మనసు దోచుకున్నాడు..
పోలీసులకు టీ అందిస్తున్న వ్యక్తి పేరు శీలంశెట్టి వెంకటరమణ. వృత్తి దొంగతనం. 200లకు పైగా దొంగతనాలతోపోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన చరిత్ర అతనిది. ఎన్నిసార్లు జైలుకు వెళ్లొచ్చినా మార్పు రాలేదు. మళ్లీ ధ్యాసంతా దొంగతనాల పైనే. 2002లో కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేసినా అతనిలో చలనం కలగలేదు. ఆఖరికి తనపై ఉన్న కేసులకు విసుగెత్తి స్వయంగా పోలీసులకు లొంగిపోయాడు. అతనిలో మార్పు వస్తుందనే నమ్మకంతో ఎలాగైనా మార్చాలని సంకల్పించిన పోలీసులు.. ఎట్టకేలకు విజయం సాధించారు. ఆరు నెలల పాటు వెంకటరమణకు, అతని కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చి మంచి మనిషిగా మార్చారు. కృష్ణా జిల్లా రాజరాజేశ్వరీపేట ఇతని స్వస్థలం. పదేళ్ల వయసు నుంచే చెడు సావాసాలతో దొంగతనాలకు అలవాటు పడ్డాడు.
ఇళ్ల లో దొంగతనాలు చేస్తూ జీవనం సాగించేవాడు. తాను చేస్తున్న పనికి ముఖం చూపించుకోలేక భార్యాపిల్లలకు, బంధువులకు దూరంగా బతికేవాడు. పేదరికం, చిన్నతనంలో తెలియనితనంతో దొంగగా మారానని ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే భార్యాపిల్లల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని పూర్తిగా మారిపోయానని కన్నీటి పర్యంతమయ్యాడు వెంకటరమణ. అతడు నలుగురిలో తలెత్తుకుని జీవించేందుకు నగర క్రైం డీసీపీ నవీన్‌కుమార్ సహకారంతో హైదరాబాద్‌లోని ఉప్పల్ పోలీసులు.. దాదాపు 40 వేలతో ఓ టీస్టాల్ ఏర్పాటు చేయించారు. ఈ టీస్టాల్‌ను అదనపు డీసీపీ శ్రీనివాస్, క్రైం ఏసీపీ సాయి మనోహర్, మల్కాజిగిరి ఏసీపీ రవిచందన్‌రెడ్డితో కలసి బుధవారం ప్రారంభించారు. ప్రతి నేరస్తుడు తన నేరప్రవృత్తిని వీడి జనజీవన స్రవంతిలో కలిసేందుకు ముందుకొస్తే తమ వంతు సాయమందిస్తామని ఏసీపీ రవి చందన్‌రెడ్డి పేర్కొన్నారు. వారికి వివిధ రంగాల్లో శిక్షణనిచ్చి గౌరవంగా బతికేందుకు అవకాశం కల్పిస్తామన్నారు.
- హైదరాబాద్