుని కన్నీటి పర్యంతం అయ్యారు. తన తండ్రి పేదల కోసం ఏర్పాటు చేసిన క్లినిక్‌ను ఎలా కొనసాగించే విషయాన్ని నిర్ణయాన్ని త్వరలో ప్రకటిస్తానని తిరువేంగడం కుమార్తె ప్రీతి పేర్కొన్నారు. ఆయన వద్ద 25 ఏళ్ల పాటుగా సహాయకుడిగా పనిచేసిన ఎస్ భూపాలన్ పేర్కొంటూ, అర్ధరాత్రి వరకు రోగులకు వైద్యం అందించే వారు అని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, 2017లో సూపర్ హిట్ కొట్టిన మెర్సెల్ చిత్రంలో ఈ రూ.5 డాక్టర్ ఇతివృత్తంతో ఉత్తర చెన్నై పరిధిలో దళపతి విజయ్‌సేవల్ని అందించే పాత్రను పోషించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment