మాజీ మంత్రి అగ్రి కృష్ణమూర్తిని ఎట్టకేలకు అరెస్టు చేశారు. వ్యవసాయ శాఖ ఇంజినీర్ ముత్తుకుమారస్వామి మరణం మిస్టరీని ఛేదించడంలో సీబీసీఐడీ వర్గాలు సఫలీకృతం అయ్యాయి. చెన్నైలో అరెస్టయిన అగ్రిని తిరునల్వేలి(నెల్లై)కు తరలించారు. న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచిన అనంతరం రిమాండ్‌కు తరలించారు.
సాక్షి, చెన్నై :ఫిబ్రవరిలో రైలు ముందు దూకి తిరునల్వేలి జిల్లా తట్టచ్చనల్లూరుకు చెందిన వ్యవసాయ శాఖ ఇంజినీర్ ముత్తుకుమారస్వామి అనుమానాస్పద స్థితిలో మరణించిన విషయం వెలిసిందే. అయితే, ఆయన మరణం వెనుక మిస్టరీ ఉందన్న ఆరోపణలు బయలు దేరాయి. ఆయన పరిధిలోని ఏడు డ్రైవర్ పోస్టుల భర్తీ నిమిత్తం వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న అగ్రికృష్ణమూర్తి నుంచి వచ్చిన ఒతిళ్లు తాళ లేక మరణించినట్టుగా ప్రచారం బయలు దేరింది. దీనిని అస్త్రంగా చేసుకున్న ప్రతి పక్షాలు ప్రభుత్వంపై దుమ్మెత్తి పోయడంతో కేసు విచారణను సీబీసీఐడీకి అప్పగించారు. ఈ విభాగం అధికారులు విచారణ నిమిత్తం రంగంలోకి దిగారో లేదో, మరుసటి రోజే అగ్రికృష్ణమూర్తి మంత్రి పదవి ఊడింది. దీంతో ఆయన హస్తంపై వస్తున్న ఆరోపణలకు బలం చేకూరినట్టు అయింది. అయితే, ఆయన్ను మాత్రం సీబీసీఐడీ వర్గాలు విచారించక పోవడంతో ప్రతి పక్షాలు తీవ్ర విమర్శలు గుప్పించే పనిలో పడ్డాయి. కేసును సీబీఐకు అప్పగించినప్పుడే న్యాయం జరుగుతుందని డిమాండ్ చేస్తూ వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఎట్టకేలకు ఆదివారం ఉదయాన్నే హఠాత్తుగా కృష్ణమూర్తిని అరెస్టు చేసిన సీబీసీఐడీ వర్గాలు తిరునల్వేలికి తరలించారు.
అగ్రి అరెస్టు:
ముత్తుకుమార స్వామి మృతి కేసును పలు కోణాల్లో విచారించిన ప్రత్యేక బృందం శనివారం అగ్రికృష్ణమూర్తికి సమన్లు జారీ చేసింది. తమ విచారణకు రావాలని సీబీసీఐడీ నుంచి వచ్చిన పిలుపుతో అదే రోజు రాత్రి ఎగ్మూర్‌లోని కార్యాలయానికి అగ్రి వెళ్లారు. ఆయనతో పాటుగా వ్యవసాయ శాఖ ఇంజినీరింగ్ అధికారి సెంథిల్‌ను రాత్రం తా సీబీసీఐడీ వర్గాలు విచారించాయి. ఉదయాన్నే ఐదు గంటలకు ఆయన్ను అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించారు. అగ్రి కృష్ణమూర్తితో పాటుగా సెంథిల్‌ను కూడా అరెస్టు చేసిన అధికారులు చెన్నై నుంచి ఓ ప్రత్యేక వాహనంలో తిరునల్వేలికి తరలించారు. గట్టి భద్రత నడుమ తిరునల్వేలికి చేరుకున్న అధికారుల బృందం నేరుగా అక్కడి జిల్లా మూడవ మెజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి సెంథిల్ కుమార్ ఇంటికి తీసుకెళ్లారు.
రిమాండ్‌కు తరలింపు:
అరగంట పాటుగా అక్కడ సాగిన విచారణ అనంతరం పదిహేను రోజు రిమాండ్‌కు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. అగ్రి కృష్ణమూర్తి అరెస్టు సమాచారంతో అన్నాడీఎంకేకు చెందిన పలువురు న్యాయవాదులు, మీడియా ప్రతినిధులు న్యాయమూర్తి క్వార్టర్స్ వద్దకు పరుగులు తీయడంతో కాసేపు ఉత్కంఠ నెలకొంది. చివరకు కట్టుదిట్టమైన భద్రత నడుమ ఆ ఇద్దర్నీ పాళయం కోట్టై జైలుకు తరలించారు. ఆ ఇద్దర్నీ తమ కస్టడీకి తీసుకుని విచారించేందుకు కోర్టులో సోమవారం పిటిషన్ దాఖలు చేయడానికి కసరత్తుల్లో మునిగి ఉన్నారు. అలాగే, ఈ కేసు మరో ముగ్గురి మెడకు ఉచ్చు బిగించే దిశగా సీబీసీఐడీ కార్యాచరణను సిద్ధం చేసి ఉన్నట్టుగా సంకేతాలు వెలువడుతున్నాయి. అగ్రికృష్ణమూర్తి అరెస్ట్‌ను ప్రతి పక్షాలు స్వాగతించాయి. అయితే, ఈ కేసును సీబీఐకు అప్పగించాల్సిందేనని డీఎంకే, కాంగ్రెస్, పీఎంకే, ఆమ్‌ఆద్మీలు డిమాండ్ చేస్తున్నాయి.
తొలి ఎమ్మెల్యే :
అన్నాడీఎంకే సర్కారు అధికారంలోకి వచ్చాక మంత్రులపై చిన్న పాటి ఆరోపణలు, ఫిర్యాదులు వచ్చినా పదవులకు ఉద్వాసనలు పలకడం సహజం. ఆ దిశగా ఇప్పటి వరకు ఎందరో మంత్రుల పదవులు ఊడాయి. ఇందులో అగ్రికృష్ణమూర్తి కూడా ఉన్నారు. గతంలో ఓ మారు ఆరోపణలతో మంత్రి పదవిని కోల్పోయిన ఆయన మీద మళ్లీ ఆ పార్టీ అధినేత్రి జయలలిత కరుణ చూపించారు. వ్యవసాయ శాఖ పదవి అప్పగించడం, అందులోనూ తన పనితనాన్ని ప్రదర్శించిన అగ్రి చివరకు కటకటాల పాలు కావాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో ఆరోపణల నేపథ్యంలో ఎందరో మంత్రులకు పదవులు ఊడినా, ఎమ్మెల్యేలపై పార్టీ పరంగా చర్యలు తీసుకున్నా, ఏ ఒక్కరూ అరెస్టు కాలేదు. ఆ జాబితాలో తొలి ఎమ్మెల్యేగా, మాజీ మంత్రిగా అగ్రి చోటు దక్కించుకున్నారు.
‘అగ్రి’ అరెస్ట్
Published Mon, Apr 6 2015 1:04 AM | Last Updated on Wed, Oct 3 2018 7:31 PM
Advertisement
Advertisement