పెళ్లి చేయం గానీ కాపురం చేయిస్తామంటే ఎలా?
అలా అంటే చెప్పుతో కొడతారు
హోదా విషయంలో ముగ్గురు కలిసి ముంచేశారు
మోదీ, చంద్రబాబు, వెంకయ్యపై ఉండవల్లి ధ్వజం
కేసులు ముఖ్యం కాదని ప్రధానితో చెప్పాలని బాబుకు సూచన
న్యూఢిల్లీ: ‘ పెళ్లి చేయం కానీ.. కాపురం చేయిస్తామని, అన్ని సౌకర్యాలూ కల్పిస్తామని చెబితే ఎలా ఉంటుంది? చెప్పుతో కొడతారు. ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరు కూడా ఇలాగే ఉంది. ప్రత్యేక హోదా ఇవ్వరట. కానీ అంతకంటే ఎక్కువ సదుపాయాలు కల్పిస్తారట..’ అని పార్లమెంటు మాజీ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఢిల్లీలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... ‘నిన్న చంద్రబాబు ప్రధానమంత్రిని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్నప్పుడే తోక ముడిచినట్టు కనిపించారు. స్పెషల్ స్టేటస్ ఇస్తే బీజేపీ బలపడుతుందని చంద్రబాబుకు భయం. స్పెషల్ స్టేటస్ ఇస్తే టీడీపీ బలహీనపడుతుందని వెంకయ్యనాయుడి భయం. ఇద్దరు నాయుడులూ కలిసి రాష్ట్రాన్ని ఈ పరిస్థితిలోకి నెట్టేశారు. పెళ్లెందుకండీ.. సదుపాయాలు కల్పిస్తామండీ అంటే ఎవరైనా ఊరుకుంటారా? చెప్పు తీసుకుని కొడతారు. ఇక్కడ పెళ్లంటే స్పెషల్ స్టేటసే. నాడు దీని పేరు చెప్పే వెంకయ్యనాయుడు, చంద్రబాబు నాయుడు ప్రచారం చేశారు. మోదీతో కూడా పదే పదే చెప్పించారు. అసలు స్పెషల్‌స్టేటస్ గురించి కాంగ్రెస్ ఆనాడు ప్రస్తావించనేలేదు. బీజేపీ వారే ఐదేళ్లకు ఒప్పుకొన్నారు. పదేళ్లు కావాలని రాజ్యసభలో డిమాండ్ చేశారు. ఎలాగూ అధికారంలోకి వస్తాం కాబట్టి పదేళ్లు ఇస్తామన్నారు. కానీ ఇప్పుడేమైంది? రాష్ర్ట విభజన కన్నా దారుణ అవమానం ఇది...అలా చేసినందుకే కాంగ్రెస్‌ను జనం కొట్టారు. మిమ్మల్ని కొట్టడానికి నాలుగేళ్ల వరకూ ఎన్నికలు లేవు. మీరు అనుభవజ్ఞులని జనం నమ్మడం వల్లే 1.3 శాతం ఓట్లు అధికంగా పడ్డాయి...’ అని పేర్కొన్నారు. ‘నీతి ఆయోగ్ ద్వారానే బిహార్‌కు స్పెషల్ ప్యాకేజీ వచ్చిందా? మోదీకి నచ్చితే ఏమైనా చేస్తారు. మీ ముఖం ఆయనకు నచ్చలేదు కాబట్టే మీకు ఇవ్వడం లేదు..’ అంటూ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు.
వైఎస్సార్‌సీపీ ఒక్కటే వ్యతిరేకించింది..
‘విభజనకు అనుకూలంగా ఆనాడు కేంద్రం నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి వ్యతిరేకంగా నిలబడింది ఒక్క వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయే. మిగిలిన అన్ని పార్టీలూ అక్కడో మాట.. ఇక్కడో మాట మాట్లాడాయి. అయినా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాపై పదే పదే ప్రచారం చేసిన వెంకయ్యనాయుడిని, న రేంద్ర మోదీని చూసి టీడీ పీని గెలిపించారు. తల దించుకోవడం కంటే.. తల తీసేసుకోవడం మేలు. వెంటనే మీరు మంత్రివర్గం నుంచి వైదొలగండి. ఇప్పటికైనా చంద్రబాబు వెళ్లి నాకు నా జీవితం ముఖ్యం కాదు, కేసులు ముఖ్యం కాదు.. రాష్ట్రమే ముఖ్యం అని చెప్పాలి. ఇందుకోసం చంద్రబాబు పోరాడితే హీరో అవుతారు..’ అని అన్నారు.