
బీజేపీలోకి పురందేశ్వరి?
నేడు ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలను కలుస్తానని వెల్లడి
సాక్షి, విశాఖపట్నం: మాజీ కేంద్ర మంత్రి దగ్గుపాటి పురందేశ్వరి భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపారు. బీజేపీ అగ్రనేతలు రాజ్‌నాథ్‌సింగ్, ఎల్‌కే అద్వానీ, సుష్మాస్వరాజ్‌లను శుక్రవారం ఢిల్లీలో కలవనున్నానని ఆమె చెప్పారు. ఆమె గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... తాను ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న విశాఖనుంచే తిరిగి పోటీ చేయనున్నట్లు వెల్లడించారు. రాష్ర్ట విభజనకు మద్దతు పలికిన పార్టీలోకి ఎలా వెళతారని విలేకరులు ప్రశ్నించగా చిరునవ్వుతో సమాధానం దాటవేశారు. తమ మనోగతాన్ని కాదని కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్రాన్ని విభజించిందని విమర్శించారు. విభజన బిల్లు సమయంలో లోక్‌సభలో పోలవరం ప్రాజెక్ట్, సీమాంధ్రకు రావాల్సిన నిధులు గురించి అడిగినా కేంద్రం పట్టించుకోలేదన్నారు. కేంద్రమంత్రిగా విలువ ఇవ్వనప్పుడు ఆ పార్టీలో కొనసాగలేకపోయానని చెప్పారు. ఆ పార్టీని వీడుతున్నందుకు బాధాగానే ఉందన్నారు. అంతకుముందు ఆమె విశాఖపట్నం రుషికొండలోని తన నివాసంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులతో భేటీ అయ్యారు. పురందేశ్వరి పార్టీని వీడడం ఇష్టంలేని కొందరు కార్యకర్తలు ఆమె నిర్ణయాన్ని వ్యతిరేకించినట్లు తెలిసింది. ఆమె భర్త దగ్గుపాటి వెంకటేశ్వరరావు కూడా పార్టీని వీడాల్సిన పరిస్థితులపై కార్యకర్తలకు వివరించారు.
ఏ పార్టీలోకి వెళ్లేదీ పురందేశ్వరి స్పష్టం చేయకపోవడంతో అక్కడికి వచ్చిన వారు కొంత గందరగోళంలో పడ్డారు. ప్రస్తుతం బీజేపీతో పొత్తు పెట్టుకొనేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందని, ఆ లెక్కన మీరు బీజేపీలో చేరితే టీడీపీకి దగ్గరవుతున్నట్లేకదాని విలేకరులు ప్రశ్నించగా... అలాంటి పొత్తులు సాధారణమేనని పురందేశ్వరి చెప్పారు. కాంగ్రెస్‌కు అనుకున్నన్ని సీట్లు రాని పక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటుందని అనుకుంటున్నానని, ఇలాంటి పొత్తులు సాధారణమేనని వ్యాఖ్యానించారు. కాగా కార్యకర్తల సమావేశం ముందు పురందేశ్వరి దంపతులను స్థానిక ఎమ్మెల్యేలు మళ్ల విజయప్రసాద్, ద్రోణంరాజు శ్రీనివాసరావులు కలిశారు. అయితే, పురందేశ్వరి తాను బీజేపీలో చేరతానని చెప్పడంతో వారు సమావేశం నుంచి అర్ధంతరంగా నిష్ర్కమించారు.