మాజీ మంత్రి పెంచలయ్య కన్నుమూత
సూళ్లూరుపేట: వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి పసల పెంచలయ్య సోమవారం రాత్రి నెల్లూరులో కన్నుమూశారు. ఆయన కొద్దిరోజులుగా అనారోగ్యంతో నెల్లూరు అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించడంతో సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. పెంచలయ్య మృతి పట్ల వైఎస్సార్‌సీపీ రాష్ర్ట మహిళా అధ్యక్షురాలు నలుబోయిన రాజసులోచనమ్మతోపాటు కాంగ్రెస్‌కు చెందిన పలువురు సంతాపం వ్యక్తం చేశారు.
నాయుడుపేట మండలం తుమ్మూరుకు చెందిన పెంచలయ్య న్యాయవాద విద్య చదివి నెల్లూరులో సమాచార పౌరసంబంధాల అధికారిగా ఉద్యోగం చేశారు. ఆ తరువాత ఆయన రాజకీయ గురువు నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి అండదండలతో రాజకీయ రంగప్రవేశం చేశారు. 1980లో తిరుపతి ఎంపీగా గెలిచి పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. ఆ తరువాత తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించాక 1984లో ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మళ్లీ 1989లో సూళ్లూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచి 1991లో సమాచారం పౌరసంబంధాల మంత్రిగా పనిచేశారు.
ఆ తరువాత గృహ నిర్మాణ శాఖమంత్రిగానూ పనిచేశారు. 2014లో ఆయన అల్లుడైన సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యను తన రాజకీయ వారసుడిగా ప్రకటించి కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్సార్‌సీపీలో చేరి సంజీవయ్య గెలుపుకోసం పనిచేశారు.