పరకాయ ప్రవేశం చేయడంలో చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్యని, దానిని అమలు చేయడంలో ఆయనకు సాటి మరొకరు ఉండరని మాజీ మంత్రి శైలజానాథ్ విమర్శించారు. మంగళవారం విజయవాడ ఇందిరాభవన్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఆర్డీఏ చైర్మన్ గా ఒకపక్క తనకు అవసరమైన డాక్యుమెంట్లపై సంతకాలు చేసుకుంటున్న బాబు మరో పక్క ముఖ్యమంత్రిగా అక్కడి నుంచి వచ్చే డాక్యుమెంట్లను వేగంగా, సమర్ధంగా అమలు చేయడంలో ముందుటున్నారన్నారు.
ప్రభుత్వ భూములను సింగపూర్ కంపెనీలకు ఇస్తూ రూ.5,500 కోట్లతో మౌలిక వసతులను కల్పించడంలో అనేక మందితో కుదుర్చుకున్న ఒప్పందాల విషయంలో ఆరోపణలు ఉన్నాయన్నారు. రాజధానిని ప్రాజెక్టు నుంచి సింగపూర్ సంస్థను తొలగిస్తే అపరాధ రుసుం కింద 20 శాతం చెల్లించాలనే నిబంధనను సవరించాలనే ఆర్ధికశాఖ అభ్యంతరానికి బాబు ఎందుకు మిన్నకుండిపోయారని ప్రశ్నించారు. రైతులను బెదిరించి పోలీసులు, తహశీల్దార్లు, ఆర్డీవోలను ఉపయోగించి బలవంతంగా భూములను సేకరిస్తోందని మండిపడ్డారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో హైదరాబాద్ ను పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంచగా, తన స్వార్ధం కోసం ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తున్నారన్నారు.