
ఇంటికి తాళాలు వేయడంతో పిల్లలతోపాటు బయట ఉన్న దంపతులు
రామవరప్పాడు : టీడీపీకి చెందిన ఎనికేపాడు మాజీ సర్పంచ్ వరికూటి కోటేశ్వరరావు తన అనుచరులతో ఓ దళిత కుటుంబంపై దౌర్జన్యానికి దిగాడు. వర్షం కురుస్తున్నా కనికరించకుండా, చిన్న పిల్లలని కూడా చూడకుండా ఇంటి నుంచి బయటికి పంపి తాళం వేశాడు. చంకలో చంటి బిడ్డతో బాధిత కుటుంబం తీవ్ర ఇబ్బందులకు గురయింది. చేసేదిలేక వారు పటమట పోలీసులను ఆశ్రయించారు.
బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... ఎనికేపాడు దళితవాడలో జి. నాగరాజు, అంజలి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి, వీరి కుటుంబ సభ్యుల మధ్య ఎప్పటి నుంచో ఆస్తి తగాదాలు ఉన్నాయి. నాగరాజు దంపతులు ఉమ్మడి ఆస్తి తాలుకా డబ్బు చెల్లించే విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ విషయంపై ఆదివారం ఉదయం మాజీ సర్పంచ్ వరికూటి కోటేశ్వరరావు తన అనుచరులతో నాగరాజు ఇంట్లోకి ప్రవేశించి దంపతులతో పాటు వారి పిల్లలను బలవంతంగా బయటకు గెంటేశారు. ఇంటికి తాళాలు వేసి ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి.. డబ్బులు చెల్లిస్తేనే తాళాలు తీసేది అంటూ హడావుడి చేశాడు. బాధితుడు చేసేదిలేక పటమట పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించాడు. పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాలతో ఘటనా స్థలానికి కానిస్టేబుల్ చేరుకుని ఇరుపక్షాలతో మాట్లాడి ఇంటికి వేసి ఉన్న తాళాలను తీయించారు.
ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తా
నాగరాజు మాట్లాడుతూ ఆస్తికి సంబంధించి వివాదాలు ఉంటే కోర్టులోనో, పెద్ద మనుషుల మధ్యనో తెల్చుకోవాలి గాని ఇలా ఇళ్లపై పడి చిన్నపిల్లలు ఉన్నారని కూడా చూడకుండా వర్షంలో బయటకు తోసేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ విషయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment