తిరుపతి ఎమ్మెల్యేకు అసెంబ్లీ నివాళి
- వెంకటరమణ అజాతశత్రువని ప్రశంసించిన సభ
- బడుగు, బలహీనవర్గాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు: బాబు
- ఆయన మరణం పేదలకు తీరని లోటు: జగన్
- సంతాప తీర్మానానికి సభ ఆమోదం, అసెంబ్లీ రేపటికి వాయిదా
సాక్షి, హైదరాబాద్: తిరుపతి ఎమ్మెల్యే మన్నూరు వెంకటరమణకు ఏపీ శాసనసభ గురువారం నివాళులర్పించింది. వెంకట రమణ అజాతశత్రువని కొనియాడింది. ఈ మేరకు సంతాపతీర్మానాన్ని ఆమోదించింది. శాసనసభ శీతాకాల సమావేశాలు గురువారం ఉదయం 9 గంటలకు ప్రారంభమైన వెంటనే సీఎం చంద్రబాబు స్పీకర్ అనుమతితో సంతాప తీర్మానాన్ని ప్రతిపాదించారు. వెంకటరమణ కింది స్థాయి నుంచి అంచలంచెలుగా ఎదుగుతూ బలహీనవర్గాల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకున్నారని సీఎం చెప్పారు. సహనానికి మారు పేరుగా నిలిచారని కొనియాడారు. ఆయన మృతి పేదలకు తీరని లోటని చెప్పారు. ఆయన కుటుంబానికి, పిల్లలకు అండగా ఉంటామని తెలిపారు. వెంకటరమణ భార్య సేవకు మారుపేరని, దేవతామూర్తి అని చెప్పారు.
రమణకు మృతికి సభ్యుల సంతాపం
మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, చినరాజప్ప, అచ్చెన్నాయుడు, బి.గోపాల్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, కె.శ్రీనివాసులు, గొల్లపల్లి సూర్యారావు, విష్ణుకుమార్ రాజు, సత్యప్రభ, దేశాయ్ తిప్పారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రోజా, కాలువ శ్రీని వాసులు, నారాయణస్వామి, జగ్గిరెడ్డి తదితరులు వెంకటరమణ మృతికి సంతాపం తెలి పారు. ఆయనతో తమకున్న సాన్నిహిత్యాన్ని, ఆయన సేవాతత్పరతను,అంకితభావాన్ని గుర్తుచేసుకున్నారు. వెంకటరమణ వ్యక్తిత్వాన్ని, ఔన్నత్యాన్ని స్పీకర్ కోడెల శివప్రసాదరావు కొనియాడారు. అనంతరం సభ సంతాప తీర్మానాన్ని ఆమోదించింది. సభ్యులందరూ లేచి నిలబడి కొద్దిసేపు మౌనం పాటించి నివాళులర్పించారు.
పెషావర్ ఉచకోతపై ఖండన
పాకిస్తాన్‌లోని పెషావర్‌లో ఓ సైనిక స్కూలులో తాలిబన్ ఉగ్రవాదులు జరిపిన విద్యార్థుల ఊచకోతను శాసనసభ ఖండించింది. ఈ అమానవీ య, అమానుష సంఘటనను నాగరిక ప్రపం చం సహించకూడదని పేర్కొంది. తాలిబన్ల కిరాతకానికి ఇప్పటికి 148 మంది అభం శుభం తెలియని విద్యార్ధులు ప్రాణాలు కోల్పోయారని, ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న వీరిని ఉన్మాదం తలకెక్కిన ఉగ్రవాదులు కాల్చివేసి తల్లిదండ్రులకు గర్భశోకం మిగిల్చారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈమేరకు సభ ఓ తీర్మానాన్ని ఆమోదిం చింది. విద్యార్థులకు శ్రద్ధాంజలి ఘటిం చింది. సీఎం చంద్రబాబు ఈ తీర్మానాన్ని ప్రతి పాదించారు. ఉన్మాదానికి హద్దులు లేకుండా పోయాయని అన్నారు. ఈ తీర్మానానికి ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి పూర్తి మద్దతు ప్రకటించారు. ఇటువంటి హేయమైన చర్యను యావత్ ప్రపంచం ఖండించాలన్నారు. మరణిం చిన విద్యార్థుల కుటుంబాలకు సానుభూతి తెలి పారు. ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, శ్రీకాంత్ రెడ్డి, విష్ణుకుమార్‌రాజు, జాన్‌బాషా తదితరులు కూడా మాట్లాడారు. అనంతరం సభ శుక్రవారానికి వాయిదా పడింది.
సింగపూర్ తీసుకెళ్లి ఉంటే బాగుండేది: జగన్
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ వెంకటరమణ కుటుంబంతో తమకున్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నా రు. కార్పొరేటర్ స్థాయి నుంచి ఎదిగి అనేక ఉన్నత పదవులు నిర్వహించిన నేత అని కొనియాడారు. అసెంబ్లీ గత సమావేశాలప్పు డే ఆయన ఆరోగ్యం బాగాలేదని గమనించామని, తూలిన పరిస్థితి కూడా చూశామని తెలిపారు. ఆ సందర్భంలోనే సింగపూర్ వెళ్లి వైద్యం చేయించుకోవాలని అనుకున్నారని, ఇదే విషయాన్ని ముఖ్యమంత్రికి చెప్పారని వివరించారు. కానీ ముఖ్యమంత్రి కొందరు కార్పొరేట్ పెద్దలతో కలసి ప్రైవేటు విమానంలో సింగపూర్ వెళ్లారని, అదే విమానంలో రమణను తీసుకుని వెళ్లి వైద్యం చేయించి ఉంటే ఈవేళ ఇలా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చి ఉండేది కాదని అన్నారు.
విధిని ఎవ్వరూ ఆపలేకపోయారని, ఆ కుటుంబానికి అన్ని వేళలా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. రమణకు ఇద్దరు పిల్లలని, వారు మాట్లాడలేని స్థితిలో ఉంటారని, వారిని పెంచి పెద్ద చేసేందుకు ఆ తల్లి (రమణ సతీమణి) ఎంత అవస్థ పడిందో మాటల్లో వర్ణించలేమని ఆవేదన వ్యక్తంచేశారు. ఆ కుటుంబానికి అంతా మంచి జరగాలని ఆకాంక్షిస్తూ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.